పోలవరంతో చంద్రబాబు ఆటలు

 – నిన్న బీజేపీని తిట్టాడు.. నేడు సముదాయింపులు
– కాంట్రాక్టు దక్కించుకోవడం కోసమే డ్రామాలు
– అసెంబ్లీ వేదికగా నాటకాన్ని రక్తి  కట్టించిన బాబు 
– ముందు రోజు వార్తలు రాసి వంత పాడిన పచ్చ పత్రికలు 
– కాపు రిజర్వేషన్లకు మళ్లించి పక్కదారి పట్టించినా ఆశ్చర్యం లేదు

వద్దంటే ఆపేస్తాం.. కేంద్రం సహకరించకుంటే ఇంకేం చేస్తాం..  పోలవరం నేను చేస్తామని ఏనాడూ కోరలేదు. వారు తీసుకుంటామంటే దండం పెట్టి తప్పుకుంటాం.. నిన్నటికి నిన్న అసెంబ్లీలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. కేంద్రంపై ఎంతో ఆక్రోశంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పోలవరం పూర్తి చేయాలని తాను భగీరథ ప్రయత్నం చేస్తున్నా కేంద్రం నుంచి సహకారం అందండం లేదని వాపోయారు బాబు. టీడీపీ భాషలో చెప్పాలంటే తెలుగు తమ్ముళ్లకు చిన్న హింట్‌ ఇచ్చి వదిలినట్టు. ముందుగా బాబు ఒక రాయేస్తారు.. ఇక భజన బృందాలు రెచ్చిపోవాలి. అనుకున్నట్టుగానే సోమిరెడ్డి వంటి వారు కేంద్రాన్ని నరేంద్రమోడీని, బీజేపీ ప్రభుత్వాన్ని ఆడిపోసుకున్నారు.

అదంతా నిన్నటి కథ.. కట్‌ చేస్తే

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రతి వారం స్టేటస్‌ రిపోర్టు తయారు చేసి కేంద్రానికి నివేదిక అందజేస్తున్నాం. ప్రాజెక్టును పూర్తి చేయడంపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి గడ్కరీలను కలిసి మాట్లాడతా. పార్టీ నాయకులెవరూ సంయమనం కోల్పోవద్దు. ప్రాజెక్టు పూర్తి చేయడమే ధ్యేయం. ఈ రోజు చంద్రబాబు మాట్లాడిన తీరు.. 

షరా మామూలుగానే నిన్న బీజేపీపై అసహనం వ్యక్తం చేశాడు.. ఆ వెంటనే భజన బృందాలొచ్చి బీజేపీని, మోడీని తిట్టిపోశాయి. ఈ రోజు చంద్రబాబు మళ్లీ వచ్చి మాట్లాడుకుని పరిష్కిరంచుకుంటామని చల్లగా సెలవిచ్చేశారు. అందరికీ తెలిసిన వ్యవహారమే. ఈరోజు చంద్రబాబు కొత్తగా చేస్తున్న రాజకీయం ఏమీ  కాదు. ఒక పద్ధతి ప్రకారం పోలవరం నెపాన్ని బీజేపీ మీదకు నెట్టేసి తప్పించుకునే కుట్రలో భాగం. చంద్రబాబు రాజకీయాల్లో ఎప్పుడూ అనుసరించే ధోరణే ఇది. 

ఇదంతా దేనికంటే.. 

ఊరికే రారు మహానుభావులు అనేది సామెత.. లాభం లేకుండా ఏ పనీ చేయని చంద్రబాబు తాజాగా పోలవరం వ్యవహారాన్ని రచ్చ చేయడానికి కూడా వేరే కారణం కూడా లేకపోలేదు. గత 11 రోజులుగా ఏకపక్షంగా జరుగుతున్న అసెంబ్లీలో మొత్తం 22 చట్టాలకు సవరణలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన 2013 భూ సేకరణ చట్టానికి కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా మార్పులు చేపట్టారు. అయితే దీనిపైన ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఇష్యూని పక్కదారి పట్టించే పనిలో భాగంగానే చంద్రబాబు ఈ వ్యవహారానికి తెరలేపారని విశ్లేషకుల అభిప్రాయం. 

