బాబు మాటలు నీటి మూటలు

తాత్కాలిక భవనాలంటూ చంద్రబాబు కోట్లు పోసి కట్టిన సచివాలయం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అతి తక్కువ సమయంలో కట్టిన సచివాలయం. వెలగపూడిలో వెలిగిపోయిన తాత్కాలిక సచివాలయం. ప్రపంచం గర్వించేలా బ్రహ్మాండమైన సచివాలయం. ఇదీ చంద్రబాబు తెగ బాకా ఊదిన సచివాలయం ముచ్చట. మరి నిజం ఏమిటి? మట్టి వినాయకుడు నీళ్లలో కరిగిపోయినట్టు, వర్షం కాస్త పడితే చాలు తాత్కాలిక భవనాలు చిల్లులు పడి, పెచ్చులూడి, గదులన్నీవాన నీళ్లలో మునిగి పోయాయి.  ప్రతిపక్ష నేత ఛాంబరే కాదు, మంత్రుల ఛాంబర్లు కూడా తడిసి ముద్దైపోయాయి. ఫర్నిచర్లు తడిసిపోయాయి. ఎసిల్లోకి నీరు చేరిపోయింది. సీలింగ్ కాస్త వర్షానికే పెచ్చులూడీ కిందపడింది. అసెంబ్లీ భవనం కూడా నేనేమన్నా తక్కువ తిన్నానా అంటూ వాన నీరును ఒడిసి పట్టింది. నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా బాబు గారు సెక్రటేరియట్, అసెంబ్లీల్లో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారంటూ వేళాకోళం చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఏడాదే కాదు, గతేడాది కూడా ఇంతకంటే తక్కువ వానకే బాబుగారి ఆధునిక టెక్నాలజీ భవనాలు చిల్లులు పడి లీకులయ్యాయి. ప్రతిపక్ష పార్టీల మీద, ప్రతిపక్ష నాయకుడు జగన్ పై బురద జల్లుతూ లీకులివ్వడం పై బాబుగారి కున్న శ్రద్ధలో పావు వంతు ఈ భవనాలపై పెట్టుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని అనుకుంటున్నారు ప్రజలు. భవనాల నాణ్యత ఇంత బ్రహ్మాండంగా బయటపడ్డా కూడా ఈ నిర్మాణాలు చేసిన సంస్థలపై బాబుగారి సర్కార్ పల్లెత్తు మాట అనడం లేదు. చర్యలు తీసుకోవడం లేదు. దొంగా దొంగా కలిసి దొంగ సొమ్మును పంచుకుంటే ఇద్దరూ తేలుకుట్టిన దొంగల్లా గప్ చుప్ అయిపోతారుగదా...ఇదీ అంతే అని సరిపెట్టుకోవాల్సి వస్తోంది. నిరుడు వర్షానికి చిల్లుపడ్డ పైకప్పుల రిపేరు సంగతి చూస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది దానికి ప్రతిగా భవనాల్లో దాదాపు సగం గదులన్నీ నీళ్ల కుండలైపోయాయి. సచివాలయం బైట అయితే పడవేసుకుని లోపలికెళ్లాల్సిన పరిస్థితి ఉంది. 
పచ్చని పంట పొలాలు, నీటి కాలువలు, వర్షపు నీటిని తనలోకి ఇముడ్చుకునే పదునైన భూమి...వీటిని నాశనం చేసి, నదీ తీరానికి దగ్గరలో, ఏడాదికి నాలుగు పంటలు పండే పచ్చని పొలాలను ఆక్రమించి ఇలాంటి చౌకనిర్మాణాలు చేసిన చంద్రబాబుకు ఇప్పటికైనా బుద్ధి వస్తుందా? రెండు నిర్మాణాలనే సవ్యంగా కట్టలేని ఈ మనిషేనా 40 ఏళ్ల అనుభవం, హైదరాబాద్ నగరాన్ని నేనే నిర్మించా అని గప్పాలు కొట్టుకున్నది? అనుభవం ఉన్నవాడిని అమరావతిని నిర్మిస్తా అని నమ్మించి ఓట్లు దండుకుని, అట్టముక్కల భవనాలు కట్టి, వేలకోట్లు దండుకోవడమేనా బాబుగారి అనుభవం. ఇదే వర్షానికి ఆయన కరకట్టపై కట్టుకున్న ఇంట్లో చుక్కనీరు కారలేదు. కానీ ప్రభుత్వ భవనాలు మాత్రం కాగితపు నిర్మాణాల్లా నీళ్లలో తేలుతున్నాయి. 
బాబును నమ్మిన వాళ్లకు నట్టేట మునగడం తప్ప మరో దారి ఉండదని చెప్పడానికి ప్రకృతి మనకు చూపిన నిదర్శనం ఇది. బాబు మాటలన్నీ నీటి మూటలని చెప్పడానికి ఇంతకంటే రుజువేం కావాలి? 


 

తాజా ఫోటోలు

Back to Top