బాబు వచ్చె... జాబు పోయె... ఢాం..ఢాం..ఢాం..!

హైదరాబాద్:  బాబు వస్తాడు, జాబు వస్తుంది అని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు బాగా ఊదర గొట్టారు. ఎన్నికల ప్రచారం లో ఏ మూలకు వెళ్లినా అదే నినాదం వినిపించేది. కానీ ఏడాది దాటిపోయినా ఇప్పటి దాకా అటువంటి జాడ కనిపించటం లేదు. ఒకటి, రెండు అరకొర నోటిఫికేషన్లు విదిలించటం తప్ప బలమైన నోటిఫికేషన్లు ఇప్పటి దాకా రానే లేదు. ఒక వైపు తెలంగాణ రాష్ట్రంలో 15వేల ఉద్యోగాల కోసం ప్రకటనలు జారీ అయ్యాయి. ఇటు అదే సమయంలో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఉద్యోగాల ఊసే వినిపించటం లేదు. నోటిఫికేషన్ల కోసం కసరత్తు కూడా జరగటం లేదు.
ఇప్పుడు మాట మార్చి ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగం కాదు, ప్రైవేటు ఉద్యోగం అంటూ పచ్చ చొక్కాలు బొంకుతున్నాయి. కానీ వాస్తవంలో ఆమాత్రం ప్రైవేటుఉద్యోగాల జాడ కూడా కనిపించటం లేదు. సింగపూర్, చైనా, జపాన్ వంటి దేశాలకు కోటరీ సభ్యులతో కలిసి పర్యటనలు చేసి వస్తున్నారు. తప్పితే ఎటువంటి పురోగతి మాత్రం కనిపించటం లేదు. అవిగవిగో ఒప్పందాలు అంటూ ఊరిస్తున్నారు. తప్పితే ఉద్యోగాల కల్పన మాత్రం గాలిలో దీపం మాదిరిగా తయారైంది. వచ్చే రెండు, మూడేళ్ల లో కూడా ఇటువంటి సూచనలు కనిపించటం లేదు. సింగపూర్, రాజధాని తప్ప చంద్రబాబు నోట మరో మాట రావటంలేదు. దీంతో ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో తెలీక జనం అల్లాడిపోతున్నారు.
ఇప్పటి దాకా ఉన్న ఆదర్శ రైతు వంటి ఉద్యోగాల్ని పీకేశారు.ఇప్పుడు అర కొరగా ఉన్న కాంటాక్టు ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారు. జన్మ భూమి కమిటీల పేరుతో ఉద్యోగాల్ని ఊడబెరికే కార్యక్రమానికి పదును పెడుతున్నారు. తెలుగుదేశం కార్యకర్తల్లో ఎవరికి కోపం వచ్చినా కాంటాక్టు ఉద్యోగుల ప్రాణాల మీదకు వస్తోంది. ఈ స్థితితో బాబు వస్తే, జాబు రావటం మాట దేవుడెరుగు..ఉన్న జాబులు పోతున్నాయంటూ ఆవేదన చెందుతున్నారు.

Back to Top