బాబు లక్ష్యం రోగాంధ్రప్రదేశ్

– ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడుస్తున్న టీడీపీ సర్కారు
–పేదలకు అందని కార్పొరేట్‌ వైద్యం
–ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులో ప్రభుత్వం తీవ్ర జాప్యం
–సర్కార్‌ తీరుపై ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ ఆందోళన
–ఈ నెల 9న కలెక్టరేట్‌ల ఎదుట వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన
– ఒంగోలులో వైయస్‌ జగన్‌ ధర్నా

దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి స్వతహాగా వైద్యుడు కావడంతో పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో తన పాలనలో ఆరోగ్యశ్రీ అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలా మహానేత మదిలోంచి వచ్చిన ఆరోగ్యశ్రీ....కోట్లాది మందికి అండగా ఉండి ప్రాణాలు పోసే అపర సంజీవనిగా పేరొందింది. పేద ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకం ప్రస్తుత పాలనలో నీరు గారిపోతోంది.  పేదవాడికి కార్పొరేట్‌ వైద్యం అందించాలన్న ఉన్నత లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకం చంద్రబాబు నిర్లక్ష్యానికి బలవుతోంది. ప్రాణాలను మింగేసే రోగాలు, దేహాన్ని కబళించే వ్యాధులతో పోరాడే ఎంతో మంది పేదవారికి ఆసరాగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకానికి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారు. ఖరీదైన వైద్యం చేయించుకునే స్థోమత లేక బతుకు భారమైన కోట్ల మంది పేదల బతుకుల్లో ఆశా దీపాలు వెలిగించిన మహానేత మహోన్నత లక్ష్యాన్ని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక్కొక్కటిగా ఆరోగ్యశ్రీ పథకంలోని వ్యాధులను తగ్గిస్తూ పేదల ఉసురు తీసుకుంది. ఆరోగ్యశ్రీ పథకానికి అరకొర నిధులు కేటాయిస్తూ ప్రజారోగ్యంపై బాబుకున్న శ్రద్ధాశక్తులను చెప్పకనే చెబుతోంది. టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేసి ఆరోగ్యాన్ని పేదలకు అందని ద్రాక్షలాగే మార్చేసింది. పేదలకు జబ్బు చేస్తే ఉన్న పొలాలను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితులు చూసిన  వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మనసు కలత చెందింది. ఆరోగ్యశ్రీ అమలు తీరుపై వైయస్‌ఆర్‌సీపీ ఆందోళన బాట పట్టింది. పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఈనెల 9న వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరరేట్‌ల వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ కూడా ఈ ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. ఒంగోలు నగరంలోని కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించే ధర్నాలో ఆయన పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు. ఆరోగ్యశ్రీ అమల్లో నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఇటీవల వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ కూడా రాశారు. ఈ సందర్భంగా పలు విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీగా మార్చడం సంతోషకరమే అయినా చివరి రోజుల్లో ఆయనకు బాబు ప్రభుత్వ అందించిన సేవలు మాదిరిగానే ఆరోగ్యశ్రీ సేవలున్నాయని విమర్శించారు. పేదలకు మెరుగైన ఆరోగ్యం అందించే పథకానికి కూడా నిధుల లేవని సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి చెప్పడం సిగ్గు చేటన్నారు. 

