బాబు..జాబెక్కడ..?

- ఇంటికో ఉద్యోగం లేదు..నిరుద్యోగ భృతి రాదు
- నోటిఫికేషన్ల కోసం మూడేళ్లుగా ఎదురుచూపులు
- ఎన్నికల హామీపై మాట తప్పిన ప్రభుత్వం
- ప్ర‌త్యేక హోదాకు తూట్లు
- నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం
 
విజ‌య‌వాడ‌:  టీడీపీ అధికారంలోకి వ‌స్తే ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం వ‌చ్చే వ‌ర‌కు నెల‌కు రూ.2 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తాం. జాబు రావాలంటే బాబు ముఖ్య‌మంత్రి కావాలి. 2014 ఎన్నిక‌ల్లో ఏ మీటింగ్‌కు వెళ్లినా చంద్ర‌బాబు ఇవే వాగ్ధానాలు చేశారు. తీరా అధికారంలోకి వ‌చ్చాక‌ ఎన్నికల హామీలకు తిలోదకాలిచ్చారు. రోజులు గడిచే కొద్దీ.. అలాంటి హామీలు ఏవీ తామివ్వలేదంటున్నారు. ఏరు దాటాక తెప్ప  తగలేసిన చందంగా.. చంద్ర‌బాబు త‌ప్పుకుంటున్నారు. బాబు హామీ అమలుకు నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్లను విడుదల చేయలేదు. కేవలం కొద్ది మంది అంగన్‌వాడీలను, బహుళసేవ వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించడం మినహా ఎలాంటి నోటిఫికేషన్లను జారీ చేయలేదు. వాస్తవానికి ఉపాధి కల్పన కార్యాలయాల్లో ల‌క్ష‌లాది మంది నిరుద్యోగులుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే, పేర్లను నమోదు చేసుకోని వారు ఇంతకు పది రెట్లు ఉన్నారు.   లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల వేటలో రోడ్లపై తిరుగుతున్నారు. వీరికి ఇప్పుడు ఉద్యోగాలైనా చూపించాలని.. లేనిపక్షంలో హామీ మేరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

 ప్రైవేటు ఉద్యోగాలూ లేవు
రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా ప్రభుత్వ దృష్టి అంతా గుంటూరు, కృష్ణా జిల్లాలకే పరిమితమయింది. జిల్లాలో ఏకంగా 30 వేల ఎకరాల్లో భారీ పారిశ్రామిక హబ్ వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇప్పటివరకు ఒక్క పరిశ్రమనూ తీసుకురాలేకపోయింది. కొత్తగా ఒక్క ఉద్యోగమూ రాలేదు. ఫలితంగా అటు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు వెలువడక.. ఇటు ప్రైవేటు ఉద్యోగాలూ లేక నిరుద్యోగులు అల్లాడుతున్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామనలేదని, ప్రైవేటు ఉద్యోగాలు అని అసెంబ్లీ సాక్షిగా ప్రవచించిన ముఖ్యమంత్రి... ప్రైవేటు ఉద్యోగాలనూ కల్పించడంలో విఫలమయ్యారు.
  
ఉన్న ఉద్యోగమూ ఊడగొట్టారు
కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలను కూడా ఊడగొట్టారు.  హౌసింగ్ శాఖలో అవుట్‌సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఆరోగ్యమిత్రలు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు  పని పోయి రోడ్డున పడ్డారు. ఇక మునిసిపాలిటీల్లో  సీఎల్‌ఆర్‌లను (క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్స్) కూడా ప్రభుత్వం తొలగించింది. ఇక ఆయుష్ విభాగంలోని సిబ్బందిని ఇళ్లకు పంపించారు. వీరంతా ఇప్పుడు ఉద్యోగం కోల్పోయి.. కొత్త ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది.

హోదా వ‌చ్చి ఉంటే..
విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా వ‌చ్చి ఉంటే వేలాది ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు అయ్యేవి. కేంద్రం పారిశ్రామిక వేత్త‌ల‌కు రాయితీలు, ఇన్‌సెంటివ్స్‌, ప‌న్నుల మిన‌యింపులు ఇవ్వ‌డంతో ఇక్క‌డ ప‌రిశ్ర‌మ‌లు వెలిసేవి. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు ఉపాధి అవ‌కాశాలు పెరిగేవి. రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను చంద్ర‌బాబు కేంద్రానికి తాక‌ట్టు పెట్టారు. ఓటుకు కోట్లు కేసులో చిక్కుకున్న ఏపీ సీఎం దాని నుంచి బ‌య‌ట ప‌డేందుకు ప్ర‌త్యేక హోదాను నీరుగార్చారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌దేళ్లు ప్ర‌త్యేక హోదా కావాల‌న్న బీజేపీ మాట త‌ప్పింది. ప‌దిహేనేళ్లు తెస్తామ‌న్న చంద్ర‌బాబు మోసం చేశారు. ఇప్పుడేమో ప్ర‌త్యేక హోదా కంటే ప్యాకేజీ ముద్దు అంటు కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. ఈ ప్యాకేజీలో కూడా ఎలాంటి స్ప‌ష్ట‌త లేక‌పోయినా టీడీపీ కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌లేక‌పోతోంది. కార‌ణం ఈ మూడేళ్ల పాల‌న‌లో ల‌క్ష‌ల కోట్లు అవినీతికి పాల్ప‌డ్డ‌ట‌మే. ఎక్క‌డ ఈ అవినీతిపై కేంద్రం విచార‌ణ‌కు ఆదేశిస్తోందోన‌ని చంద్ర‌బాబు భ‌యం. దీంతో నిరుద్యోగ స‌మ‌స్య తీవ్ర‌రూపం దాల్చుతోంది. ఇలాంటి క్ర‌మంలో నిరుద్యోగ భృతికి బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ తాజాగా సీఎం చంద్ర‌బాబుకు లేఖ రాశారు.
Back to Top