బాబు పాలనలో మహిళకు భద్రత లేదు

టిడిపి హయాంలో మహిళలకు రక్షణ కరువు
దళిత మహిళలపై దాడులు
మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న తెలుగు తమ్ముళ్లు
నాయకులే స్వయంగా కీచకులౌతున్న దారుణాలు
నమస్తే అక్కయ్యా అంటూ నాడు రాజన్న చూపిన ఆదరణను గుర్తు చేసుకుంటున్న మహిళలు
వైఎస్ జగన్ ను తోబుట్టువుగా భావిస్తున్న మహిళాలోకం

నేడు ప్రపంచం అంతా మహిళా దినోత్సవం జరుపుకుంటోంది. కానీ నవ్యాంధ్రప్రదేశ్ లో మహిళలు కీచక పాలనలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. టిడిపి అంటే తెలుగు దుర్యోధనుల, దుశ్వాసనుల పార్టీ అని రోజా విమర్శలో 100శాతం నిజం ఉంది. 2104లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుండీ మహిళలపై దాడులు పెచ్చుమీరిపోయాయి. అధికారపార్టీ నేతలు, వారి అనుచరులే నిస్సిగ్గుగా మహిళలపై దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. దేశమే నివ్వెర పోయేలా మహిళలపై జులుం ప్రదర్శిస్తున్నారు. ఖర్మ ఏమిటంటే సాధారణ మహిళలు, పేదింటి ఆడబిడ్డలే కాదు, మహిళా అధికారులు, వ్యాపార వేత్తలు కూడా తెలుగు తమ్ముళ్ల ఆగడాలకు బలౌతున్నారు. 
అధినేత అండతో ఆగడాలు
ఇసుక దందాను అడ్డుకున్నందుకు తాసిల్దార్ వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చాడు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అవమానంతో, బాధతో న్యాయం చేయమన్న మహిళా అధికారిని స్వయంగా పిలిపించుకుని బెదిరించి, సర్దుబాటు చేసి పంపాడు చంద్రబాబు. అధినాయకుడి అండదండలతోనే తెలుగు తమ్ముళ్లు విచ్చల విడిగా మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. రితేశ్వరి కేసులోనూ ప్రిన్సిపల్ కు అండగా నిలిచారు ముఖ్యమంత్రి. కాల్ మనీ, సెక్స్ రాకెట్ దందాల్లోనూ తెలుగు తమ్ముళ్లను వెనకేసుకొచ్చారు. అనకాపల్లి టిడిపి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఓ మహిళ ఇంటిని కబ్జా చేసి, ఖాళీ చేయిమని బెదిరిస్తే కనీసం ఖండిచనైనా లేదు. ఓ మహిళా వ్యాపారవేత్త సంతకాన్నీ ఫోర్జురీ చేసి ఆమె స్థలాన్నీ, కంపెనీనీ కాజేయాలని చూసిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై సరైన చర్యలే తీసుకోలేదు. పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేసి, విచక్షణా రహితంగా కొట్టిన సంఘటన రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు పరాకాష్ట. ప్రభుత్వం తనకిచ్చిన స్థలంలో ఎన్టీఆర్ గృహాలు నిర్మించడమేంటని ఎదురు తిరగడమే ఆ దళిత స్త్రీ చేసిన ఘోర అపరాధం. విచ్చలవిడిగా మహిళలపై అఘాయిత్యాలు చేస్తున్నదేశం నేతలు, వారి అనుచరులను చంద్రబాబు బేషరతుగా వెనకేసుకొస్తున్నారు. ఇంతకు మించిన నీతిమాలిన తనం దేశంలో ఎక్కడా చూసి ఉండం. వివిధ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న 251 మంది టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటూ 120 దాకా జీవోలు పాస్ చేసాడు చంద్రబాబు. ఇదీ బాబుకు మహిళలపై ఉన్న గౌరవం. తెలుగుజాతి ఆత్మగౌరవం, మహిళలకు పెద్దపీట అంటూ మాట్లాడే చంద్రబాబు మాటల్లో నిజం లేదని రాష్ట్ర పరిస్థితులే చెబుతున్నాయి. ఎన్నికల కోసం దాఖలు చేసే అఫిడవిట్లలో టిడిపి నేతలపైనే అత్యధికంగా కేసులు ఉన్నాయని ఓ సామాజిక సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. మహిళలపై వేధింపుల్లో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. 
మహిళలు మెచ్చిన నాయకుడు
అప్పట్లో ఎన్టీఆర్ ను అందరూ అన్నగారు అని అనేవారు. ఆ తర్వాత వైఎస్సార్ ను రాజన్నా అంటూ గుండెలకు హత్తుకున్నారు. ఆ తండ్రి వారసత్వాన్నే పుణికిపుచ్చుకున్న వైఎస్ జగన్ ను రాష్ట్రంలోని ఆడపడుచులంతా జగనన్నా అని పిలుచుకుంటున్నారు. అభిమానంతో రాఖీలు కడుతున్నారు. హారతులిచ్చి ఆశీర్వదిస్తున్నారు. మాకు అండగా నువ్వుండాలయ్యా అని కోరుకుంటున్నారు. అది ఓ నాయకుడిపై ప్రజలకు ఉన్న నమ్మకం. మహిళలు మెచ్చిన నాయకుడెప్పుడూ జననేత అవుతాడు. నాడు ఎన్టీఆర్, నిన్న వైఎస్సార్ నేడు జగన్ ఆ కోవకు చెందుతారు. టిడిపి చేస్తున్న అరాచకాలతో తాము పడే బాధను అడుగడుగునా యువనేతకు చెప్పుకుంటున్నారు. నమ్మినందుకు నిలువునా దగా చేసాడంటూ ఆవేదన చెందుతున్నారు. వైఎస్సార్ తమను లక్షాధికారులను చేస్తే, బాబొచ్చి వీధుల్లోకి లాగాడని వాపోతున్నారు. బాబు వల్ల నష్టపడి, కష్టపడుతున్న ప్రతి అక్కచెల్లెమ్మకూ అండగా ఉంటానని మాటిచ్చారు వైఎస్ జగన్. వారి కన్నీళ్లు తుడిచి, కష్టాలను దూరం చేస్తానని కూడా హామీ ఇచ్చారు. పిల్లల చదువుల గురించి దిగులు వద్దని, వారిని బడికి పంపితే చాలని, వారి చదువుల ఖర్చులన్నీ భరిస్తానని దిలాసా కల్పించారు. ఆడపడుచులకు పావలా వడ్డీ రుణాలు, వడ్డీలేని రుణాలు ఇచ్చి ఆర్థిక స్వాతంత్య్రాన్ని తిరిగి తెస్తానని ప్రకటించారు. 45 ఏళ్లకే పింఛను ఇచ్చి ఆదుకుంటామన్నారు. కష్టం వచ్చినప్పుడు కాదు, కష్టాన్నే రాకుండా చూస్తానని వాగ్దానం చేసిన ఆ యువనేతను చూసి మురిసిపోతున్నారు తెలుగు మహిళలు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పుడే తమకు నిజమైన మహిళాదినోత్సవం వస్తుందని నమ్ముతున్నారు. 

 
Back to Top