బాబు గుండెల్లో సుడిగుండం

 

చంద్రబాబు
గడబిడగా మాట్లాడటం చూస్తే రాజమండ్రి దడదడలు బాబుగారి గుండెల్లో బాగానే దడ పుట్టించినట్టు
తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఎపి ప్రతిపక్ష
నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పం తూర్పుగోదావరిలోకి అడుగుపెట్టడం ఆషామాషీగా
జరగలేదు. ఏ గోదావరి జిల్లాల్లో ఓట్లతో చంద్రబాబు పీఠం ఎక్కగలిగాడో, ఆ ప్రాంత
వాసులే యువనేతకు జన నీరాజనం పట్టారు. రాజమహేంద్రవరంలో రైల్ కం రోడ్
బ్రిడ్జ్ పై జగన్ సేన కవాతు చూసి చంద్రబాబులో వంట్లో వణుకు, మాటల్లో
బెరుకు కనబడుతున్నాయి. అర్థంతరంగా టీడీపీ సమన్వయ కమిటీ
మీటింగ్ పెట్టి మరీ తన బెరుకును బైట పెట్టుకున్నాడు చంద్రబాబు. గోదావరి
తీరం బాబు గుండెల్లో సుడిగుండాలు సృష్టించిందన్నది నిజం.

భయానికి
ముసుగు

తనపై
వ్యతిరేకతా, ఓడిపోతానన్న భయం బాబులో స్పష్టంగా కనిపిస్తోంది. దాన్ని
కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ
నేతలు, కార్యకర్తలు, అభిమానులు సైతం రాజమహేంద్రిలో
ప్రతిపక్ష నేతకు లభించిన అపూర్వ ఆదరణ చూసి ఔరా అనుకుండా ఉండలేకపోయారు. ఇలాంటి
అభిమానం ప్రజల మనసుల్లోంచి తమ నాయకుడికి వచ్చే అవకాశం లేదనికూడా పెదవివిరిచారు. పార్టీ
శ్రేణుల్లో ఈ నిరాశ పేరుకోకముందే తక్షణ కార్యాచరణకు పూనుకున్నాడు చంద్రబాబు. రాబోయే
ఎన్నికల్లో ఈవీఎంలను కేంద్రంలో ఉన్న బీజేపీ మేనేజ్ చేసే అవకాశం ఉంది అని అన్నాడు. ఓటింగ్
యంత్రాలపై అనుమానాలున్నాయని కూడా చెప్పుకొచ్చారు. ఆడలేక మద్దెల ఓడన్నట్టు, రాబోయే
ఎన్నికల్లో గెలుపు అవకాశాలు లేక ఇప్పటి నుంచే ఓటమికి కారణాలు చెప్పుకునేందుకు ప్రయాస
పడుతున్నట్టనిపిస్తోంది చంద్రబాబు వైఖరి.

అప్పుడలా
ఇప్పుడిలా

ఇక
గోదావరి జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం గురించి సీన్ పూర్తిగా అర్థం అయిపోయింది
చంద్రబాబకు. దాంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ ఆయనకు మళ్లీ దీక్షలు తప్ప
మరో గత్యంతరం లేదనిపిస్తోంది. యువనేత వెనకాలే వెళ్లి రాజమహేంద్రవరంలో
మరో ధర్మపోరాట దీక్ష చేద్దాం అని అంటున్నాడు. అదీ చాలదని అనుకున్నాడేమో రాయలసీమలోనూ
మరో సభ పెడదాం అన్నాడు. వర్సిటీ విద్యార్థులతో సమావేశాలు
చేద్దాం అని కూడా సాలోచనగా చెప్పాడు. ఢిల్లీలో సంబంధిత కార్యాలయాల వద్ద
ఆందోళనలు కూడా చేద్దాం అని ముక్తాయింపు ఇచ్చాడు. ఇంతకీ ఈ హంగామా అంతా చంద్రబాబు
మొదటి నుంచీ ఎందుకు చేయలేకపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ
అధినేత వైఎస్ జగన్ ప్రత్యేక హోదా కోసం ఇదే విద్యార్థులతో యువభేరీలు నిర్వహిస్తే అప్పుడెందుకు
అడ్డుకున్నారు? హోదా అంటే జైలుకే అని ఎందుకు బెదిరించారు? ప్రత్యేక
హోదా కోసం దీక్షలు చేసినప్పుడు ఎందుకు బలవంతంగా భగ్నం చేసారు? నేడు
హోదా, విభజన హామీలపై పోరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్
కావడం జీర్ణించుకోలేక చంద్రబాబు సతమతం అవుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికైనా
దీక్షలు, ఆందోళనలు చేసి టిడిపి సైతం హోదాకోసం పోరాడిందనే పేరు దక్కించుకోవాలని
తెగ తాపత్రయపడుతున్నట్టే ఉంది. కానీ చంద్రబాబు డ్రామాలను ప్రజలు
ఆల్రెడీ పసిగట్టేశారు. అందుకే చంద్రబాబు సభలకు బలవంతంగా
వచ్చినవాళ్లు, గేట్లు దూకి పారిపోవడం, లేదా అసలు గైర్హాజరవడం చేస్తున్నారు.

సెంటిమెంట్

గోదావరి
పాదాల చెంత మొక్కి, ఆ బ్రిడ్జ్ పై కాలు పెట్టిన ప్రతిపక్ష నేతలను అధికారం వరించిందనే
సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది. గతంలో వైఎస్సార్, తర్వాత
చంద్రబాబు సిఎమ్ గా అధికారం చేపట్టడమే అందుకు కారణం. నేడు  మహానేత తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష
నాయకుని హోదాలో పాదయాత్రగా వారధిపై కాలు మోపారు. ఇది శుభ సూచికం అని, సెంటిమెంట్
ప్రకారం ఆయన కూడా సిఎమ్ అవుతారని అనుకుంటున్నారు ప్రజానీకం.

మొత్తానికి
యువనేత సత్తా ఏమిటో ప్రజాసంకల్ప యాత్ర నిరూపిస్తే, ప్రతిపక్షనేత గెలుపు సూచికలను
ఢంకా బజాయించి మరీ ప్రకటించింది గోదావరి తీరం. ప్రభుత్వం గుండెల్లో ఫిరంగులు
పేలి, తక్షణం తమ ఉనికిని బ్రతికించుకునే పనిలో పడిపోయింది టీడీపీ.  

 

తాజా వీడియోలు

Back to Top