మూడేళ్లలో సాధించారు.
.
విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రప్రభుత్వమే పూర్తి చేయాలి. ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులన్నీ కేంద్రమే భరించాలి. అయితే చంద్రబాబు మాత్రం డబ్బులిస్తే ప్రాజెక్టును తామే పూర్తి చేసుకుంటామని నమ్మబలికి ఏపీకి తెచ్చుకున్నారు. ఇదంతా జరిగి ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టును పట్టిసీమ, పురుషోత్తంపట్నం అని విడగొట్టి ఏదో అద్భుతం చేసేసినట్టు నాలుగు సార్లు పూజలు చేసేశారు. 16 వేల కోట్లతో మొదలైన ప్రాజెక్టు అంచనాలను మూడేళ్లలో 60 వేల కోట్లకు పెంచేశారు. ఎలాంటి సత్తా లేని ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీకి పోలవరం పనులు అప్పగించారు. అసమర్థ కంపెనీకు ప్రాజెక్టును అప్పగించడంపై ప్రతిపక్ష వైయస్‌ఆర్‌సీపీ ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రాజెక్టు నాణ్యత, సకాలంలో పూర్తి కావడంపైనా అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే బాబు పట్టించుకోలేదు. తీరా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో చంద్రబాబు కళ్లు తెరిచారు. దాంతోపాటు కేంద్రం కూడా పోలవరం పనులపై రివ్యూలు అడగడంతో చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. పట్టిసీమలో జరిగిన అవకతవకలపై కాగ్‌ చంద్రబాబు సర్కారును కడిగి పారేసింది. వెరసి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడంపై జనాలకు కూడా అనుమానాలు తలెత్తాయి. ఇప్పటికే చంద్రబాబు దాదాపు 18 సార్లు ప్రాజెక్టును స్వయంగా వెళ్లి పరిశీలించారు. గతంలో చెప్పినట్టుగా 2018 నాటికి కాదు కదా 2019 ఎన్నికల నాటికి కూడా ప్రాజెక్టు పూర్తి కాదనే అంచనాకు వచ్చేశాడు చంద్రబాబు. దీంతో ప్రతిపక్షం చేసే విమర్శల నుంచి బయట పడేందుకు చంద్రబాబు ఆడుతున్న కొత్త నాటకానికి రిహార్సల్సే నిన్న అసెంబ్లీలో జరిగిన తతంగమంతా. 

కాంట్రాక్టర్‌ను మార్చవద్దన్నందుకే...

ట్రాన్స్‌ట్రాయ్‌ కాంట్రాక్టును రద్దు చేసి మరో కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టేందుకు చంద్రబాబు సమాయత్తమయ్యారు. కాంట్రాక్టర్‌ను మార్చడం ద్వారా అంచనా వ్యయాన్ని పెంచడమే ధ్యేయంగా చంద్రబాబు పావులు కదిపారు. అయితే దీనికి కేంద్రం ససేమిరా అంది. ఇష్టానుసారం టెండర్లు పిలవడం అంచనా వ్యయం పెంచడంపై అభ్యంతరం తెలిపింది. ఇదే చంద్రబాబుకు నచ్చలేదు. తను అనుకున్నట్టు అంచనాలు పెంచి కమీషన్లు పెంచుకోవడం బాబుకు కుదర్లేదు. తన పంతం నెగ్గించుకుని తనకు నచ్చిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడమే ప్రస్తుతానికి బాబు ముందున్న లక్ష్యం. ఇదంతా కాంట్రాక్టు కోసం ఆడుతున్న డ్రామానే. ఈరోజు హఠాత్తుగా మంత్రివర్గ సమావేశం కానుందని వస్తున్న వార్తలను బట్టి చూస్తే పోలవరం అంశాన్ని పక్కదారి పట్టించి కాపుల రిజర్వేషన్లు వంటి మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. 
Back to Top