బాబు నోటు.. ఏపీకి చేటు

* ఓటుకు కోట్లు కేసులో సాక్ష్యాధారాలతో పట్టుబడిన ఏపీ సీఎం
* ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
* నాడు అంతుచూస్తానన్న తెలంగాణ సీఎం..నేడు మౌనం
* ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య రహస్య ఒప్పందం
* కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఏపీ సర్కార్‌
* ఓటుకు డబ్బులిస్తే అవినీతి కాదట
* తప్పు చేసింది కాక..తప్పుడు వాదనాలు

ఓ వ్యక్తి చేసిన తప్పు.. రాష్ట్రానికే శాపంగా మారింది. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు. అడ్డదారిలో ఎన్నికల్లో గెలవాలని ఓ ఎమ్మెల్యేకు లంచం ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన చంద్రబాబు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ కేసు నుంచి బయట పడేందుకు ఐదున్నర కోట్ల ఆంధ్రుల హక్కులను ఏపీ సీఎం కేంద్రానికి, పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టారు. బాబు తీరుతో ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా రాకుండా పోయింది. అలాగే విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధుల్లో కోత విధించినా చంద్రబాబు నోరు మెదపడం లేదు. అలాగే పక్క రాష్ట్రం ఎడాపెడా కృష్ణా, గోదావరి నదులపై ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తూ ఏపీకి రావాల్సిన నీటిని యథేచ్ఛగా వాడుకుంటుంటే బాబు చోద్యం చూస్తున్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయట పడేందుకు చట్టాలను తనకు చుట్టంలా మార్చుకునేందుకు న్యాయస్థానాల్లో తప్పుడు వాదనలు వినిపిస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. ఓటుకు డబ్బులిస్తే చట్టం వర్తించదని తప్పుడు వాదనలు వినిపిస్తూ కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు..
మే 31, 2014..  ఓటుకు నోటు కుంభకోణంతో ఏపీ ముఖ్యమంతి చంద్రబాబు పేరు దేశంలోనే మార్మోగిపోయింది. ‘మన వాళ్లు బ్రీఫ్డ్ మీ’ అంటూ చంద్రబాబు నాయకుడు టీఆర్‌ఎస్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో జరిపిన ఫోన్‌ సంభాషణలు సంచలనం రేపాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఓ వ్యక్తి మా ఎమ్మెల్యేలనే డబ్బులతో ప్రలోభపెట్టాలని చూస్తాడా అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంతెత్తున్న లేచారు. కేసీఆర్‌ ఆగ్రహావేశాలతోపాటు సీసీ కెమెరాల ఫుటేజీలు,  తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి మరో ఇద్దరు అనుచరులతో కలిసి స్టీఫెన్‌ సన్‌కు రూ. 50 లక్షలు డబ్బులిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఏసీబీ అధికారులు వారిని అప్పటికప్పుడే జైలుకు కూడా తరలించారు. కేసీఆర్‌తోపాటు తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు చంద్రబాబు తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మా ఎమ్మెల్యేలనే కొని ప్రభుత్వాన్నే పడగొట్టాలని ప్రయత్నిస్తావా అంటూ చంద్రబాబును ఉతికారేశారు. చంద్రబాబు వాయిస్‌ను టెస్టింగ్‌కు పంపించనున్నట్లు కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. అయితే ఏమైందో తెలియదు గానీ కేసు విచారణ ముందుకే జరగలేదు. ఆధారాలతో సహా పట్టుబడ్డ చంద్రబాబు మీద ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ముద్దాయిగా రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిన రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లి తిరిగి ఇంటికి కూడా వచ్చేశాడు. కేసు మాత్రం అక్కడ్నుంచి ముందుకు కదిలినా దాఖలాలు లేవు. 

