బందరు పోర్టు రాజకీయ కోర్టు


పోర్టు రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్నికలు దగ్గరపడే దాకా చంద్రబాబుకు హామీలేవీ గుర్తుకురాలేదు. ఇప్పుడు తను చేసిన సవాలక్ష హామీలకు శంకుస్థాపనలు, పునాదిరాళ్లు, రిబ్బన్ కటింగ్ లు, పైలాన్ ఆవిష్కరణలతో ప్రజలను మభ్యపెట్టే పనులు మొదలెట్టేశాడు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు నివ్వడమే కాదు, వివిధ అభివృద్ధి పనులకు టెంకాయి కొడుతున్నా నాకు ఓటేస్తేనే అవి పూర్తి అవుతాయని బెదిరింపు రాజకీయాలకు తెరతీయబోతున్నాడు. తాజాగా బందరు పోర్టు విషయంలో చంద్రబాబు అర్థంతరంగా ల్యాండ్ పూలింగ్ పనులు పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టాడు. నెలలోపలే శంకుస్థాపన మొదలెట్టేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశాడు. నాలుగేళ్లుగా నడిసముద్రంలో వదిలేసిన పోర్టు హామీని నెరవేరుస్తున్నానని చెబుతూ కృష్ణావాసుల కోర్టులో ఓటు బంతిని వేయాలనుకుంటున్నాడు చంద్రబాబు. 

వైఎస్ హయాంలోనే శంకుస్థాపన

మచిలీపట్నం పోర్టుకు దివంగతనేత వైఎస్సార్ హయాంలోనే శంకుస్థాపన జరిగింది. అప్పట్లో నవ యుగ సంస్థ పోర్టు ప్రాజెక్టు దక్కించుకుంది. పోర్టు పనులు ఆరంభమైతే ఆ క్రెడిట్ అంతా వైఎస్సార్ కు దక్కుతుందనే నాడు చంద్రబాబు ఈ ప్రాజెక్టు విషయంలో ఎన్నో ఆరోపణలు చేసాడు. తీరా వైఎస్సార్ మరణించాక, అధికారంలోకి వచ్చిన టిడిపి సర్కార్ నాలుగేళ్లుగా కనీసం లాండ్ పూలింగ్ చేయడంలోనూ విఫలం అయ్యింది. 2015లోనే 30వేల ఎకరాల లాండ్ పూలింగ్ కు నోటిఫికేషన్ ఇచ్చింది టిడిపి ప్రభుత్వం. పోర్టు నిర్మాణానికి 5200 ఎకరాలు కేటాయించాల్సి ఉండగా అందులో 4800 ఎరాలు నిర్మాణ సంస్థ నవయుగకు అప్పగించాల్సి ఉంది. దీంతోపాటు పోర్టు ఆధారిత పరిశ్రమలకూ భూములు కేటాయించాలి. బందరు తీరంలో ఆయిల్ రీఫైనరీ, పెదపట్నంలో మెరైన్ అకాడమీ, పవర్ ప్లాంట్లుు, ఇతర పరిశ్రమలు ఏర్పాటు కావాల్సి ఉంది. వీటన్నిటి కోసం 30 వేల ఎకరాల సేకరణ అని చంద్రబాబు చెబుతున్నారు. ఇందులో 15,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, ప్రైవేటు 14,427 ఎకరాలు ఉన్నాయి. బందరు ప్రాంత రైతులకు నష్టపరిహారంపై ఎలాంటి స్పష్టమైన హామీ లేకపోవడంతో వారు ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తున్నారు. 

రైతుల పట్ల వివక్ష

రాజధానికి భూములిచ్చిన రైతులకిచ్చే పరిహారంతో పోలిస్తే మచిలీపట్నం పోర్టకు ప్రభుత్వం ఇస్తామంటున్న ప్యాకేజీ చాలా తక్కువగా ఉంది. ఇదే మచిలీపట్నం తీరప్రాంత రైతులు పోర్టును అడ్డుకోడానికి కారణం అవుతోంది. సరైన నష్టపరిహారం ఇవ్వకుండా కారు చౌకగా రైతుల భూములు కొట్టేయాలనే సర్కార్ ఆలోచనలను ఈ ప్రాంత వాసులు కలిసి కట్టుగా వ్యతిరేకిస్తున్నారు. మచిలీపట్నం ఓడరేవు నిర్మించినా అది కార్గో అంటే సరుకుల రవాణాకు పెద్దగా లాభదాయకంగా ఉండదంటూ అధికారులు మరికొన్ని కొర్రీలు పెడుతున్నారు. పారిశ్రామిక వాడకు దీన్ని లింక్ చేస్తే తప్ప ఈ పోర్టు పెద్దగా ఉపయోగపడదని అధికారులంటున్నారు. 

పోలవరానికి దిక్కులేదు పోర్టు ఏడాదిలో కడతారట
ఇదే మాట అనుకుంటున్నారు మచిలీపట్నం ప్రజలు. నాలుగేళ్లుగా పోలవరం పనులు పూర్తి చేయలేదు. కానీ ఏడాదిలోపల బందరు పోర్టు కట్టేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కొల్లు రవీంద్ర వంటి వారిని చూసి మచిలీపట్నం వాసులు చేస్తున్న విమర్శలివి. ఎప్పటి లాగా చంద్రబాబు శంకుస్థాపన చేసిన వాటికే మళ్లీ మళ్లీ చేస్తుండటం ఆనవాయితీ కనుక ఎప్పుడో 2008లో వైఎస్సార్ శంకుస్థాపన చేసిన బందరు పోర్టుకు బాబు మరోసారి శంకుస్థాపన చేయనున్నారు. అదీ జూన్ లోనే జరిగిపోవాలని చంద్రబాబు ఆదేశం. 

అభివృద్ధి అథారిటీ చేసిందేం లేదు

మచిలీపట్నం ప్రాంత అభివృద్ధి అథారిటీ పేరుతో ఏర్పాటు చేసిన శాఖ ఏం చేసిందో తెలియదు. తీరప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, ఓడరేవల అభివృద్ధి, హార్బర్, విశ్వవిద్యాలయం, బీచ్ కారిడార్ అభివృద్ధి ద్వారా ఉత్పత్తి ఉపాధి అవకాశాలతో ఎంతో పెరిగే ఈ బృహత్తర ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు కు నాలుగేళ్లు కూడా చాల్లేదు. 
గతంలో నంద్యాల ఎన్నికల్లో రోడ్లను తవ్వి, రోడ్ల పక్కన ఇళ్లను కూలగొట్టి ఓట్లేస్తేనే ఆ పనులు పూర్తి చేస్తామని బెదిరించి మేనేజ్ చేసి గెలిచిన టీడీపి రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ పోర్టు శంకుస్థాపనను చూపి ఓట్లు దండుకోనుందన్నమాట. 


 
Back to Top