తూర్పు హామీలకు చంద్రబాబు తూట్లు

తూర్పు గోదావరి జిల్లా...స్వచ్ఛమైన మనుషులు, ప్రేమను పంచే మనసులు, కోనసీమ అందాలు కలగలిసిన ప్రాంతం. నమ్మిన వారికి బ్రహ్మరథం పట్టే అలవాటు ఈ ప్రాంత వాసులది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుండెల నిండుగా పెట్టుకున్నారు తూర్పు గోదావరి వాసులు. ఆయన మరణం తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. చంద్రబాబు వస్తున్నా మీకోసం అంటూ వచ్చి ఈ జిల్లాకు హామీల వరదను పారించాడు. పోలవరం కట్టేస్తానన్నాడు. రైతు రుణాలు బేషరతుగా మాఫీ అన్నాడు. కాపులకు రిజర్వేషన్ల ఎర వేసాడు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేరుస్తా అన్నాడు. వీటిలో ఏ ఒక్కటీ చంద్రబాబు నెరవేర్చింది లేదు. తమకిచ్చిన హామీలను నెరవేర్చమని అడిగిన వారిని అధికారంతో అణగదొక్కడమే ఈ నాల్గేళ్లలో బాబు చేసిన పని. 

హామీల హోరు

తూర్పు గోదావరి జిల్లాకు చంద్రబాబు హామీల మీద హామీలు గుప్పించారు. పెట్రోలియం యూనివర్సిటీ అన్నాడు. పోర్టు అన్నాడు. ఎలక్ట్రానిక్స్ మరియు హార్డ్వేర్ పార్క్ అన్నాడు. విశాఖ చెన్నై  (విసిఐసి) కారిడార్ కాకినాడలో ఏర్పాటు చేస్తానన్నాడు. పెట్రోలియం కారిడార్ అన్నాడు. తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నాడు. కోనసీమకోసం కొబ్బరి పీచు ఆధారిత పారిశ్రామిక కాంప్లెక్స్ నిర్మిస్తామన్నాడు. స్మార్ట్ సిటీలుగా కాకినాడ, రాజమండ్రిని తయారు చేస్తానన్నాడు. ఫుడ్ పార్క్ ఏర్పాటుచేస్తానన్నాడు. జల మార్గాల ద్వారా టూరిజం అభవృద్ధి అన్నాడు. కాకినాడకు ఎల్.ఎన్.జి టెర్నినల్ అన్నాడు. తుని ప్రతిపాదిత నౌకా నిర్మాణ కేంద్రం అన్నాడు. అక్వా కల్చర్ ఇంకా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు అన్నాడు. రాజమండ్రిని ఐటి హబ్ గా మారుస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో జిల్లాల వారీ అభివృద్ధి కార్యక్రమాలంటూ లిస్టు చదివిన చంద్రబాబు తర్వాత వాటి ఊసెత్తనే లేదు. 

కొరగాని పనులు

ఈ నాలుగేళ్లలో తూర్పుగోదావరి జిల్లావాసులకు చంద్రబాబు చేసినది శూన్యం అనే చెప్పాలి. దోమలపై దండయాత్ర, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, నీరు చెట్టు అంటూ ప్రకటనలు, హడావిడీ తప్ప వాటిలోనూ చిత్తశుద్ధిని చూపింది లేదు. జిల్లాలో రెండు స్మార్ట్ సిటీలు అని చెప్పిన బాబు ఆ నగరాలకు మౌలిక వసతులను కూడా కల్పించలేకపోయాడు. తాగునీటి కోసం ఈ నగరవాసులు అల్లాడుతున్నారు. అధ్వాన్నంగా డ్రైనేజీ వ్యవస్థ ఉంది. 

స్మార్ట్ నగరాల దుస్థితి

స్మార్ట్ నగరాల పేరు తప్ప ఈ నగరాలకు చంద్రబాబు ఒరగబెట్టిందేముందని ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు తూర్పు గోదావరి వాసులు. తూర్పు గోదావరి జిల్లా ప్రధానకేంద్రం కాకినాడ పరిస్థితి మరీ అధ్వాన్నం. స్మార్ట్ సిటీ కోసం ఇచ్చిన 200 కోట్లను ప్రధాన కూడళ్ల దగ్గర రోడ్లు వెడల్పు చేసి, లైట్లతో అలంకరించడానికి మాత్రమే ఖర్చు చేసారు. నాయకులు వచ్చినప్పుడుండే ప్రధాన రహదారులన్నీ ధగధగాయమానంగా వెలుగుతాయి. కానీ మిగిలిన ప్రాంతాలన్నీ చీకటిలో, మురుగులో కొట్టుమిట్టాడుతున్నాయి. పరిశ్రమలకోసమంటూ 10,600 ఎకరాలు సేకరించినా నేటికీ ఒక్క పరిశ్రమను కూడా పెట్టింది లేదు. ఏరువాక పేరుతో సెజ్ గ్రామాల్లో పర్యటించి రైతుల భూములు వెనక్కిస్తామన్న చంద్రబాబు తర్వాత యాజమాన్యలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. కాకినాడ సముద్రతీర ప్రాంతం పూర్తిగా కాలుష్యమయం అయిపోయింది. చంద్రబాబు సర్కార్ జన చైతన్య యాత్రల్లో తమ సమస్యలను శాంతియుతంగా చెప్పుకోవచ్చిన ప్రజలను పోలీసులతో బలవంతంగా గెంటించిన ఉదంతాలు అనేకం. 

మరో స్మార్ట్ సిటీ రాజమహేంద్రిది కూడా అదే పరిస్థితి. పేరుకు రెండు రైల్వేస్టేషన్లు ఉన్నా వాటి అభివృద్ధిని పట్టించుకున్నపాపాన పోలేదు పాలకులు. ఇక గోదావరి పుష్కరాలప్పుడు జరిగిన పనుల్లో అవకతవకల గురించి నేటికీ అక్కడ చర్చించుకుంటూనే ఉన్నారు. ఆ సందర్భంలో జరిగిన విషాదఘటనను కూడా మరిచిపోలేదు రాజమహేంద్రవరం ప్రజలు. కేవంల చంద్రబాబు ప్రచార ఆకాంక్షే అంతమందిని బలిగొందన్నది కాదనలేని వాస్తవం. గోదావరి చెంతే ఉండి కూడా తాగునీటి కష్టాలు అనుభవించాల్సి వస్తోంది. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసింది లేదు. లక్షకుపైగా ఇళ్లున్న నగరంలో 18వేల కుళాయిలు మాత్రమే ఉన్నాయి. ట్రాఫిక్, వీధిదీపాలు వంటి సమస్యలు కూడా ఈ స్మార్ట్ సిటీ ప్రత్యేకతలే. కడియం, కోనసీమ గొప్ప ఎగుమతులతో ఆర్థిక వనరులుగా ఉన్నా ఆ ప్రాంతాలను పట్టించుకోలేదు. 
నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో తూర్పుగోదావరి జిల్లా వీసమెత్తు అభివృద్ధికి నోచుకోలేదు. అటు సామాజిక వర్గాలు, ఇటు ప్రాంతాలు బాబు హామీలను నమ్మి మునిగినవే. 
 
Back to Top