బాబు దీక్ష దేనికో?


- ప్ర‌త్యేక హోదాను తాక‌ట్టు పెట్టినందుకా?
 -ప్యాకేజీని స్వాగ‌తించినందుకా?
- ఎన్నిక‌ల హామీలు అమ‌లు చేయ‌నందుకా?
- అవినీతి సొమ్ముతో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసినందుకా?
అమ‌రావ‌తి: న‌ల‌భై ఏళ్ల పాటు రాజ‌కీయాల్లో ఉన్న చంద్ర‌బాబు త‌న అనుభ‌వాన్ని రంగ‌రించి ప్ర‌జ‌ల‌ను ఎలా మోసం చేయాల‌నే ఆలోచ‌న చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఏదీ గుర్తుండద‌న్న భ్ర‌మ‌లో బాబు ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. త‌న‌కు అనుభ‌వం ఉంద‌ని, త‌న‌ది మోడీది అభివృద్ధి  జోడీ  అంటూ ప్ర‌చారం చేసి ప్ర‌జ‌ల ఓట్లు కొల్ల‌గొట్టిన చంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమ‌లు చేయ‌లేదు. నాలుగేళ్ల పాల‌న‌లో 30 సార్లు విదేశీ యాత్ర‌లు చేసి ప్ర‌జాధ‌నాన్ని కొల్ల‌గొట్టారు. రాష్ట్రంలో సంపాదించిన అవినీతి సొమ్మును ఎక్క‌డ పెడుతున్నారో?. ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలా రాజ‌ధాని నిర్మిస్తామ‌ని గొప్ప‌లు చెబుతూ కాలం ఎల్ల‌దీశారు. అమ‌రావ‌తిలో ప‌ర్మినెంట్ పేరుతో ఒక్క ఇటుక కూడా వేయ‌లేదు. 

చంద్రబాబుకు చాలా అనుభవం ఉండవచ్చు కానీ, దాన్ని ఏ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారన్నదే ప్రశ్న! ప్రత్యేకహోదా వదులుకోవడంలోనా? కేంద్ర నిధుల్ని సాధించలేక పోవడంలోనా? ఫిరాయింపుల్లో ఆరితేరిపోవడంలోనా?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయ ధోరణి రోజు రోజుకు వికృతరూపం దాలుస్తున్నది. అందుకు జన్మభూమి కార్యక్రమాల నిర్వహణ తీరుతెన్నులే అతిపెద్ద ఉదాహరణ. ప్రభుత్వం ప్రజాధనాన్ని వెచ్చించి నిర్వహించే జన్మభూమి కార్యక్రమాల్ని పూర్తిగా పార్టీ కార్యక్రమంగా ఉపయోగించుకోవడం అందరికీ కన్పిస్తూనే ఉంది. రాజ్యాంగ పరంగా గ్రామీణ ప్రాంతంలో అయితే సర్పంచ్, పట్టణ ప్రాంతంలోనైతే కార్పొరేటర్‌ అధ్యక్షత వహించాల్సిన ‘జన్మభూమి’ కార్యక్రమంలో వారెక్కడా కన్పించడం లేదు. జన్మభూమి సభా వేదికల‌పై బాబు రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది?  

బాబు మాట్లాడుతున్న ప్రతిమాట, వేస్తున్న ప్రతి అడుగు రాజ్యాంగ విరుద్ధంగా సాగిపోవడాన్ని ఎవరైనా ఎలా సహించగలరు? వ్యక్తిగత స్వార్థంతో పనిగట్టుకొని పాలనా వ్యవస్థల్ని పతనావస్థకు చేరుస్తుంటే ఏవిధంగా ఉపేక్షించగలం? గత నాలుగేళ్లుగా ప‌చ్చ పార్టీ నేత‌లు విచ్చ‌ల‌విడిగా అవినీతికి పాల్ప‌డుతున్నారు. ఆ అవినీతి సొమ్ముతో వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల‌ను, ముగ్గురు ఎంపీల‌ను కొనుగోలు చేశారు. వారిపై అన‌ర్హ‌త వేటు ప‌డ‌కుండా చంద్ర‌బాబు ద‌గ్గ‌రుండి కాపాడుతున్నారు.   

రాష్ట్రంలో 12%గా ఉన్న ముస్లిం మైనార్టీలకు మంత్రివర్గంలో ఎందుకు స్థానం కల్పించలేదు? ఎస్టీలకు మంత్రి ఉండాల్సిన అవసరం లేదా? ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్ని గంపగుత్తగా ఒకటో, రెండో కులాలకు పందేరం చేయకుండా అందరికీ సముచిత భాగస్వామ్యం కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? కాపులకు 5% రిజర్వేషన్లు అందించే అంశంలో జస్టిస్‌ మంజునాథ నేతృత్వంలోని బీసీ కమిషన్‌ నివేదిక అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించక ముందే.. కమిషన్‌లో మెంబర్‌ సెక్రటరీగా ఉన్న ఓ వ్యక్తి ద్వారా దొడ్డిదారిన నివేదికను తెప్పించుకొని.. దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన తీరు బాబు రాజకీయ ఎత్తుగడగానే కనిపించింది తప్ప కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి గోచరించలేదు. పైగా, అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం కేంద్రానికి ఇప్పటివరకూ అందకపోవడంలో ఆంతర్యం ఏమిటి? 