ఆ వాయిస్‌ బాబుది కాదా?
ఎమ్మెల్యేను కొనబోతూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు షరామామూలుగానే తనకేం సంబంధం లేదనట్లు వ్యవహరించారు. తాను నిజాయితీపరుడినని, నిప్పులాంటోడినని నీతివాక్యాలు వల్లించారు. నేనూ ముఖ్యమంత్రిని నాకూ సీఐడీ ఉంది.. నాకూ పోలీసులున్నారు.. ఈ హైదరాబాద్‌ మీద పదేళ్లు మాకూ అధికారాలున్నాయంటూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. కేసుల్లో అడ్డంగా దొరికిపోయి కూడా బుకాయించడానికి ప్రయత్నించారు.  నేషనల్‌ మీడియా రంగంలోకి దిగి ఆ వాయిస్‌ మీదా కాదా అని ప్రశ్నించినా సెక్షన్‌ 8 ప్రస్తావన తీసుకొచ్చారే తప్ప సూటిగా  సమాధానం మాత్రం చెప్పలేకపోయారు. సచివాలయానికి, ఇంటికీ వాస్తుదోషాలున్నాయంటూ హడావుడిగా కోట్లు ఖర్చుపెట్టి మరమ్మతులు చేయించిన ముఖ్యమంత్రి ఉన్నట్టుండి రాజధాని నిర్మాణమంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. పదేళ్లు ఉమ్మడి రాజధాని అని చెప్పిన మనిషి ఉన్నపళంగా ఇళ్లు ఖాళీ చేసి గుంటూరుకు పరారయ్యాడు. రాష్ట్రాభివద్ధి అంటూ హడావుడి ప్రారంభించాడు. ఉద్యోగులంతా ఇక్కడ్నుంచి తరలిరావాలని హుకుం జారీ చేశాడు. ఇక్కడే రాష్ట్ర ప్రజలకు అర్థం కాని ఎన్నో అనుమానాలు మొదలైనాయి. బాబు హడావుడి ప్రయాణంపై ప్రజలకున్న సందేహాలను నివత్తి చేయాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్‌ చేసింది. ఓటుకు నోటు కేసులో కేసీఆర్‌తో రాజీపడినందువల్లే చంద్రబాబు గుంటూరుకు పారిపోయారని విమర్శల దాడి పెంచింది. ఇదే అదనుగా తీసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏపీకి కేటాయించిన ఒక్కో భవనాన్ని లాగేసుకుంటున్నా నోరు మెదపని పరిస్థితి కల్పించాడు. దీంతో చంద్రబాబు వ్యవహారం వలన ఏపీకి నష్టం జరుగుతోందంటూ కేసుపై విచారణ జరిపించాలని కోరుతూ కేంద్రప్రభుత్వానికి పలుమార్లు వైయస్‌ఆర్‌సీపీ నాయకులు వినతి పత్రాలు కూడా సమర్పించారు. అయినా కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. తాను నిప్పునని చెప్పుకుంటున్న చంద్రబాబు కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా కూడా చేయలేదు. పైగా కోర్టు విచారణకు ఆదేశించకుండానే ముందస్తుగానే స్టేలు తెచ్చుకుని భుజాలు తడుముకున్న దొంగలా వ్యవహరించాడు. 

తప్పు చేయకుంటే అంత భయమెందుకు?
చంద్రబాబు ఎలాంటి తప్పు చేయకుంటే ఓటుకు నోటు కేసులో అంతలా భయపడాల్సిన అవసరం ఏముంది. ఈ కేసులో విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేసు విచారణకు కూడా రాకుండానే చంద్రబాబు ముందస్తుగా బెయిల్‌ తెచ్చుకుని భయంతో వణికిపోయారు. ఇలాంటి కేసు విషయంలోనే ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రి ఏడాదిలో మూడుసార్లు విచారణ ఎదుర్కోగా.. చంద్రబాబు మాత్రం కేసు విచారణకు రాకుండానే చూసుకోవడంపైనే ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఓటుకు నోటు కేసులో పీకల్లోతున చంద్రబాబు ఇరుక్కున్న కారణంగానే ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ నుంచి అమరావతికి పారిపోయారు. చంద్రబాబును జైలుకు పంపకుండా ఉండేలా కేసీఆర్‌తో కేంద్ర పెద్దలు రాజీ కుదుర్చారు.  కేసీఆర్, చంద్రబాబుల మధ్య భారీ ఆర్థిక లావాదేవీలతోపాటు రాజకీయ ఒప్పందం కూడా జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. వారి అంచనాలకు తగినట్టుగానే తదనంతర పరిణామాలు కూడా చకచకా జరిగిపోయాయి. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నా చోటామోటా నాయకులు మినహా చంద్రబాబు మట్లాడలేని పరిస్థితిలో ఉన్నారంటే∙బాబు ఎంతగా కేసీఆర్‌ పాదాల చెంత సాగిలా పడ్డారో తెలుస్తుంది.

లంచం ఇవ్వడం తప్పుకాదా?
ఓటుకు కోట్లు వ్యవహారంలో చంద్రబాబు చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని ఆయన తరఫున వాధించిన న్యాయవాది సిద్ధార్థ లూద్ర హైకోర్టులో వాదనలు వినిపించారు. ఓటు హక్కు వినియోగించుకోవడమన్నది ప్రజా విధుల్లో భాగం కాదు. ప్రజా విధుల్లో భాగం కాని నేరానికి అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్‌) ఎలా వర్తిస్తుంది’ అని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా నిన్న తన వాదనలు వినిపించారు.  ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై సమగ్రంగా విచారణ జరపాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరపాల్సిందిగా ఏసీబీని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెల్సిందే. అయితే ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కొట్టేయాలని చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యంపై హైకోర్టులో గురువారం వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా న్యాయవాది లూథ్రా కేసు నుంచి చంద్రబాబును తప్పించేందుకు అడ్డగోలుగా వాదించారు.  ప్రజా విధుల్లో భాగం కాని నేరానికి పీసీ యాక్ట్‌ ఎలా వర్తిస్తుందో అన్నారు. అంటే ఓటర్లకు డబ్బులిచ్చినా తప్పు లేదనట్లు ఆయన వాదించారు. ఇలాగైతే ఎన్నికల్లో సామాన్యులు గెలవడం కష్టమవుతోంది. అంతా డబ్బులున్నా వారే గెలుస్తారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటర్లను కొనుగోలు చేయడం నేరమని తెలిసి కూడా ముఖ్యమంత్రే ఇలాంటి వాదనలు వినిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
Back to Top