బాబొస్తే జాబులు ఊడాయి!

 బాబు వస్తే జాబులు వస్తాయని తెలుగుదేశం పార్టీ
ఎన్నిలక ముందు ఆర్భాటంగా ప్రచారం చేసింది. చంద్రబాబు కూడా ఊరూవాడా తిరిగి మరీ చెప్పారు.
తమ్ముళ్లూ నాకు ఓటు వేయండి.. మీ జాబుల సంగతి నేను చూసుకుంటాను.. అని. అలా ప్రచారం చేసి
ఓట్లేయించుకున్న చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. బాబు అధికారానికి రావడంతోనే ఉద్యోగాలు
వస్తాయని ఆశించిన నిరుద్యోగులకు ఆశాభంగమయ్యింది. కొత్త ఉద్యోగాలు రావడం మాట సంగతటుంచి
ఉద్యోగాల్లో ఉన్నవారిని ఇంటికి పంపడం మొదలైంది. గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)లో
ఎన్‌పీఎం (నాన్ ఫెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ - పురుగుమందులు లేని వ్యవసాయం) విభాగంలో పనిచేస్తున్న
కాంట్రాక్టు సిబ్బందిని ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించేశారు. ఈఏడాది ఏప్రిల్
22న సెల్‌లో మెస్సేజ్ పంపించి పై అధికారులు వీరిని తొలగించేశారు.

      రాష్ర్టవ్యాప్తంగా
10,268 మంది ఎన్‌పీఎం సిబ్బంది వీధుల పాలయ్యారు. తొలగించడానికి ముందు కూడా వీరికి జీతాలు
బకాయిలు ఉన్నాయి. అవి దాదాపు 18 కోట్ల వరకు ఉంటాయని అంచనా. రాష్ర్టవ్యాప్తంగా 392 మండలాల్లో
14,93,824 మంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. వీరిని పర్యవేక్షించి అవసరమైన
సలహాలు ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో 7,250 మంది వీఏలు, 1,450 మంది సీఏలు, 1,450 మంది
గ్రామ కమిటీ మెంబర్లు, 59 మంది జిల్లా కమిటీ మెంబర్లు, 59 మంది కంప్యూటర్ ఆపరేటర్లు
విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరినీ కాంట్రాక్టు సిబ్బంది కింద (జీవో నెంబర్
360) 2006లో విధుల్లోకి తీసుకున్నారు. వీఏలకు రు2వేలు, సీఏలకు రు.6వేలు, ఆపరేటర్లకు
రు.7వేలు చొప్పున వేతనం నిర్ణయించారు.

      క్షేత్రస్థాయిలో
పంటలపై రైతులకు అవగాహన కల్పించడం, పొలంబడుల ద్వారా సూచనలు సలహాలివ్వడం, అంతరపంట సాగుపై
మెళకువలు అందించడం, వ్యవసాయ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసి చైతన్యపరచడం
వంటి కీలక బాధ్యతలను ఈ సిబ్బంది నిర్వర్తించారు. వీరిని తెలుగుదేశం ప్రభుత్వం అకస్మాత్తుగా
విధుల్లోనుంచి తొలగించేసింది. దాంతో 10వేల కుటుంబాలు రోడ్డునపడ్డాయి.

      తమకు
జరిగిన అన్యాయాన్ని వీరు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
ఇడుపులపాయలో జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్న ఉద్యోగాలు పోయిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా
అభ్యర్థించారు. ప్రత్యామ్నాయం చూపించకుండా ఉన్నఫళంగా తమను తొలగించారని కన్నీటిపర్యంతమయ్యారు.
ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్‌పీఎం సిబ్బందిని కొనసాగిస్తుండగా
తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం తమపై వేటు వేసిందని జగన్‌కు వారు వివరించారు. స్థైర్యం
కోల్పోవద్దని, వారి తరపున తాను అసెంబ్లీలో పోరాడతానని జగన్ వారికి హామీ ఇచ్చారు.

 

 

Back to Top