కేంద్రపథకంతో బాబు ప్రచారం

అత్తసొమ్ము అల్లుడుదానం విన్నాం....కేంద్రం స్కీముకు బాబు నామం ఇప్పుడు చూస్తున్నాం. అవునండీ ...తూర్పు గోదావరి జిల్లా ద్వార పూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పంచాయితీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ తో కలిసి 100శాతం ఎల్ఇడి బల్బుల వినియోగ జిల్లాగా తూర్పుగోదావరి జిల్లాను ప్రకటించారు. చంద్రక్రాంతి పథకం కింద ఈ ఎల్.ఇ.డి బల్బుల పథకం అని చెప్పుకొచ్చారు. అసలు కరెంటే లేని ఇంట్లో దీపాన్ని వెలిగించినంత పోజు పెట్టారు చంద్రబాబు. విద్యుత్ వాడకాన్ని తగ్గించేందుకు, పర్యావరణ హితం కోసం ఎల్.ఇ.డి బల్బుల వాడకాన్ని కేంద్రం ప్రభుత్వం ప్రతిపాదించింది. పైగా 350 రూపాయిలున్న బల్బులను అతి తక్కువ ధరకు అంటే 50రూపాయిలకే అందిస్తోంది. 2016లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున నరేంద్రమోదీ ఆరంభించిన ఈ పథకాన్ని చంద్రబాబు తన పేరుతో కాపీ చేసుకుని బడాయి కొట్టేసుకుంటున్నాడు. ఇక ద్వారపూడిలో జరిగిన కార్యక్రమంలో గ్రామ స్వరాజ్యం అంతా చినబాబు పంచాయితీరాజ్ శాఖను చేపట్టినప్పటి నుండే వచ్చేసిందనే బిల్డప్ క్రియేట్ చేయడానికి తెగ ఆరాటపడ్డారు. 

అక్టోబర్ 2 నాటికి 27 లక్షల ఎల్.ఇ.డి వీధిదీపాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు చంద్రబాబు. గత రెండేళ్ల కాలంగా కేంద్రం నుంచి బల్బులు వస్తున్నా 10 జిల్లాలకు కేవలం ఒక్క జిల్లా మాత్రమే పూర్తి ఎల్.ఇ.డిలను వినియోగిస్తోందంటేనే లోకేషం అండర్ లో పంచాయితీ వ్యవస్థ ఎంత కుంటుపడిందో అర్థం అవుతోంది. అంతేకాకుండా 4,500 కోట్లరూపాయిలతో మరుగుదొడ్లు కూడా నిర్మించామని చెప్పుకొచ్చారు. నిజానికి ఇది కూడా కేంద్రం ప్రాయోజిత పథకమే. పన్లోపనిగా పోలవరం, చంద్రన్నభీమా గురించి కూడా బాబుగారు స్వంత డప్పా కొట్టేసుకున్నారు. నగరాల్లో చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 28 వేల కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించినట్టు చంద్రబాబు ప్రకటించారు. పేదల అభ్యున్నతికి పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ఈ వేదికమీద చంద్రబాబు ప్రసంగించారు. 

నిజాలేమిటి?

పేదల కోసం సంక్షేమ పథకాలు అంటున్న చంద్రబాబు ఒక్క పథకాన్ని కూడా నిరుపేదలకు అందనీయడం లేదు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచాడు. గ్రామాల తలరాతలను జన్మభూమి కమిటీల గుప్పెట్లో పెట్టాడు. ఇన్నేళ్లుగా ఒక్క పేదవాడికీ ఇల్లు కట్టిఇచ్చింది లేదు. సాంక్షన్ అయిన వాళ్లని కూడా అన్యాయంగా పేర్లు తొలగించాడు. ఉన్న పింఛన్లు రద్దు చేసాడు. కొత్త పింఛన్లు ఇవ్వకుండా ఏడిపించాడు. రైతు కూలీల హక్కులు కాలరాశాడు. ఇక పోలవరం కోసం ఇచ్చిన నిధులు గోల్ మాల్ చేసి, ఆ ప్రాజెక్టుకు గ్రహణం పట్టించాడు. మధ్యలోనే పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ఎత్తిపోతలతో పోలవరాన్ని నిర్వీర్యం చేశాడు. ఆక్వా సాగును ప్రోత్సహించి,  వ్యవసాయ రంగానికి తీరని ద్రోహం చేస్తున్నాడు. ఆక్వా సాగులో ఉప్పునీటి వల్ల వేలాది ఎకరాల  చేలు బీడువారిపోయాయి. ఆక్వాపార్కును వ్యతిరేకిస్తున్న గ్రామాల గోడును పట్టించుకోకుండా, సుక్షేత్రాలను, నీటి వనరులను సర్వనాశనం చేస్తున్నాడు. మధురపూడి విమానాశ్రయం విస్తరణ అని మాటలే కానీ చేతలు లేవు. కాకినాడ స్మార్ట్ సిటీ అన్నాడు. ఆయిల్ కంపెనీలు సీస్మిక్ సర్వేలతో మత్స్యకారుల కడుపు కొడుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఆయిల్ కంపెనీల డ్రిల్లింగ్ వల్ల మత్స్యకారుల జీవనాధారం నాశనం అయిపోతోంది. ఇక వేట నిషేధం సమయంలో వారికి అందిస్తామన్న పరిహారం, బియ్యం, పప్పు, కిరసనాయిలు వంటివేవీ వారికి అందడం లేదు. సముద్రంలోకి వెళ్లి ప్రభుత్వంపై తమ నిరసన తెలిపిన మత్స్యకారులను అరెస్టులు చేసి, జైలుకు పంపి వారి ఆక్రోశాలను అణగదొక్కుతోంది చంద్రబాబు ప్రభుత్వం. చివరికి వారిని ఎస్టీల్లో చేరుస్తామని ఇచ్చిన హామీని సైతం గంగలో కలిపి, దాని గురించి గుర్తు చేయవచ్చిన ప్రతినిధులను, ఎమ్మెల్యైను సైతం బెదిరించి తూలనాడి పంపిన ఘనత చంద్రబాబుది. దోమలపై దండ యాత్ర అంటూ వచ్చి ప్రజల కళ్లలో దుమ్ము కొట్టి వెళ్లిపోయాడు బాబు. కాపు ఉద్యమాన్ని బలవంతంగా అణిచేసాడు. 

ఇదీ చంద్రబాబు అభివృద్ధి కథ. ఇలా ఒక్క తూర్పు గోదావరి జిల్లా ఏమిటి?? రాష్ట్రంలోని ప్రతి జిల్లాకూ ఓ మాహిష్మతి మహాసామ్రాజ్యం కలను చూపించాడు బాబు. కేంద్రం పథకాలకు తనపేరు తగిలించుకుని, అరకొర పనులనే అద్భుతాలని పొగిడించుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. మూడేళ్లుగా చినబాబు శాఖలో ఎలాంటి ప్రగతీ లేదని చెప్పుకోలేక స్వయంగా తానే వచ్చి ఇలాంటి మెచ్చుకోళ్లు ఇచ్చి, మేకతోలు కప్పి వెళుతున్నాడు. 
 
Back to Top