బాబు విదేశీ విన్యాసాలు

బాబు విదేశీ విన్యాసాలు

చెప్పిన అబద్ధాలే చెప్పడానికి చంద్రబాబుకు సిగ్గు వేయదు. ఒక్క అబద్ధాన్ని వెయ్యిసార్లు చెప్పడానికైనా వెనుకాడడు. వినడానికి జనం వెర్రివాళ్లనుకుంటున్నాడు బాబు. కొరియాలో దిగిన దగ్గర నుంచి యథాప్రకారం తన అబద్ధాలను అలా వెదజల్లడం మొదలెట్టేశాడు. వేలకోట్ల పెట్టుబడులు, లెటర్ ఆఫ్ ఇంటెంట్ లు తీసుకున్నారంటూ కహానీలు మొదలు పెట్టాడు. చంద్రబాబు పెట్టుబడుల పేదరాశి పెద్దమ్మ కథ ఈ నాటిది కాదు. మునుపటి 9ఏళ్ల పాలనలోనూ, గత నాలుగేళ్లుగానూ చంద్రబాబు చేస్తున్నపని ఒక్కటే. టూర్లపేరుతో దేశాలు చుట్టేయడం, నోటికొచ్చిన నెంబర్ తో కోట్లు వస్తున్నాయంటూ గాలి కబుర్లు ప్రచారం చేసుకోవడం. దేశంలో ఏ సిఎమ్ కూడా ఇన్నిసార్లు విదేశీ టూర్లు, ఆ ప్రయాణాలకోసం ఇన్ని కోట్ల ఖర్చులూ పెట్టలేదు. పెట్టుబడుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విదేశీటూర్లు చేయడంలో దేశం మొత్తం మీద చంద్రబాబే నెంబర్ వన్. తీరా ఇంత హడావిడి చేసి చంద్రబాబు రాష్ట్రానికి తెచ్చిన కంపెనీలు ఏమన్నా ఉన్నాయా అంటే ఒక్కటీ లేదు. రూపాయి పెట్టుబడీ రాలేదు, ఒక్క ఉద్యోగమూ రాలేదు. ఇప్పుడు ఆ వరసలో దక్షిణ కొరియాకు వెళ్లాడు చంద్రబాబు. కొరియన్ పారిశ్రామిక వేత్తలతో ఫొటోలు దిగి,3000కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయని కబురు పంపిచాడు. 
దీనికితోడు భజంత్రీ బాచ్ ఉండనే ఉంది. వేల కోట్ల ఒప్పందాలు, చంద్రబాబును చూసి కంపెనీలు క్యూలు అంటూ సన్నాయి బ్యాండ్ మేళం వాయించేస్తాయి. ఇక వెళ్లిన చోటల్లా బాబును ఏదో ఒక విషయం ఆకర్షిస్తుంది. ఇమ్మిడియట్ గా దాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలనుకున్నట్టు ప్రకటించేస్తారు సిఎమ్ గారు. విదేశాలకు వెళ్లినప్పుడల్లా చంద్రబాబును తుగ్లక్ గానీ ఆవహిస్తాడేమో అనుకుంటున్నారు జనాలు. ఇక కొరియాలో అయితే కియా ఎలక్ట్రిక్ కార్లను చూసి చిందులేసిన బాబు, అమరావతిలో వందశాతం ఎలక్ట్రిక్ కారులను నడపాలని నిర్ణయింయించుకున్నట్టు చెప్పారు. ఎలాగూ ఏమీ చేసే పనులు కాదు గనక ఏం చెప్పినా ఫర్లేదు అన్నట్టుంది బాబు పద్ధతి. ఇప్పటిదాకా బాబు ఎన్ని విదేశీ ప్రయాణాలు చేసాడో, ఎన్ని కోట్లు ఒప్పందాలని ఒట్టి కబుర్లు చెప్పాడో...ఎన్ని వింతలను అమరావతికి తెస్తానన్నాడో చూద్దాం. 
కొరియన్ కంపెనీలతో 3000 వేల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు అని చెప్పాడు. కొరియన్ కంపెనీ కియా ఎలక్ట్రిక్ కారులు చూసి అమరావతి అంతా ఎలక్ట్రిక్ వాహనాలే నడపాలని నిర్ణయించుకుని, కిలోమీటరుకు ఎంత ఖర్చౌతుందో తెలుసుకుని ఆ పని మీదుండండని అధికారులను ఆదేశించాడు. అనంతపురంలో కొరియన్ సిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపాడు.
