బాధ్యతపై రాహుల్ బెరుకు

తండ్రి నుంచి వారసత్వంగా వచ్చే వాటిలో ఆయన ధరించిన ఉంగరం మొదటిది. అంతవరకూ తీసుకుంటే తప్పులేదు. సమంజసం కూడా. ఆస్థిలో వాటా అడగడమూ తప్పు కాదు. అది వారసుడి హక్కు. తరాల తరబడి అధికారాన్ని పంచేసుకోవాలనుకోవడం.. ఆ పీఠం తమకేనని ఓట్రించడం.. సమయం కాదని భావిస్తే వేరొకరిని ఆ పీఠంపై కూర్చోబెట్టి, అదను కోసం వేచి ఉండటం.. ఆపై దక్కించుకోవడం.. ఇది ఇంతవరకూ కాంగ్రెస్ చేసింది. చేస్తూనే ఉంటుంది కూడా.

రాహుల్ గాంధీని యువరాజుగా ప్రకటించి ఆరేళ్ళు గడిచింది. ప్రధాని మన్మోహన్ సింగ్ తన కేబినెట్లో చేరాలని ఆయనను చాలాసార్లు ఆహ్వానించారు కూడా. ఎప్పటికప్పుడు ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా ఆయన దానికి తల అడ్డంగా ఊపుతున్నారు. బాధ్యత స్వీకరించడానికి భయమా లేక యుక్తవయసులో లేని పోని బరువెందుకన్న ఆలోచనా? ఏదైతేనేం తప్పించుకుంటున్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారాన్ని తనపై వేసుకున్న రాహుల్‌కు ఫలితాలు తల బొప్పి కట్టించాయి. బిత్తరపోయేలా చేశాయి. దిక్కుతోచని స్థితిలో పడేశాయి. యూపీఏ-2 ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్న కుంభకోణాలు ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి.

రండిరండని కాంగ్రెస్ వందిమాగధులు ఎర్ర తివాచీ పరుస్తున్నప్పటికీ ఎందుకనో యువరాజావారు పీఠంపై ఆసక్తి చూపడం లేదు. ఆయనను ప్రధాని చేయాలన్న వారి ప్రయత్నాలు సాగడం లేదు. జవహర్ లాల్ నెహ్రూ వారసురాలిగా ఇందిరా గాంధీ ప్రధాని పీఠమెక్కిన తదుపరి వారసత్వ రాజకీయాలు జోరందుకున్నాయి. అంతా తానై మెలిగిన ఇందిర మరణానంతంర రాజీవ్ గాంధీని ఎటువంటి సందేహం లేకుండా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు. ఆయన హత్యానంతరం మేడమ్.. పీవీకి ప్రధాని పదవిని అప్పగించడం, తదుపరి మన్మోహన్‌కు ఆ అవకాశం లభించడం తెలిసిందే. గాంధీయేతర కుటుంబం నుంచి అత్యధిక కాలం ప్రధాని పదవిలో కొనసాగిన ఘనత ఆయనకే దక్కుతుంది.

మన్మోహన్ పదవి స్వీకరించిననాటినుంచే రాహుల్‌కు ప్రధాని పదవి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. తొలుత పార్టీ ప్రధాన కార్యదర్శిని చేశారు. తదుపరి ఎంపీగా గెలిపించి, లోక్‌సభలో ప్రవేశం కల్పించారు. అయినా.. కేబినెట్‌లో చేరండన్న మన్మోహన్ పిలుపును ఆయన తప్పించుకుంటూ వస్తున్నారు. నేరుగా ప్రధాని పీఠం ఎక్కాలన్నదే ఆయన ఊహ కాబోలునని పరిశీలకులు విశ్లేషించుకుంటున్నారు.

రెండు రాష్ట్రాలలో ఓటమి అపఖ్యాతిని మూటగట్టుకున్న రాహుల్ గాంధీని ఎలాగైనా ప్రధానిని చేసేయాలనే కృతనిశ్చయంతో కాంగ్రెస్ కేడర్ కనిపిస్తోంది. ఎన్డీటీవీ ఎన్నికల సర్వే నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో గెలిచే సూచనలు కనిపించడంలేదని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. బొగ్గు కుంభకోణానికి తనదే బాధ్యతని అంగీకరించిన మన్మోహన్‌ను ‌తప్పించి రాహుల్‌కు అధికారాన్ని కట్టబెడితే బాగుంటుందని ఆశిస్తున్నాయి.

మరోవంక, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహనరెడ్డిని.. ముఖ్యమంత్రి పీఠం కోసం అర్రులు చాస్తున్నారనే విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాహుల్‌ను ప్రధాని చేయాలని వెనకాడడం లేదు. ఈ అంశంలో అందరికీ ఒకే సూత్రాన్ని పాటిస్తే బాగుండునని కొందరికి ఉంది. ఈ తరుణం దాటిపోతే, ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోతే.. పట్టాభిషేకం ఆగిపోతుందనేది మరికొందరి వాదన. ఇప్పడు ప్రధానిని చేసేస్తే కనీసం మాజీ ప్రధాని అనే ముద్రతో రాహుల్ ఎన్నికలకు వెళ్ళవచ్చనీ, సెంటిమెంటు కొంత పనిచేస్తుందనీ కూడా కొందరు వాదిస్తున్నారు. దానివల్ల కొన్ని స్థానాలు అదనంగా లభించి ఏమాత్రం అవకాశమున్నా యూపీఏ-3 పేరిట ప్రభుత్వాన్ని నడిపేయోచ్చనే అంశాన్ని వారు చూపుతున్నారు.

Back to Top