అభద్రతలో బాబు..?

– అందుకే సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై కేసులు
– ఓటేసిన ప్రజలకు ప్రశ్నించే హక్కులేదా
– సోషల్‌ మీడియాపై ఆంక్షలు భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లే 

మొన్న ఇంటూరి రవికిరణ్‌.. తాజాగా రవీంద్ర ఇప్పాల.. ఇక ముందు ఇంకెందరో.! పోలీస్ వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రశ్నించిడిన ప్రతివాడిని అరెస్ట్ చేస్తానంటూ ముఖ్యమంత్రి హిట్లర్ పాలన సాగిస్తున్నారు.  వైయస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన మద్ధతుదారులపై తప్పుడు కేసులు బనాయించి వేధించాలని చూడటం కంటే దారుణం మరోటి ఉండదు. అరెస్టులతో ప్రజా వ్యతిరేకతను అడ్డుకోవాలని చూడటం చంద్రబాబు అవివేకమే. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఇలాంటి అరెస్టులు శృతి మించితే మున్ముందు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో తెలియంది కాదు. బషీర్‌బాగ్‌ సంఘటన చంద్రబాబును ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన సంగతి మరిచిపోతే ఎలా. సోషల్‌ మీడియాను, పచ్చ మీడియాను వాడుకుని అధికారం వెలగబెడుతున్న చంద్రబాబుకు.. ప్రభుత్వ అవినీతి, అసమర్థతను వైయస్‌ఆర్‌ఈపీ అదే సోషల్‌ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తుంటే ఓర్వలేకపోతోంది. పార్టీపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది వీరిపై మోపబడ్డ అభియోగం. సోషల్‌ మీడియా అన్నాక అన్నీ వుంటాయి. ’నేను చేసిందే రైటు.... ఇంకెవ్వరు చేసినా తప్పు అనే ధోరణిలోకి చంద్రబాబు వెళ్లిపోయాడు. 

టీడీపీ చేస్తే కరెక్టు.. జగన్‌ అభిమానులు చేస్తే తప్పా..?
అధికార టీడీపీ నాయకులు వైయస్‌ జగన్‌పై ఎన్ని పోస్టులైనా పెట్టవచ్చు. ఆయన వ్యక్తిగత జీవితం.. కుటుంబ సభ్యుల మీద కూడా ఉన్నవీ లేనివీ పెట్టి రచ్చ చేసేయెచ్చు. అదీ కూడా టీడీపీ అఫీషియల్‌ పేజీలోనే. కానీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వైయస్‌ఆర్‌సీపీ అభిమానులు చేస్తే మాత్రం చంద్రబాబుకు ఎక్కడో కాలింది. ఒకరి తర్వాత ఒకరికి నోటీసులివ్వడం. అరెస్టు చేయడాలు  కామనైపోయింది. ఎందుకు అరెస్టు చేసేది చెప్పరు. ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు. ఏం కేసు నమోదు చేస్తారో వారికే అర్థం కాదు. మొన్నటి దాకా పొలిటికల్‌ పంచ్‌ ఫేస్‌బుక్‌ పేజీ నిర్వహిస్తున్న ఇంటూరి రవికిరణ్‌ను రెండు వేర్వేరు కేసులు పెట్టి తిప్పుతున్న పోలీసులు ఇపుడు తాజాగా బెంగళూర్‌ నుంచి పనిచేసుకుంటున్న రవీంద్ర ఇప్పాలను కూడా అరెస్టు చేశారు. మరికొందరికి నోటీసులు జారీచేయగా ఇంకొంత మంది అరెస్టుల జాబితా కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఆఖరికి ఎమ్మెల్యే అనితతో ఎప్పుడూ కలిసి మాట్లాడని ఇంటూరిపై అత్యాచార యత్నం కేసు నమోదు చేయడమే ఇక్కడ పెద్ద జోకు. ఇదీ పోలీసుల పనితీరు. ఎమ్మెల్యే అనిత ఎస్సీ కాబట్టి మొదట అట్రాసిటీ కేసు పెట్టారు. మహిళ కాబట్టి అత్యాచార యత్నం కేసు పెట్టారు. అంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి కేసులు పెట్టేస్తే సరిపోతుందని టీడీపీ వ్యూహం. కొన్నాళ్లు విచారణల పేరుతో అటూ ఇటూ తిప్పి వేధిస్తే వాళ్లే మానుకుంటారులే అనేది టీడీపీ వ్యూహం. 

పక్కదారి మళ్లించడమే టీడీపీ వ్యూహం
సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న జగన్‌ అభిమానులు, పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తే జగన్‌ ఎలాగైనా కలగజేసుకుంటాడు. ఆయన్ను ఇలాంటి చిన్నాచితకా కేసుల వైపు మళ్లించి ఎంచక్కా తమ పనిని చక్కబెట్టుకోవాలనేది టీడీపీ వ్యూహం. ఇప్పటికే  పీకల్లోతు కేసులతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నటీడీపీ ఇలా ఉపశమనం పొందాలనేది ఎత్తుగడ. ఒకరి తర్వాత ఇంకొకరు ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే బాబు భజన మండలి చేత ఆరోపణలు చేయిస్తూ తెరవెనుక వైయస్‌ఆర్‌సీపీకి సమయం లేకుండా చేయాలనేది వారి వ్యూహం. ఇప్పటికే జగన్‌ ప్రధానిని కలిసి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు పార్టీ పరిస్థితి కళ్లు తాగిన కోతిలా మారింది. జగన్‌ ప్రధానిని కలిసి ప్రెస్‌ మీట్‌ పెట్టాడని తెలిసిందో లేదో... చంద్రబాబు అప్పటికప్పుడు పర్యటన రద్దు చేసుకుని నేరుగా ఢిల్లీలో ఊడిపడ్డాడు. హైదరాబాద్‌కు రావాల్సిన మనిషి నేరుగా ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడోనని జనాలు తమకు తోచిన విధంగా ఊహించుకుంటుంటే అక్కడికొచ్చిన మనిషి దాదాపు ఆరు గంటలు కనిపించకుండా పోవడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఇలా చంద్రబాబు తనకు తానుగానే ప్రతిపక్షాలకు, నెటిజన్లకు ఆయుధంగా మారి దానిని ప్రశ్నించిన వారినే జైలుకు పంపిచడం చంద్రబాబు అసహనానికి నిదర్శనం. సోషల్‌ మీడియా పోస్టులకే ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడంటేనే తెలుస్తుంది ఆయనెంత అభద్రతాభావంతో పాలన కొనసాగిస్తున్నాడోనని. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top