బాబు అసహనం

ఇన్నాళ్లకు బాబు ఓ నిజం ఒప్పుకున్నాడు. రాష్ట్రం అశాంతితో ఉందన్న విషయాన్ని స్వయంగా బయటపెట్టాడు. ఆనంద నగరం, సంతృప్త స్థాయిలు, డ్యాష్ బోర్డ్ లెక్కలు వంటి అబద్ధాలను కాస్త పక్కన పెట్టి రాష్ట్రం అశాంతికి గురౌతోందని ఫీలయ్యారు ముఖ్యమంత్రి. అయితే అందుకు కారణం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అని అంటున్నాడు. ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి, కేంద్రం నుంచి నిధులు ఆగిపోవడానికి కూడా ప్రతిపక్షమే కారణం అన్నాడు చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రంలో అశాంతికి కారణం కూడా ప్రతిపక్షమే అంటున్నాడు. రేపు రాజధాని కట్టకపోవడానికి కారణం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ అని అంటాడేమో? 

అశాంతికి కారకులెవ్వరు

అసలు చంద్రబాబు ఇంత అసహనానికి గురై ప్రతిదీ ప్రతిపక్షం నెత్తిన వేసేందుకు ప్రయత్నించడానికి కారణం ఏమిటీ అంటే ఆయన అసమర్థత ఒక్కటే కారణం అని చెప్పాల్సొస్తుంది. కాంట్రాక్టర్లను మార్చి ప్రాజెక్టు పనులు పడకేసేలా ప్రతిపక్షం చేసిందా? అంచాన విలువలు వేల కోట్లకు పెంచమని ప్రతిపక్షమే చెప్పిందా? యూసేజీ బిల్లులు కేంద్రానికి పంపద్దని కూడా విపక్షమే ఆదేశించిందా? ఇసుక, మద్యం మాఫియాలు పెంచి పోషించమని ప్రతిపక్షమే సలహా ఇచ్చిందా? కేంద్రం ఇచ్చిన నిధులను దుబారా చేయమని, లక్షల కోట్లు అప్పులు చేయమని, విదేశాలకు తిరిగి ప్రజల సొమ్ము హారతి ఇమ్మని, జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాలను దోచుకొమ్మని, అధికారులపై నాయకులను చేయి చేసుకొమ్మని, అసెంబ్లీలో బూతు పంచాంగం విప్పమనీ ఇవన్నీ ప్రతిపక్షం చెబితేనే జరిగాయంటారా?

చంద్రబాబు పాలనా విధానం ప్రజల్లో అసంతృప్తికి, ఆగ్రాహావేశాలకు కారణం అవుతోంది. అడుగడుగునా అణిచివేత, నిరంకుశత్వం, కష్టాలు చెప్పుకోవాలంటే అందుబాటు లో ఉండని అధికార, నాయక గణం. సచివాలయాని కొస్తే ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేకపోవడం, కలిసినా బాబు చిరాకులూ, ఛీత్కారాలు ఎదురవడం. ఏ పథకం లబ్ది పొందాలన్నా సవాలక్ష అడ్డంకులు. అపరిమితంగా పెరిగిపోయిన అవినీతి. గూండాల రాజ్యం. రక్షణ లేని సమాజం. పెరిగిపోయిన ఆర్థిక నేరాలు. ఉపాధి లేక, ఉద్యోగాలు లేక ప్రజల్లో పెరిగిపోయిన నిరాశా నిస్పృహలే నేడు ఆగ్రహావేశాలై రగులుతున్నాయి. 

కులాల కుంపట్లు పెట్టింది బాబు కాదా!!

వర్గాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని అశాంతి పాలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీని, ఆపార్టీ అధినేతను, పార్టీ నాయకులు, కార్యకర్తలను అనడం చంద్రబాబు అవివేకానికి నిదర్శనం. వర్గాల మధ్య చిచ్చు పెట్టింది ప్రతిపక్షమే అయితే ఆ నాయకుడు అడుగు పెట్టిన ప్రతిచోటా అన్ని వర్గాల ప్రజలూ ఎందుకు ప్రభంజనంలా వస్తారు? ఆత్మీయ సమ్మేళనంలో మనసువిప్పి ఎందుకు మాట్లాడతారు? మాకీ సాయం కావాలన్నా అని ధైర్యంగా ఆ నాయకుడినే ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే కులంతో, మతంతో, వర్గంతో, ప్రాంతంతో చివరకు జాతితో సంబంధం లేకుండా ప్రజల కష్టాన్ని మాత్రమే చూసే నాయకుడు వైఎస్ జగన్ అని ప్రజలు నమ్ముతున్నారు కనుక. చంద్రబాబుకు ఎవరైనా తమ కష్టం చెప్పుకోబోతే ఆయన ప్రతిస్పందన ఎంత అమానవీయంగా ఉంటుందో వారికి బాగా తెలుసు కనుక. ఓ రైతు రుణమాఫీ గురించి అడిగితే నువ్వు ఏపార్టీ అని గద్దించడం మరిచిపోతారా?  మా చదువులు నాశనం కాకుండా కాపాడమని వేడుకున్న ఫాతిమా విద్యార్థులను మీరు ఎవ్వరెవ్వరిదగ్గరికో వెళుతున్నారంటూ కసురుకున్న విషయాన్ని గుర్తు చేసుకోరా? నిన్నటికి నిన్న నాయీ బ్రాహ్మణులపై వేలుచూపి బెదిరిస్తూ విరుచుపడటాన్ని అందరూ గమనించలేదా? రైతులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు ఒక్కరేమిటి చంద్రబాబును కలిసిన ఎవ్వరికీ న్యాయం అనేదే జరగలేదు. కులమతాలకు అతీతంగా ప్రజలు నమ్మేది, వెంట నడిచేది ఒకే ఒక్కడి వెంట. ఆయనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 

బాబు ఎంత అసహనానికి లోనైనా, ప్రతిపక్షం పై ఎంత బురద జల్లాలని ప్రయత్నం చేసినా స్వచ్ఛమైన స్ఫటికమంటి ప్రేమాభిమానాల ముందు అది నిలువదు. అంతులేని అభిమాన వర్షంలో ఆ విమర్శల చెత్త కొట్టుకుపోతుంది. కడిగిన ముత్యం వంటి మహానేత వారసత్వం ప్రజల కోసం ముందుకు వస్తుంది. 
Back to Top