అసెంబ్లీ సమావేశాల వేళ బాబు కుట్రలు

  • ప్రతిపక్షంపై ‘తుని రైలు’ను ప్రయోగించిన బాబు
  • ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు
  • ఐనా అరెస్ట్ కాకుండా దర్జాగా తిరుగుతున్నాడు
  • ఏ తప్పు చేయని ప్రతిపక్ష నేతలపై కక్షసాధిస్తున్నాడు
  • అప్రతిష్టపాలు జేసేందుకు కుట్రలకు తెరలేపాడు
  • అక్రమకేసుల అస్త్రాన్ని అందిపుచ్చుకున్నాడు

ప్రతిపక్షపార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించడం. తన పాత్రపై దర్యాప్తు కోరడాన్ని సీఎం చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారు. వెంటనే కక్షసాధింపునకు దిగారు. వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలను, నాయకులను టార్గెట్ చేశారు.  8 నెలలుగా అతీగతీ లేకుండా పడి ఉన్న తుని రైలు దహనం కేసు దుమ్ముదులిపారు. ఈ కేసుతో ఏసంబంధం లేని వైయస్సార్సీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డిని సీఐడీ విచారణ పేరుతో పిలిపించి ...రెండ్రోజుల పాటు నిర్బంధించడం చంద్రబాబు రాజకీయ కక్షసాధింపునకు పరాకాష్ట.

భూమన కోసం బైట వేచి ఉన్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ముఖ్యనాయకులను అక్కడేదో 144 సెక్షన్ విధించినట్లు అక్కడి నుంచి తరిమేసేందుకు పోలీసులు ప్రయత్నించడం ఈ రాష్ర్టంలో సాగుతున్న నిరంకుశ పాలనకు దర్పణం పడుతుంది. ఒకవైపు ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలు, నాయకులపై అక్రమ కేసులతో కక్షసాధింపు సాగిస్తూనే సొంత పార్టీ నాయకులపై ఏళ్లతరబడి కొనసాగుతున్న కేసులను ఎత్తేయడం చంద్రబాబునాయుడు తరహా రాజనీతికి నిదర్శనం. ఇదే తరుణంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ఉన్న రెండు పాతకేసులను ఎత్తేయడం యాదృచ్ఛికం కాదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రతిపక్షాల విషయంలో నిరంకుశంగానూ... ఆశ్రీతుల విషయంలో ఉదారంగాననూ ఉండదలుచుకున్నట్లు ఈ రెండు పరిణామాల ద్వారా చంద్రబాబునాయుడు స్పష్టమైన సంకేతాన్నిచ్చారని పరిశీలకులంటున్నారు. వైయస్సార్సీపీ నాయకులపై కక్షసాధింపు ద్వారా అసెంబ్లీ సమావేశాలలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేయడం... అదే సమయంలో కాపు ఉద్యమకారులకు కూడా పరోక్షంగా హెచ్చరికలు జారీ చేయడం కూడా చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తున్నదని అంటున్నారు.

కక్షసాధింపునకు కేరాఫ్ అడ్రస్ 
చంద్రబాబునాయుడుకు రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధించడం కొత్తేం కాదు.  రెండున్నరేళ్లలో అందుకు అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు.  కక్షసాధింపులకు కేరాఫ్ అడ్రస్ గా మారిన చంద్రబాబు... ప్రతిపక్ష పార్టీ నేతలపై రకరకాల కేసులు మోపడం, ఇబ్బందులకు గురిచేయడం  నైజంగా మార్చుకున్నారు. కాల్‌మనీ వ్యవహారంలో మహిళల తరఫున గొంతెత్తడం, అధికారపార్టీవారిని ఇరుకున పెడుతుండడం వల్లే ఎమ్మెల్యే రోజాపై రకరకాల ఆరోపణలు మోపి నిబంధనలకు విరుద్ధంగా ఏడాదిపాటు సస్పెండ్ చేశారు.

పోలీసులను ఉసిగొల్పి నీచ రాజకీయం
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పాత కేసులన్నీ తిరగదోడి పదేపదే అరెస్టు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో వెంటనే అరెస్టు చేయడం.. ఎలాగైనా సరే జైలులో నిర్బంధించాలన్న లక్ష్యంతో పోలీసులను ఉసిగొల్పడం రాష్ర్టమంతా చూసింది. రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణీకుల తరఫున మాట్లాడిన వైయస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై అక్రమ కేసు బనాయించి, అరెస్టు చేసి జైలులో నిర్బంధించారు. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ప్రజాప్రతినిధులన్న కనీస మర్యాద కూడా లేకుండా అక్రమ కేసులు బనాయించి జైళ్లలో నిర్బంధించిన ఘటనలు అనేకం.

