ఏపీకి ముఖ్యమంత్రా లేక విదేశాలకా

పాలన గాలికొదిలి విహారయాత్రలు
కరవు, తాగునీటి ఎద్దడితో ప్రజల అవస్థలు
సాయం కోసం ప్రధానిని కలుస్తున్న ముఖ్యమంత్రులు
కానరాని బాబు జాడ..మండిపడుతున్న రాష్ట్ర ప్రజానీకం

రాష్ట్రమంతా సమస్యలతో కొట్టామిట్టాడుతుంటే...ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం విహార యాత్రలకు వెళ్లడం పెద్ద దుమారమే రేగుతోంది. కరవు, తాగునీటి ఎద్దడి సహా అనేక సమస్యలపై ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కానీ అవేమీ పట్టని చంద్రబాబు మళ్లీ విమానాల్లో విదేశాలకు ఎగరడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు అసలు ఏపీకి ముఖ్యమంత్రా లేక విదేశాలకు ముఖ్యమంత్రో అర్థం కావడం లేదని ప్రతి ఒక్కరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

దేశవ్యాప్తంగా నెలకొన్న కరవు పరిస్థితుల దృష్ట్యా ....సహాయక చర్యలపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతున్నారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సహా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ ప్రధానిని ఆర్థికసాయం అర్థిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరువు కరాళనృత్యం చేస్తోంది.  ప్రజలు తాగడానికి గుక్కెడు నీళ్లు లేక అలమటిస్తున్నారు. ఇలాంటి  సమయంలో ఏ ముఖ్యమంత్రైనా  తక్షణమే రంగంలోకి దిగి, అధికారులకు దిశానిర్దేశం చేస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు జాడ లేకుండా పోయారు. ఆయన ఎక్కడకు  పోయారో అర్థం కాక సొంత పార్టీ నేతలే జుట్టుపీక్కుంటున్నారు. 

రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి చంద్రబాబు విదేశీ పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వడంపై ప్రజలు, ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు ఆదివారం రాత్రి  విదేశాలకు పయనమయ్యారు. ఆయన ఎక్కడికి వెళ్లారనేదానిపై టీడీపీ నేతలకే స్పష్టత లేకపోవడం గమనార్హం. తమకున్న సమాచారం ప్రకారం.. సీఎం తొలుత థాయ్‌లాండ్‌కు వెళ్లి, అక్కడి నుంచి స్విట్జర్లాండ్‌కు వెళతారని ఓ నేత చెప్పుకొచ్చారు. ఇక బాబు కన్నా రెండు రోజులు ముందే  ఆయన తనయుడు లోకేశ్ విదేశాలకు వెళ్లారు. తండ్రీకొడుకులిద్దరూ వ్యాపార కార్యకలాపాలను చక్కబెట్టుకోవడానికే విదేశీ పర్యటనలకు వెళ్లారని టీడీపీ నేతల మధ్య చర్చ జరుగుతోంది.

సొంత పార్టీలోని కీలక నేతలకు కూడా తెలియకుండా సీఎం ఎక్కడికి వెళ్లి ఉంటారనే విషయం రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌లో ఇండిపెండెంట్ డెరైక్టర్ అయిన మోటపర్తి శివరామప్రసాద్‌కు అనుమానాస్పద కంపెనీలతో ఉన్న సంబంధాలను పనామా పేపర్స్ బయటపెట్టింది. ఇటీవలే ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ గా బాబు నియమించిన అజయ్ దేవగణ్  పేరు పనామా బయటపెట్టింది. ఈ తరుణంలో చంద్రబాబు విదేశాల్లో పర్యటన కొనసాగిస్తుండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

To read this article in English:  http://bit.ly/1TAWF34

Back to Top