భానుడి ప్రతాపం... వరుణుడి కరుణ

నరసరావుపేట  (గుంటూరు జిల్లా) : మహానేత రాజన్న అంటే ప్రకృతికి పరవశం. ఆయన ఉన్నన్నాళ్ళూ నెల మూడు వానలు అన్నట్లుగా సమృద్ధిగా వర్షాలు కురిశాయి. పంటలు పండాయి. ప్రజలూ సుఖంగా జీవనం సాగించారు. అసమర్థ కాంగ్రెస్‌ పాలనలో కష్టాలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు మేమున్నామంటూ భరోసానిస్తూ 83 రోజులుగా ఆ మహానేత తనయ శ్రీమతి షర్మిల చేస్తున్న చారిత్రక మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను కూడా ప్రకృతి సానుకూలంగా ఆహ్వానించింది.

పగలంతా సూర్యుడు చండ్ర నిప్పులు చెరిగాడు. తన ప్రతాపాన్ని ప్రదర్శించాడు. సాయంత్రం అయ్యేసరికి చల్లబడ్డాడు. భోజన విరామం అనంతరం ప్రారంభమైన శ్రీమతి షర్మిల పాదయాత్రకు ప్రకృతి సానుకూలంగా స్పందించింది. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. వాతావారణం చల్లగా మారిపోయింది. శ్రీమతి షర్మిల నడిచే దారి పొడవునా స్థానికులు, అభిమానులు పూలు జల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇదే సమయంలో పాదయాత్రకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు రెట్టింపు సంఖ్యలో తరలిరావడంతో సత్తెనపల్లి, నరసరావుపేట ప్రధాన రహదారి జనసందోహంతో కిక్కిరిసిపోయింది. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో శ్రీమతి షర్మిల పాదయాత్ర సందర్భంగా బుధవారం ఆవిష్కృతమైన దృశ్యాలివీ...

శ్రీమతి షర్మిల పాదయాత్రకు ముందూ వెనుకా రెండు కిలోమీటర్ల పరిధిలో ఎటు చూసినా జనమే జనం. దారి పొడవునా కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి హర్షాన్ని ప్రకటించారు. బరంపేట బైపాస్‌రోడ్డు మిట్టబజారు వద్ద ఉన్న మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి శ్రీమతి షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదే సమయంలో చిరు జల్లులు ప్రారంభమయ్యాయి. వర్షంలోనే తడుస్తూనే శ్రీమతి షర్మిల బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో వర్షం పెరిగినా అభిమానజనం కించిత్తు కూడా కదలకుండా తడుస్తూనే ఆమె ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించడం విశేషం.

ప్రజా సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ తీరుకు, దానితో అంటకాగుతూ వత్తాసు పలుకుతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వైఖరికీ నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల రాష్ట్రంలో సుదీర్ఘ, చారిత్రక ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేస్తున్నారు. శ్రీమతి షర్మిలకు పాదయాత్రకు నరసరావుపేట ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు.

బుధవారం ఉదయం శ్రీమతి షర్మిల సత్తెనపల్లి నియోజకవర్గం గోళ్లపాడు శివారులోని బస కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి తదితరులు‌ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అప్పటికే భానుడు తమ ప్రతాపాన్ని చూపుతున్నా లెక్కచేయకుండా ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీమతి షర్మిలతో కలిసి అడుగులు వేశారు. అక్కడి నుంచి పాదయాత్ర రెండు కిలోమీటర్ల దూరంలోని నరసరావుపేట నియోజకవర్గంలోని ములకలూరు చేరింది.

ములకలూరులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్ కోతలు, పెరుగుతున్న ధరలతో బతకలేకపోతున్నామని, మహానేత వై‌యస్ హయాంలో తమ బతుకులు బాగున్నాయని రైతులు ‌చెప్పుకున్నారు. వారి మాటలపై స్పందించిన శ్రీమతి షర్మిల మాట్లాడుతూ, జగనన్న నేతృత్వంలో రాజన్న పాలన త్వరలోనే వస్తుందని, రాజన్న ఇచ్చిన హామీలన్నింటిని జగనన్న నెరవేరుస్తారని, పథకాలన్నీ తిరిగి అమలులోకి వస్తాయని భరోసా ఇచ్చారు. అనంతరం ఇస్సపాలెం బి.సి. కాలనీ వద్ద ఏర్పాటు చేసిన వైయస్‌సిపి జెండాను శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద శ్రీమతి షర్మిలకు పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తరువాత అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి శ్రీమతి షర్మిల చేరుకున్నారు.

జగనన్న సి.ఎం. కాకుండా ఎవరూ ఆపలేరు :
పాత పల్నాడు బస్టాండ్ సెంట‌ర్‌లో జరిగిన బహిరంగ సభలో శ్రీమతి షర్మిల అధికార, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌, టిడిపిలపై చేసిన ఘాటు విమర్శలకు ప్రజలు విశేషంగా స్పందించారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్, ‌టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుల పాలనలోని వ్యత్యాసాలను గణాంకాలతో సహా శ్రీమతి షర్మిల వివరించడం ప్రజలను ఆకట్టుకుంది. ఎవరెన్ని కుట్రలు పన్నినా జగనన్న సిఎం కాకుండా ఆపలేరని, అప్పటి వరకు మీరంతా సహకరించాలని, జగనన్నను ఆశీర్వదించాలని శ్రీమతి షర్మిల కోరారు.

అంతకు ముందు పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖ‌ర్, నియోజకవర్గ నాయకులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి‌ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ కో‌ ఆర్డినేటర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), జిల్లా పరిశీలకుడు పూనూరి గౌతంరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, డాక్టర్ నన్నపనేని సుధ, ఎస్సీ,‌ ఎస్టీ, బి.సి., మైనార్టీ విభాగాల కన్వీనర్లు బండారు సాయిబాబు, హనుమంత నాయక్‌, దేవెళ్ల రేవతి, సయ్యద్ మహబూ‌బ్, గుంటూరు నగర కన్వీనరు లేళ్ల అప్పిరెడ్డి, ముస్తాఫా, ‌అల్తా‌ఫ్ తదితరులు పాల్గొన్నారు.
Back to Top