బాబుకు చెల్లుచీటి రాయకపోతే...

సంక్షేమం గోవిందా...అభివృద్ది గోవిందా...గోవిందా

టెలి కమ్యూనికేషన్‌ రంగంలో విప్లవం తెచ్చేసి, సాఫ్ట్‌వేర్‌ రంగానికి ఒక దారి చూపించేసి, ఇప్పుడు ప్రకృతి, వ్యవసాయానికి కూడా ఉద్దరించేసే పనిలో తలమునకలై వున్నానంటున్నారు మన సీఎం గారు. ఆయన మాటలెలా వుంటాయంటే..ఆయన వెనుకా ముందు ఎవరు లేరన్నట్టు, వుండరన్నట్టు...అంతకు ముందు అసలీ రాష్ట్రంలో కాదు కాదు...దేశంలోనే ఏమీ జరగలేదన్నట్టు వుంటాయి. నిద్రపోతున్న తెలుగుజాతినే కాదు భారతీయులను..ఆ మాటకొస్తే, అవకాశం చూసుకుని అమెరికా వారిని కూడా మేల్కొన్నట్టు చెప్పేస్తుంటారు. 
టెలికమ్యూనికేషన్‌ రంగంలో శామ్‌పిట్రోడా ఎక్కడో...ఆ విప్లవాన్ని తేవాలని పనిచేసిన అప్పటి ప్రధాని ఎక్కడో కానీ...అంతా బాబుగారే చేసేశానంటున్నారు. చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్టు...బాబుగారు ఎదుటివారన్నా...వారి తెలివితేటలన్నీ మహాలోకువ. ఆయన వందిమాగధ సందోహం దగ్గరేమో కానీ, పాపం సదస్సులేవైనా, అన్నదాతలైనా, అమెరికా వారైనా...ఆయన ముందు నథింగ్‌ అన్నట్టుగా యమ కాన్ఫిడెంట్‌ మాట్లాడేస్తుంటారు. ’నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు...నా ఇచ్చయే కానీ నా కేటి వెరపు ’ అనుకున్న బాబు మాటల కోటలకు తలలు బద్దలు కొట్టుకోవాల్సిందే గానీ...మరొకటి చేయలేము కాక చేయలేం.
లేటెస్ట్‌గా మరోసారి అమెరికాలో నిన్నటి దాకా గడిపిన బాబుగారు అక్కడ మాట్లాడిదంతా..మన వ్యవసాయరంగ ప్రగతి గురించే. దేశం మొత్తం మీద మన వ్యవసాయరంగమే అతి ఘనమట. అది బాబుగారి చలవేనట. ఆఖరుకు సేంద్రియ వ్యవసాయాన్ని కూడా నేనే కనిపెట్టాను. పద్దతులు నేర్పించాను. దాంతో రైతులంతా నయాపైసా పెట్టుబడులు లేకుండా ఇబ్బడి ముబ్బడిగా పంటలు పండించేసుకుని...పండగ చేసుకుంటున్నారని ఊదర గొట్టేస్తున్నారక్కడ. సప్తసముద్రాల అవతలకు వెళ్లినా బాబుగారు మారరంతే. ఏమన్నా అంటే...అంతా నా డ్యాష్‌ బోర్డులో కనిపిస్తుంది...చూసుకోండి అంటారు. 
ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వ్యవసాయ విస్తీర్ణం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తగ్గుతూ పోతోంది. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతు ఏటికేడాది అప్పుల వూబిలో కూరుకుపోతూనే వున్నాడు. బాబుగారు రుణమాఫీ పేరిట కొట్టిన దెబ్బకు దిమ్మతిరిగిపోయిన, రైతింకా తేరుకోకముందే...పండించిన పంటకు గిట్టుబాటు ధర మాటే లేకుండా చేశారు బాబుగారు. ఈ రోజు దళారులు సిండికేటయి రైతుల ఉసురు తీస్తున్నా, బాబుగారికి కనిపించదు. తన హెరిటేజ్‌లో ఫలాల ఫలితం చూసుకుంటున్నారు కానీ, ఫలసాయం ఏ మాత్రం దొరకని రైతు విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 
అదృష్టవశాత్తు గత ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు అదంతా తన గొప్పతనమే అనుకున్నారు. అనుకుంటే అనుకున్నారు...ఆయనకు అది మామూలే కదా అని వదిలేస్తే... ఆ తర్వాత ఆయన ప్రజలనే వదిలేశారు. వారికిచ్చిన హామీలను మరిచిపోయారు. ఆయన మాటలన్నీ గాల్లో తేలిపోయినా, నీటిమూటలైనా, అసలు ఆయనగారి మాటకే విలువ లేకుండా పోయినా...దర్పం మాత్రం వీడలేదు. 
నాలుగున్నరేళ్ల కాలంలో ఆయన చేసిందల్లా తప్పుల్ని ప్రతిపక్షం మీద నెట్టేయడం...తన చేతకాని తనానికి వారిని కారణంగా చూపడం మాత్రమే. గెలిచిన రోజు నుంచి బాబు చేస్తున్న రాజకీయమంతా వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలన్నది మాత్రమే. ప్రజాక్షేత్రంలో పనిచేయని నేతకు...రెండు మూడు సార్లు అదృష్టం కలిసొచ్చింది. ఇక ఎప్పుడూ అదే అదృష్టం తలుపు తడుతుందనుకుని, ఆయన వరల్డ్‌ టూర్లు కొట్టేస్తున్నారు. ప్రజాసొమ్మును ఫ్లయిట్ల పాలు చేస్తున్నారు. ఆయన నిర్వాకమంతా అడుగడుగునా అవినీతి మయం. ఆయనను చూసి, ఆయన అనుచరులు దోచుకోవడంలో..దాచుకోవడంలో ప్రపంచరికార్డులను బద్దలు కొడుతున్నారు. 
మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నారు. తన దగ్గర డబ్బుసంచులున్నాయంటాడు బాబు. ప్రజల్ని మళ్లీ మభ్యపెట్టడానికి రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. ఇప్పుడిక కళ్లు తెరవాల్సింది ప్రజలే. వారికోసం. వారి బాగు కోసం. రాష్ట్రం కోసం. రాష్ట్రాభివృద్ది కోసం!!

తాజా వీడియోలు

Back to Top