బాబు గారి దాదాగిరి

  • బ్రిటీష్‌ పాలకులను తలపిస్తున్నబాబు పాలన
  • జాతిపిత విగ్రహాలకు ఏపీలో రక్షణ కరువు
  • ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని టీడీపీ సర్కార్‌
  • హామీలపై ప్రశ్నిస్తే హింసలు, అక్రమ కేసులు
  • న్యాయం కోసం పోరాడితే జైల్లో పెడతానంటూ హెచ్చరికలు
ఏపీః మహాత్మాగాంధీ..ఈ పేరు స్ఫురణకు రాగానే చంటి పిల్లల నుంచి వృద్ధుల వరకు ఒకే భావన ఉప్పొంగుతుంది. మన ‘‘బాపు’’ అంటూ ప్రతి ఇంటా ఆ పేరు జేగంటై మ్రోగుతుంది. ఆయన గురించి అందరి అభిప్రాయం ఒక్కటే. జాతిపితగా దేశ ప్రజలు ఆరాధిస్తున్న మహాత్మాగాంధీకి ఆంధ్ర రాష్ట్రంలో అవమానాలు జరుగుతున్నాయి. ఆయన సిద్ధాంతాలకు పాలకులు తూట్లు పొడుస్తున్నారు. మహా వైశాల్యం గల ఒక దేశ ప్రజానీకాన్ని ఒకే తాటిపై నడిపించగలిగిన మహిమాన్వితుడు గాంధీజీ. స్వదేశం నుంచి విదేశీయులను తరిమికొట్టేందుకు ఆయన ఆచరించిన శైలి ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ‘‘ నా జీవితమే నా సందేశం’’ అన్న గాంధీజీ సందేశం అలుపెరగని ఆయన పోరాట పటిమను చాటి చెపుతుంది. అసహనాన్ని దరికి చేరనివ్వని ఆయన సహనశీలత్వాన్ని తేటతెల్లం జేస్తుంది. ప్రపంచ దేశాలకు అహింసకు ఉన్న శక్తిని తెలియజేయడం ద్వారా గాంధీ తన సందేశాన్ని  పరోక్షంగానే చెప్పినట్లు అయ్యింది. అందుకే మహాత్మా గాంధీ పుట్టిన రోజైన అక్టోబర్‌ 2ను ‘‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’’గా యునైటెడ్‌ నేషన్స్‌లోని 114 సభ్య దేశాలు తీర్మానించాయి. 

అహింస వైపు అడుగేయాల్సిన ఆవశ్యకతను బాపుజీ నొక్కి చెప్పారు. ఇంత ఘన కీర్తి కలిగిన జాతిపితకు నవ్యాంధ్ర రాజధాని విజయవాడ నడిబొడ్డున ఘోర అవమానం జరిగింది. యావత్తు దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా..రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా మహాత్మాగాంధీ విగ్రహాన్ని పెకిలించి పారేసింది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుడికి కనీస గౌరవమైన ఇవ్వకుండా ఏట్లో పడేసింది. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నం రింగ్‌రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అర్ధరాత్రి పొక్లెయిన్‌తో గాంధీజీ విగ్రహాన్ని ఆర్‌అండ్‌బీ అధికారులు, పోలీసు బందోబస్తు మధ్య పెకిలించారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గాంధీ విగ్రహం కాళ్లు, చేతులు విరిగిపోయాయి. దీంతో విగ్రహాన్ని ఎవరికీ కనిపించకుండా చేసేందుకు పక్కనే ఉన్న బుడమేరులో పడేశారు.  ఏడు దశాబ్ధాల చరిత్ర కలిగిన మహాత్ముని విగ్రహాన్ని తొలగించడం అమానవీయం. 

ప్రశ్నిస్తే కేసులు
తెల్ల దొరల పాలనలో మన దేశీయులకు ప్రశ్నించే హక్కు ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో వారిపై ఎందరో నేతలు పోరాడి స్వాతంత్య్రం తీసుకొనివచ్చారు. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది. అయితే 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం ప్రభుత్వం నియంతలా పాలిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతిని ప్రోత్సహిస్తూ, ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. దీన్ని ప్రశ్నించిన ప్రతిపక్షాన్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ కేంద్రంగా కాల్‌మనీ–సెక్స్‌ రాకెట్‌ వ్యవహారం వెలుగులోకి వస్తే..ఆ అంశాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు. అంతేకాకుండా ప్రతిపక్షాన్ని అణగద్రొక్కెందుకు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రలోభాలకు గురిచేశారు. తన వద్ద ఉన్న అవినీతి డబ్బు, పదవులు, అధికారాన్ని ఎరగా చూపి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ 20 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు.  అలా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు. తెలంగాణలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారు. 

రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను కాదని, రాజ్యాంగేతర శక్తిగా ఏర్పడిన జన్మభూమి కమిటీలకు పెత్తనం కట్టబెట్టారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు అభివృద్ధి నిధులు మంజూరు చేయకుండా అభివృద్ధికి మోకాలడ్డుతున్నారు. ఎన్నికల సమయంలో కాపులను బీసీ జాబితాలో చేర్చుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఆ హామీ నెరవేర్చకపోవడంతో కాపులు ఉద్యమబాట పట్టారు. తునిలో చేపట్టిన కాపు గర్జనలో ఆందోళన కారులు రైలును తగలబెడితే ఎలాంటి సంబంధం లేని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండానే కేసులు పెట్టారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డిపై సీఐడీ విచారణ అంటూ కక్షసాధింపు చర్యలకు తెర లేపారు. వైయసార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపించారు.

ఏ ఒక్క హామీ నెరవేర్చని బాబు
2014 ఎన్నికల్లో చంద్రబాబు అమలుకు సాధ్యంకాని 600 హామీలు గుప్పించారు. బాబు వస్తేనే జాబు అన్నారు. రైతుల రుణాలు మాఫీ కావాలన్నా, బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలన్నా, డ్వాక్రా రుణాలు మాఫీ కావాలన్నా చంద్రబాబు సీఎం కావాలని ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఏ ఒక్కరికి జాబ్‌ రాలేదు, నిరుద్యోగభృతి ఒక్క రూపాయి కూడా అందడం లేదు. హామీల అమలు కోసం ప్రశ్నించిన ప్రతిపక్షాలు, ప్రజలపై బాబు సర్కార్‌ తప్పుడు కేసులు బనాయిస్తోంది. 

పోరాడితే జైలే..
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చేది మేమే. ఇచ్చేది మేమే అని చంద్రబాబు వాగ్దానం చేశారు. హోదానే రాష్ట్రానికి సంజీవిని అన్నారు. హోదా పదిహేనేళ్లు కావాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. తిరుపతి వేదికగా ప్రధాని నరేంద్రమోదీ, చంద్రబాబు ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తరువాత ప్రత్యేక హోదా ఇవ్వడం లేదంటూ ఏపీ ప్రజలను ఆశలపై నీళ్లు చల్లారు.  హోదా కోసం పోరాడాల్సిన చంద్రబాబు కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించడం ఘోరాతి ఘోరం.  పైగా ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న ప్రతిపక్షాలపై, విద్యార్థులపై కేసులు నమోదు చేయించారు. హోదా కోసం ఎవరైనా పోరాడితే జైలులో పెడతామని చంద్రబాబు బెదిరిస్తున్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు ఐదు కోట్ల ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారు. 

గాంధీజీ ఆశయాలకు, అహింసకు విరుద్ధంగా చంద్రబాబు ఆంధ్రరాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారు. నాడు గాంధీగిరితో బ్రిటిష్‌ వారిని దేశం నుంచి పారద్రోలితే..నేడు చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం సింగపూర్, జపాన్‌ దేశస్థులను రాష్ట్రానికి రప్పించి విలువైన భూములను దోచిపెడుతున్నారు. అందుకే ఆయన పాలనను బాబు గిరిగా రాష్ట్ర ప్రజలు అభివర్ణిస్తున్నారు. చంద్రబాబు అరాచకపాలనకు చరమగీతం పాడేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. గాంధీగిరి రూపంలోనే రాష్ట్రమంతా పర్యటిస్తూ యువత, విద్యార్థులను చైతన్యవంతం చేసేందుకు యువభేరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏదో ఒక నాడు చంద్రబాబు పాలన నుంచి విముక్తి కలుగుతుందని భావిస్తూ..మంచి రోజు కోసం ఎదురుచూస్తున్నాం.
 

తాజా వీడియోలు

Back to Top