అంతేకాదు రాష్ర్టంలో ఎక్కడ ఏం జరిగినా అది వైయస్సార్సీపీకి ఆపాదించడం, అన్నిటికీ అడ్డుపడుతున్నారంటూ ఆరోపణలు చేయడం ముఖ్యమంత్రికి పరిపాటిగా మారింది. పట్టిసీమ కాల్వకు గండి పడినా అది ప్రతిపక్ష పార్టీ కారణమనే స్థితికి ఆయన చేరుకోవడం చూసి తెలుగుదేశం నాయకులే విస్తుపోతున్నారు. తుని ఘటన వ్యవహారంలో వైయస్సార్సీపీకి గానీ, ఆ పార్టీ నాయకులకు గానీ ఎలాంటి సంబంధమూ లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గతంలోనే పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెల్సిందే.

నిరాహార దీక్ష  చేస్తున్న ఓ సీనియర్ రాజకీయ వేత్తకు నైతిక మద్దతు పలికేందుకు వెళ్లడమే భూమన కరుణాకర రెడ్డి చేసిన తప్పిదమా అని వైయస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు రైలు తగులబడుతుండగానే విలేకరుల సమావేశం పెట్టి రాయలసీమ రౌడీలే కారణమని ముఖ్యమంత్రి ప్రకటించేశారు. ఇది బాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం.  ఆయనకు అంత నిఘా సామర్థ్యం ఉంటే అసలు ఆ ఘటన జరగనీయకుండా నివారించి ఉండాల్సింది కదా.. అంటే ఈ ఘటన జరుగుతోందని తెలిసినా నివారించని ముఖ్యమంత్రే అసలు దోషి అనాల్సి ఉంటుంది కదా అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

దృష్టి మళ్లించడం కోసమే..
ఎనిమిది నెలల క్రితం నాటి తుని రైలు దహనం కేసులో వైయస్సార్సీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డిని హఠాత్తుగా విచారణకు పిలిపించడం, బుధవారం కూడా విచారణ కొనసాగుతుందని సీఐడీ పోలీసులు చెబుతుండడం వెనక అనేక రాజకీయ అవసరాలున్నాయని పరిశీలకులంటున్నారు. గురువారం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఓటుకు కోట్లు కేసు, రాజధాని కుంభకోణాలు, సదావర్తి భూముల వ్యవహారం, ప్రత్యేక హోదా, కరువు నివారణ చర్యల్లో వైఫల్యం వంటి ప్రధానమైన సమస్యలపై ప్రతిపక్షపార్టీ నిలదీయబోతోంది.

ఈ సమయంలో వైయస్సార్సీపీకి చెందిన ఓ ముఖ్య నాయకుడిని ఇలా విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తే అందరి దృష్టి ఆ సమస్యలపైకి మళ్లుతుంది. సభలో కూడా దీనిపైనే పుణ్యకాలం కాస్తా పూర్తి చేసేయొచ్చు అన్నది అధికారపక్షం ఎత్తుగడగా కనిపిస్తున్నదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాసమస్యలన్నీ సభలో చర్చించేందుకు కనీసం 15 పనిదినాలైనా అవసరమని ప్రతిపక్షం అడుగుతుంటే ముచ్చటగా మూడు రోజుల్లో ముగించేసేందుకు చంద్రబాబు నాయుడు తాపత్రయపడుతున్నారు. ప్రజాసమస్యల నుంచి అందరి దృష్టిని మళ్లించడం కోసం కూడా ఆయన తుని రైలు దహనం కేసు విచారణను ఉపయోగించుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకు రెండు రోజుల ముందు సీఐడీ విచారణ డ్రామాను నడిపించడం అందుకేనని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.

కాపునాయకులకు పరోక్ష హెచ్చరికలు...
కాపులను బీసీల్లో చేరుస్తామని ఇచ్చిన హామీని ఎన్నికలు పూర్తికాగానే చంద్రబాబు అటకెక్కించడంపై కాపు ఉద్యమనేత ముద్రగడ నాయకత్వంలో కాపులు ఉద్యమిస్తున్న సంగతి తెల్సిందే. నిరాహారదీక్షల సందర్భంగా ఇచ్చిన హామీలకు కూడా ప్రభుత్వం మంగళం పాడుతుండడంతో కాపునాయకులందరినీ సంఘటిత పరుస్తూ మరో మారు ఉద్యమించేందుకు ముద్రగడ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో కాపు ప్రముఖులతో ఆయన సమావేశమై ఈ రెండున్నరేళ్ల పరిణామాలను, ప్రభుత్వ పోకడలను వివరిస్తూ భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటించారు.

అందులో భాగంగా ఈనెల 11 నుంచి మరో  ఉద్యమానికి ఆయన సన్నద్ధమవుతున్నారు. అయితే ఈ దశలో తుని రైలు దహన కేసును తెరపైకి తీసుకురావడం ద్వారా కాపులకు కూడా చంద్రబాబు పరోక్ష హెచ్చరికలు జారీ చేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులంటున్నారు. ఉద్యమిస్తే పాత కేసులను తిరగదోడతామని, అరెస్టులతో హింసిస్తామని కాపు ఉద్యమకారులను భయపెట్టడానికి కూడా భూమన విచారణ వ్యవహారాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారని వారంటున్నారు.
Back to Top