మొన్న అక్టోబర్ లో తొమ్మిది రోజుల పాటు మూడు దేశాల్లో పర్యటనలు చేసొచ్చాడు బాబు. దుబాయి, ఇంగ్లండ్, అమెరికాల్లో తిరిగారు. దుబాయి లో బుర్జ్ ఖలీఫా ను చూసి కృష్ణా వొడ్డున ఇలాంటిదే ఒకటి కట్టేద్దాం అన్నారు. అక్కడ నుంచి అమెరికా వెళ్లి అక్కడ యాపిల్ కంపెనీ సి.ఇ.ఓను కలిసారు. ఆపిల్ తయారీ యూనిట్, బెల్ హెలికాఫ్టర్ తయారీ యూనిట్ ఎపికి వస్తున్నాయని, 28 ఐటి కంపెనీలు రావడానికి ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.
చంద్రబాబు రష్యా పర్యటనలో మెరైన్ యూనివర్సిటీని ఎపికి తెస్తున్నట్టు ప్రకటించారు. కజికిస్థాన్ ను చూసి అమరావతిని అలా కడతానని ఉవ్విళ్లూరారు. 
2016 చైనా పర్యటనలో ఒకసారి 53వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయన్నారు. దోన కొండలో అంతర్జాతీయ పారిశ్రామిక పార్కు అన్నారు. అంతకు ముందు 2015 పర్యటనలో కాకినాడ సెజ్ ఒప్పందం, సోలార్ మాడ్యూల్ ఉత్పత్తుల ఒప్పందాలు జరిగాయని ప్రకటించారు.
2014, 2015లో రెండుసార్లు బాబుగారు జపాన్ పర్యటన చేసారు. జపాన్ భాషను మా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెడతామని అక్కడ ఒట్టేసి వచ్చారు. పనిలో పనిగా అమరావతిని టోక్యోగా చేస్తానని కూడా ప్రకటించేశాడు. 
ఇంగ్లాండ్ కు వెళ్లొచ్చిన బాబు లండన్ బాబులు ఎపిలో పెట్టెలు పట్టుకుని దిగుతున్నారని చెప్పారు. లండన్ ఐని తెచ్చి కృష్ణా నదిలో కడదామని డిసైడయ్యారు. 
ఇక సింగపూర్ పై బాబుకు మక్కువ ఎక్కువ. ఏకంగా నాలుగు సార్లు సింగపూరు ట్రిప్పులు వేశాడు. అయితే అందులో మూడుసార్లు ప్రపంచ ఆర్థిక సదస్సుకే వెళ్లాడు. టికెట్టు కొనుక్కుని వెళ్లాడు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రతిసారీ ఓ కొత్త కంపెనీ కథ చెప్పుకొచ్చాడు. వాల్ మార్ట్, కోనసీమకు పెప్సీ కో, విప్రో సాయంతో విశాఖ డిజిటల్ నగరం, 2వేల కోట్లతో మెగా టెక్స్ టైల్ పార్కు, బంగారం రీఫైనరీ అంటూ అబ్బో ఇంకా చాలానే చెప్పారు. ఇక రీసెంట్ గా 2017లో జరిగిన దావోస్ సదస్సులో ఎపికి చమురు కర్మాగారం వస్తోందనీ చెప్పారు. 

పైన చెప్పిన చాంతాడు లిస్టులో కనీసం ఒక్కటంటే ఒక్క ఒప్పందం కూడా కార్యరూపం దాల్చలేదు. కుప్పలు తెప్పలుగా చంద్రబాబు చెప్పిన కంపెనీలకు మెయిళ్లు పంపిన అధికారులకు రిప్లైలు కూడా రాలేదు. ఒకటి అరా వచ్చినా పరిశీలిస్తున్నాం అనే సమాధానం తప్ప మరో అడుగు కూడా ముందుకు పడలేదు. ఇదీ చంద్రబాబు విదేశీ విన్యాసం.  

తాజా వీడియోలు

Back to Top