బా

ఉద్యోగాలపై ఉలుకు పలుకులేని సర్కార్..!
ఏపీపీఎస్సీకి ఛైర్మన్ నియమించని దౌర్భాగ్యం..!
నిరుద్యోగుల ఆశలు అడియాశలు..!

ఏపీ: ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా మారింది టీడీపీ ప్రభుత్వం తీరు. బాబొస్తే జాబు వస్తుందని ఎన్నికల ముందు ఊదరగొట్టిన పచ్చపార్టీ..అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతూ నిరుద్యగసహిత రాష్ట్రంగా మారుస్తోంది. జాబిస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు నిరుద్యోగులను నిండా ముంచుతున్నాడు. పాలన పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర అవుతున్నా ఒక్క అటెండర్ పోస్ట్ కూడా భర్తీ చేయకపోగా...ఉన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు పీకేస్తున్న దౌర్భాగ్య పరిస్థితి.

నోటిఫికేషన్లు ఇవ్వరు..ఛైర్మన్ ను నియమించరు..!
రాష్ట్రంలో 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని విభజన సమయంలో  లెక్కలు చెప్పారు. వాటి భర్తీకోసం ఇంతవరకు నోటిఫికేషన్ లు వెలువరించలేదు. డీఎస్సీ పరీక్ష నిర్వహించి నెలలు గడుస్తున్నా నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. ఉద్యోగాల భర్తీకి వెన్నెముఖ అయినటువంటి ఏపీపీఎస్సీకి కనీసం ఛైర్మన్ ను కూడా నియమించని దుస్థితి. ఛైర్మన్ నియామకం కోసం కమిషన్ నుంచి ఫైలు వచ్చినా సీఎం పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం టీఎస్ పీఎస్సీ ఏర్పాటు చేయడమే గాకుండా ఛైర్మన్ , సభ్యులను నియమించి నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. కానీ చంద్రబాబుకు అవేమీ పట్టవు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి ఉద్యోగనోటిఫికేషన్లు ఇవ్వరాదంటూ ఆదేశాలిచ్చిన ఘనత చంద్రబాబుది. 

నీరుగారుతున్న ఆశలు..!
ఉద్యోగాల ఖాళీలపై కమలనాథన్ కమిటీకి  అందించిన నివేదికపై సమాచారం ఇవ్వాలని...ఏపీపీఎస్సీ ఆయా శాఖలకు లేఖలు రాసినా కనీస స్పందన లేదు. నివేదిక ఇవ్వకముందు 16 వేలకుపైగా పోస్టులు ఖాళీలున్నట్లు అప్పట్లో ఏపీపీఎస్సీ గుర్తించింది. ఆ పోస్టుల భర్తీకి కూడా అనుమతివ్వడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నోటిఫికేషన్లపై నిరుద్యోగుల ఆశలు అడియాసలుగానే మిగిలిపోతున్నాయి.
నెలకోసారి సమావేశం కావాల్సిన ఏపీపీఎస్సీ పాలకవర్గం చైర్మన్ లేకపోవడంతో మూడు నెలలుగా భేటీ కావడం లేదు. గత ప్రభుత్వాల హయాంలో చేపట్టిన గ్రూప్ 1, 2 నియామకాల న్యాయవివాదాలపై ఇటీవల కొన్ని మార్గదర్శకాలు ఇస్తూ సుప్రీం కోర్టు తుది తీర్పులు వెలువరించింది. తీర్పు వచ్చి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదు. 

కమిషన్ కు అప్రతిష్ట..!
రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఏపీపీఎస్సీ ప్రతిష్టను దిగజార్చే పనులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రాలకు కేటాయించబడే ఐఏఎస్‌లు ప్రాంతీయ భాష నేర్చుకోవాలన్న నిబంధన ఉంది. వారికి పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించే బాధ్యత ఏపీపీఎస్సీదే. ఐతే, ఇటీవలే ఏపీకి అలాట్ అయిన కొందరు ఐఏఎస్ లు ఇక్కడకు రాలేమనడంతో... ఢిల్లీకే వెళ్లాలని ఏపీపీఎస్సీ అధికారులకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలిచ్చి నిబంధనలను కాలరాసింది. 

Back to Top