బాబు అప్పులు..ప్ర‌జ‌ల‌కు తిప్ప‌లు

హైద‌రాబాద్‌) ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న సోకులు, విలాసాల కోసం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప గా మారుస్తున్నారు. ఇందుకోసం నిబంధ‌న‌ల‌కు పాత‌ర వేస్తున్నారు. వాస్త‌వానికి ద్ర‌వ్య జవాబుదారీ బ‌డ్జెట్ నిర్వ‌హ‌ణ (ఎఫ్ఆర్‌బీఎం) చ‌ట్టం నిబంధ‌న‌ల మేర‌కు రాష్ట్ర స్థూల ఉత్ప‌త్తిలో ద్ర‌వ్యలోటు మూడు శాతానికి మించ‌కూడ‌దు. అయితే మార్చితో ముగిసిన 2015-16 ఆర్థిక సంవ‌త్స‌రంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఎఫ్ఆర్‌బీఎం నిబంధ‌న‌ల‌కు మించి అప్పులు చేసింది. దీంతో ద్ర‌వ్య‌లోటు 3.74 శాతానికి చేరింది. నిబంధ‌న‌ల‌కు మించి చేసిన అప్పులకు కేంద్రం నుంచి ఆమోదం పొందాల్సి ఉంది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో నిబంధ‌ల‌న‌కు మించి అప్పు చేసినందున ఆ మేర‌కు ప్ర‌స్తుత 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రం అప్పుల్లో కేంద్రం కోత విధించ‌నుంది.
స‌ర్దుబాటు లెక్క‌ల‌కే
 మ‌రోవైపు గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం బ‌డ్జెట్ అమ‌లు ఘ‌నంగా ఉంద‌ని ప్ర‌భుత్వం చెబుతుండ‌గా వాస్త‌వ పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ప్ర‌ణాళికేత‌ర వ్య‌యాన్ని బ‌డ్జెట్ కేటాయింపుల‌కు మించి వ్య‌యం చేశామ‌ని చెబుతున్న‌ప్ప‌టికి... మార్చి నెల‌లో బ‌డ్జెట్ రిలీజ్ అర్డ‌ర్స్ ఇచ్చారే త‌ప్ప నిధులు విడుద‌ల చేయ‌లేదు. అలా చూపిన వ్య‌యం రూ. 6వేల కోట్లు కేవ‌లం పుస్త‌కాల్లో స‌ర్దుబాటు లెక్క‌ల‌కే ప‌రిమిత‌మైంది. 
 పుస్త‌కాల వ‌ర‌కు మాత్ర‌మే....!
2015-16 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 1,13,048 కోట్ల వ్య‌యం చేయ‌నున్న‌ట్లు బ‌డ్జెట్‌లో పేర్కొన్నారు. అయితే రూ. 1,17,439 కోట్ల వ్య‌యం చేసిన‌ట్లు ఆర్థిక శాఖ పేర్కొంటోంది. ఇందులోనూ బ‌డ్జెట్ పేర్కొన్న దానిక‌న్నా ప్ర‌ణాళిక వ్య‌యం ఎక్కువ‌గా చేశామ‌ని, ఇది రికార్డు అని స‌ర్కారు పేర్కొంటోంది. బ‌డ్జెట్ క‌న్నా ఎక్కువ చేశామ‌న‌డం కేవ‌లం పుస్త‌కాల స‌ర్దుబాటుకే ప‌రిమిత‌మైంది. మార్చి చివ‌ర్లో కేంద్రం రాజ‌ధాని నిర్మాణానికి ఇచ్చిన నిధుల‌కు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ఇచ్చిన నిధుల‌కు ప్ర‌భుత్వం జీవోలు జారీ చేయ‌డం, ఉద్యాన‌వ‌న రైతుల రుణ‌మాఫీ పేరుతో జీవో జారీ చేశారే త‌ప్ప నిధులు విడుద‌ల చేయ‌లేదు. ఈ లెక్క‌న రూ.  ఆరు వేల కోట్లు వ్య‌యం చేసిన‌ట్లు పుస్త‌కాల్లో చూపించారే త‌ప్ప వాస్త‌వంగా నిధులివ్వ‌లేదు. 
మొత్తంగా లెక్క‌ల్లో మాయ చేయటం, అవ‌స‌రానికి మించి అప్పులు చేయ‌టం త‌ప్ప అనుభ‌వ‌శాలిని అని చెప్పుకొనే చంద్ర‌బాబు, ఆర్థిక వేత్త‌ను అని చెప్పుకొనే య‌న‌మ‌ల రామ‌క్రిష్ణుడు సాధించిందేమీ లేదు.
Back to Top