‘పోలవరం’ ప్రాజెక్టును తలకెత్తుకోవడంలో కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యం కంటే, వేలకోట్ల ముడుపులు దండుకోవడానికి ప్రాజెక్టును తానే పూర్తి చేశానని చెప్పుకోవాలన్న బాబు దుర్భుద్ధి కారణంగానే.. నేడు ‘పోలవరం’ వివాదాస్పదంగా మారింది. అయితే.. పోలవరం అంశంలో.. కేంద్ర ప్రభుత్వం.. బాబు రాజకీయ ఉచ్చులో ఇరుక్కోవడానికి సిద్ధంగా లేకపోవడంతోనే.. ‘డామిట్‌ కథ అడ్డం తిరిగింది’ అన్నట్టుగా తీగతోపాటు డొంకంతా బయటకు వస్తోంది. ప్రభుత్వంలో పెద్దఎత్తున జరుగుతున్న అవినీతిపై కేంద్రానికి స్పష్టమైన సమాచారం అందినందునే.. పోలవరంతో సహా అనేక పథకాలకు కేంద్రం నిధుల మంజూరును నిలిపివేసింది. 

రాష్ట్ర ప్రభుత్వం తన వైపునుంచి ఇవ్వాల్సిన యుటిలిటీ సర్టిఫికెట్లు (యుసిలు) అందించకపోవడం, ప్రభుత్వపరంగా చొరవ లోపించడంతో.. పోలవరంతోపాటు అనేక పథకాలకు కేంద్ర నిధులు తగ్గిపోయాయి. మొత్తం 45 కేంద్ర పథకాల్లో 42 పథకాలకు కనిష్టస్థాయి నిధులు కూడా రాబట్టుకోలేకపోవడం బాబు పరిపాలనా వైఫల్యానికి తార్కాణం. రాష్ట్రంలో గాడితప్పిన పరిపాలనకు బాధ్యత వహించాల్సిన బాబు తన వైఫల్యాలను అధికార యంత్రాంగంపై, కొంతమంది ఐఏఎస్‌ అధికారులపై నెట్టివేసే ప్రయత్నాన్ని ఎంతో తెలివిగా చేస్తున్నారు. తానొక్కడే కష్టపడుతుంటే.. అధికార యంత్రాంగం సహకరించడం లేదని ప్రజలకు పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. నిజానికి, రాష్ట్రాభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడాలని అధికారయంత్రాంగం ప్రయత్నిస్తుంటే గండి కొడుతున్నదే బాబు. 

- రుణమాఫీ హామీ కొండెక్కింది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి మరీ మిమ్మల్ని రుణవిముక్తుల్ని చేస్తామ‌ని ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన‌ హామీ విషయంలో తెలుగుదేశం తత్తరపాటు మొదలైంది. అర్హుల జాబితా.. ఐదు విడతల్లో మాఫీ, బాండ్లను ఇస్తాం.. వంటి మాటలతో రుణమాఫీని పూర్తిగా అంటే పూర్తిగా నీరుగార్చారు. రుణమాఫీని చేశామని తెలుగుదేశం ప్రభుత్వం ఒకటికి లక్షసార్లు చెప్పుకోవచ్చు గాక.. వాస్తవం ఏమిటో రైతులకు తెలుసు. ఇక డ్వాక్రా రుణమాఫీ సంగతి సరేసరి. మాఫీపై ఆశలతో ఎంతో మంది మహిళలు ఓటు వేయగా.. డ్వాక్రా రుణమాఫీని ప్రహసనంగా మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. పాపం బాబును న‌మ్ముకున్న పాపానికి బ్యాంకు నోటీసులు అందుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. 

  ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌త్యేక హోదా సంజీవ‌ని అన్న చంద్ర‌బాబు ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపుల‌తో స‌హా దొరికిపోవ‌డంతో ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తికి ప‌రుగులు తీశారు. ప్ర‌త్యేక హోదాకు సంబంధించిన ఫైల్ ప్లానింగ్ క‌మిష‌న్‌లో ఉన్నా ఏ నాడు చంద్ర‌బాబు లేఖ రాయ‌లేదు.అంతేకాదు కేంద్రం ప్ర‌త్యేక హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామంటే అర్ధ‌రాత్రి అరుణ్‌జైట్లీ ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తించిన చంద్ర‌బాబు కేంద్రాన్ని పొగ‌డ్త‌ల‌తో ముంచారు. హోదా ఉద్య‌మాన్ని వైయ‌స్ జ‌గ‌న్ తీవ్ర త‌రం చేయ‌డంతో ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్నాయ‌ని చంద్ర‌బాబు యూట‌ర్న్ తీసుకున్నారు. అయితే ఆయ‌నలో చిత్త‌శుద్ధి క‌నిపించ‌డం లేదు. వైయ‌స్ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానం అంటే ఏం ప్ర‌యోజ‌న‌మ‌న్న చంద్ర‌బాబు మ‌రుస‌టి రోజే కేంద్రంపై అవిశ్వాస తీర్మాన‌మ‌న్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసి ఢిల్లీలో ఆమ‌ర‌ణ దీక్ష చేస్తే హేళ‌న చేసిన చంద్ర‌బాబు త‌న పుట్టిన రోజు అయిన ఏప్రిల్ 20న ధ‌ర్మ పోరాటం పేరుతో దాదాపు రూ.20 కోట్ల ప్ర‌జాధ‌నం వెచ్చింది దీక్ష చేప‌ట్ట‌డం దేనికోస‌మో ప్ర‌జ‌లకు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా త‌న డ్రామాలు క‌ట్టి పెట్టి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం చిత్త‌శుద్ధితో ప‌ని చేయాలి. లేదంటే రాష్ట్రాన్ని విభ‌జించిన కాంగ్రెస్ పార్టీకి ప‌ట్టిన గ‌తే టీడీపీకి ప‌డుతుంది. 

తాజా వీడియోలు

Back to Top