బాబు తప్పు చేస్తే.. శిక్ష ప్రజలకా?

చంద్ర బాబు నాయుడు నిప్పు.ఆయన ఏ తప్పూ చేయడు. బాబుగారు పేదల భూములు లాక్కొని వాళ్ల నోట్లో మట్టి కొట్టినా తప్పుకాదు. వందలు..వేల ఎకరాలు భూ కబ్జాలు చేసినా తప్పుకాదు. రాష్ట్ర సంపదను విదేశాలకు దోచిపెడుతున్నా తప్పుకాదు. లక్షల కోట్లు వెనకేసుకుంటున్నా.. అవినీతి సొమ్ముతో ఒక్కో ఎమ్మెల్యేకి రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు ఇచ్చి కొంటున్నా తప్పుకాదు. ఎందుకంటే బాబుగారు ఏమీ చేసినా అది ప్రజల కోసమే. ప్రజా సంక్షేమం కోసమేనని ఆయన చెబుతుంటారు కాబట్టి.  బాబుగారు ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు కానీ, తాను సంపాదించిన అవినీతి సొమ్ముకు సంబంధించి కేంద్ర సర్కార్‌  సీబీఐ విచారణ వేస్తుందన్న పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఆయన చేసిన తప్పులను ప్రజలకు కూడా అంటగట్టే ప్రయత్నం చేస్తుంటే బాబుపై అసహ్యం వేస్తోంది. 

చంద్రబాబు నాయుడు చేసే తప్పులకు ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా? ఓటుకు నోటు కేసులో ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా? పట్టిసీమలో కానీ, పోలవరంలో కానీ, రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీల్లో కానీ ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా? అన్ని తప్పులు మీరు చేస్తూ అవి ప్రజలకు కూడా అంటగట్టాలని చూడడం ఎంతవరకు న్యాయం? ఇదేనా మీరు 40 ఏళ్ల రాజకీయాల్లో నేర్చుకున్నది?.

ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయినప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీపై కేసు పెట్టినప్పుడు అది మీపై పెట్టిన కేసు కాదని, రాష్ట్ర ప్రజలందరిపై పెట్టిన కేసు అనడానికి సిగ్గనిపించలేదా? ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన విషయమని, రాష్ట్ర ప్రజలందరినీ అవమానించినట్లుగా భావించాలని అనడం ఎంతవరకు సమంజసం. తప్పు మీరు చేస్తూ ప్రజలందరూ ఎందుకు అవమానంగా భావించాలి? వాళ్లు ఎందుకు శిక్ష అనుభవించాలి? మీ నీచ రాజకీయాలు ప్రజలపై ఎందుకు రుద్దుతారు? 
 
తాజాగా కేంద్రం నుంచి విడిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మీపై కేసులు పెడుతుందని, దాడి చేస్తుందని అంటూ ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయంగా మీరు చెప్పడం ఎంతవరకు న్యాయం? మీకు అన్యాయం చేస్తే అది ప్రజలకు చేసినట్లు ఎలా అవుతుంది బాబు? నువ్వు చేస్తున్న పాపంలోకి ప్రజలందరినీ ఎందుకు ఈడుస్తావు? నిప్పునంటూ చెప్పుకుంటూ తప్పులు చేస్తూ అది ప్రజలకు అంటగట్టాలని చూస్తే మాత్రం వాళ్లు ఈసారి చూస్తూ ఊరుకోరు. తప్పులు చేస్తూ.. ప్రస్తుతానికి స్టేలు తెచ్చుకుంటూ కాలం గడవచ్చుగాక.. రేపు జరిగే ప్రజా క్షేత్రంలో ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు చేసిన పాపాలకు తగిన గుణపాఠం చెబుతారు. 
Back to Top