వైద్యం కోసం పొలాలు అమ్ముకుందామంటే
మెరుగైన వైద్యం చేయించుకుందామని పొలాలు అమ్ముకునే పరిస్థితి కూడా ఏపీలో లేకుండా పోయింది. పరిశ్రమలకు భూములు కట్టబెట్టడంలో ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై చంద్రబాబుకు లేకుండా పోయింది. పరిశ్రమలకు భూములు ఇవ్వడం లేదన్న కోపంతో చంద్రబాబు ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు లేకుండా చేశారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మూడు పంటలు పండే పొలాలకు నీరు సరఫరా కాకుండా అడ్డుకోవడానికి కూడా వెనకాడలేదు. బందర్‌ పోర్టుకు భూములు ఇచ్చేందుకు నిరాకరించారన్న కారణంతో చంద్రబాబు ప్రభుత్వం ఆయా పొలాలకు సాగునీరు అందకుండా చేసింది. ఆరోగ్యం, పిల్లల చదువుల నిమిత్తం భూములు అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్లు కూడా చేయనీయకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుకోవడం శోఛనీయం. కొల్లు రవీంద్ర బందర్‌ నిర్వాసితులను బెదిరించి భూములు లాక్కునేందుకు మందీ మార్భలంతో అమాయక రైతులపై విరుచుకుపడుతున్నారు. ఇదేం దుర్మార్గమని వైయస్‌ జగన్‌ లేఖలో ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. పేదలను కాపాడాల్సిన సీఎం ఇలా చేయడం కంచె చేను మేసినట్టుగా ఉందని చంద్రబాబును నిలదీశారు. ప్రాణాలు పోయాల్సిన పథకాన్ని నీరుగార్చి మీ అసమర్థతతో బాధితులకు నిర్దయగా పాడె కడతారా అని లేఖ ద్వారా వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బకాయిలు రూ. 395 కోట్లు.. లోటు 342 కోట్లు
అపర సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం ఎలా నీరుగార్చిందో చెప్పడానికి బడ్జెట్‌ కేటాయింపులే సాక్ష్యం. 2016–17కు సంబంధించి కనీసంగా రూ.910.77 కోట్లు కావాలి అని సంబంధిత విభాగం నివేదించింది. అయితే నడుస్తున్న ఆర్ధిక సంవత్సరానికి ప్రభుత్వం కేటాయింపులు మాత్రం కేవలం  రూ.568.23 కోట్లు. ఇది అంచనా కన్నా 342.54 కోట్లు తక్కువ. నిధుల కేటాయింపులు అంచనా వ్యయంలో 62.3 శాతం మాత్రమే. 
ఎక్కడ రూ.910 కోట్లు? ఎక్కడి 568 కోట్లు? మార్చిలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టేనాటికి ఆరోగ్యశ్రీ బకాయిలే ఏకంగా రూ.395.69 కోట్లు. బకారుులు పోతే నికరంగా కేటాయింపులు కేవలం 53 కోట్లు.  ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న 1 కోటీ 30 లక్షల కుటుంబాలకు ఈ కేటాయింపులతో ఏ కొంచెం కూడా న్యాయం జరిగే వీలు లేదనేది కఠోర వాస్తవం. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రభుత్వాసుపత్రుల్లో సైతం ఆరోగ్యశ్రీ అమలు దాదాపుగా పడక వేస్తున్న వైనంతో నిరూపణ అవుతోంది.

కమీషన్లు రావడం లేదనే కేటాయింపుల్లో కోతలు
జేబులు నింపుకునే ఎండల్లో మజ్జిగ పథకం, పార్టీ కార్యాలయాలకు భూములు, చంద్రన్న కానుక తదితర పథకాలను సృష్టించి పబ్లిసిటీ కోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తారు. ఇసుక నుంచి బొగ్గు కొనుగోళ్ల దాకా, రాజధాని భూముల కొనుగోళ్ల మొదలు, సదావర్తి భూముల వరకు అవసరం లేకపోయినా, ఎవరూ అడగకపోయినా సంతోషంగా జీవోలు జారీ చేశారు. కమీషన్లు రావటం లేదనే కారణంతో  ఆరోగ్యశ్రీ బడ్జెట్‌లో దాదాపు 50 శాతం కోత వి«ధించారు. రైతు, కూలి, సామాన్యుడు, మధ్యతరగతి ప్రజలు సవ్యంగా ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ అందుకోలేని పరిస్థితుల్లోకి రాష్ట్రం నెట్టివేయబడింది. హంగూ ఆర్భాటాలతో భూములు ధరలు పెంచి కొనుగోలు శక్తి లేకుండా చేశారు. బాబు రెండున్నరేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఏదైనా ఉందంటే అది కేవలం అవినీతిలోనే. ఏపీ దేశంలోనే అవినీతిలో నెంబర్‌ వన్‌ స్థానంలో నిలవడం దౌర్భాగ్యం.

ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి కాసుల సేద్యం
గుండె జబ్బులు, మల్టిపుల్‌ ఫ్రాక్చర్లు, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు.. ఇలా రకరకాలుగా ఇబ్బందులతో రోగులు నిత్యం ఆస్పత్రుల గడపలు తొక్కుతున్నారు. ఆర్థిక స్థోమత సరిపోక ఎంతోమంది ఆరోగ్యశ్రీని ఆశ్రయించి ఇన్నాళ్లు వారి జీవితాలను బాగు చేసుకునేవారు. అయితే ప్రభుత్వం తొమ్మిది నెలలుగా ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించని కారణంగా రోగులకు చికిత్స చేయటానికి వారు నిరాకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో  ‘‘మా దగ్గర నిధులు లేవు.. ఇష్టమైతేనే చేయండి..లేదంటే మానేయండి’’ అని సాక్షాత్తు ఆరోగ్యమంత్రి దుర్మార్గంగా మాట్లాడ్డం ఆరోగ్యశ్రీ పథకాన్ని సర్వనాశనం చేయడానికే. వారానికి ఒకసారో, రెండుసార్లో రక్తశుద్ధి చేసుకుంటే తప్ప బతికేందుకు అవకాశాలు లేని పేషెంట్లకు డయాలసిస్‌ అపాయింట్‌మెంట్‌ కావాలంటే ఏడాది తరవాత గానీ ఇవ్వలేం అని ఆ సదుపాయం ఉన్న ఆసుపత్రుల నుంచి సమాధానం వస్తోంది. వారానికి రెండు సార్లు డయాలసిస్‌ కావాల్సిన పేషెంట్‌ ఒక్కో దఫా రూ.3,000 చెల్లించుకోవాల్సి వస్తోంది. నెలకు రూ 24,000, ఏడాదికి రూ 3,12,000 చెల్లించు కోవాల్సి వస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ఆరోగ్యశ్రీ ఉండి ఏం లాభం? దాన్ని సరిదిద్దకుండా తూతూ మంత్రంగా రాష్ట్రవ్యాప్తంగా ఏదో పది డయాలసిస్‌ కేంద్రాలు అదనంగా పెట్టటం వల్ల ఒనగూరేది లేదు. క్యాన్సర్‌ పేషెంట్లకు అవసరమైన కీమో థెరపీతో కూడిన వైద్యానికి ఎనిమిది నుంచి పది లక్షలు ఖర్చు అవుతుంది. చాలీచాలని కేటాయింపులతో క్యాన్సర్‌ రోగులంతా చనిపోవాల్సిందేనా. చివరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షలు మొదలు అన్ని వైద్య సేవల్ని  ప్రైవేటు పరం చేసి, డాక్టర్‌కు టార్గెట్లు పెట్టి ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి కాసుల సేద్యం చేసుకుంటున్నారు.

దైవాధీనంగా 108, 104 సర్వీసులు
ఒకప్పుడు 108 వాహనానికి ఫోన్‌ చేస్తే.. నిమిషాల్లోనే వచ్చేది. ఇప్పుడు అదే 108 మీ చలవతో దైవాధీనం సర్వీసుగా మారింది. నిర్వహణ భారమై చాలా వాహనాలు మూలన పడ్డాయి. తెల్ల కార్డు ఉంటే దీర్ఘాయుష్కులమని జనం నమ్మేవారు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 104..108, 48 లక్షల ఇళ్ల నిర్మాణం, ఎస్సీ ఎస్టీ వర్గాలకు భూముల పంపిణీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు.. ఇలా వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు  ఆధునిక భారతదేశ చరిత్రలోనే ఒక్కో సువర్ణాధ్యాయం. చంద్రబాబు పాలన పుణ్యాన ఆ పథకాలన్నింటికీ దుర్గతి పడుతోంది. ఫలితంగా పేదవాడికి ప్రభుత్వంపై భరోసా పోతోంది. ప్రాణాలు అడ్డేసైనా అభాగ్యుల్ని బతికించే ఆలోచన చేయకుండా ఎంతసేపటికీ కార్పొరేట్లకు దోచిపెట్టడమే ధ్యేయంగా బాబు శ్రమించడం తెలుగు ప్రజలకు శాపమే. ఆరోగ్యశ్రీ అమలుపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపడుతున్న పోరాటంలో ఆరోగ్యశ్రీ బాధితులు, బంధువులు, వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

 
Back to Top