అక్కడ వారిని తరిమేస్తారా..!

రాజధాని ప్రాంతంలోరైతుల్ని మచ్చిక చేసుకొనేందుకు ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది. బలవంతంగా భూములు లాక్కొంటున్నప్పుడు గ్రామాల జోలికి వెళ్లబోమని, ఊళ్లను అలాగే ఉంచుతామని నాయకులు నమ్మబలికారు. అదంతా గతం.

ఇప్పుడు బలవంతంగా 33 వేల ఎకరాల భూమిని నేరుగా, పరోక్షంగా కలుపుకొంటే దాదాపు 50వేల ఎకరాల దాకా భూమిని అక్కడ నుంచి లాగేశారు. రైతులతో అవసరం తీరిపోయింది కాబట్టి ఇప్పుడు ఊళ్లను ఖాళీచేయించే పనిలో పడ్డారు. శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయుని పాలెం, పక్కనే ఉన్న లింగాయపాలెం, మందడం శివారు తాళ్లాయిపాలెం గ్రామాల్లో రెవిన్యూ అధికారులు పూర్తి వివరాలు సేకరించే పని మొదలెట్టారు. దీంతో పాటు ప్లానింగ్ కు ఇబ్బంది ఉంటూ దొండపాడు గ్రామం మీద కూడా రెవిన్యూ అధికారుల కన్ను పడింది.  

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రాజధానికి సంబంధించి సచివాలయం, అసెంబ్లీ, బిజినెస్ కార్యాలయాలు ఈ మూడు గ్రామాలకు దగ్గరలో వచ్చే అవకాశం ఉంది. అటువంటి చోట సింగపూర్ కంపెనీల లావాదేవీలకు ఈ గ్రామాలు అడ్డుగా కనిపిస్తున్నాయి. అందుచేత ఈ ఊళ్లను అక్కడ నుంచి తన్ని తరిమేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అందుకే రెవిన్యూ అధికారులు గ్రామస్తుల మొత్తం వివరాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయిస్తున్నారు. గ్రామస్తుల ఆస్తిపాస్తులు, సామాజిక నేపథ్యం, పునరావాస సర్దుబాట్లు వంటి వివరాలతో నివేదిక రూపొందించే పనిలో పడ్డారు.

 ఇందుకు తగినట్లుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్నటి విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ.. కొంత మేరకు సర్దుబాట్లు తప్పవంటూ సంకేతాలు పంపించారు. కొన్ని జనావాసాల్ని జరపాల్సి ఉంటుందని చెప్పకనే చెప్పారు. దీన్ని బట్టి తన్ని తరిమేసే పనిని అధికారులకు పురమాయించారన్న సంగతి అర్థం అవుతోంది.


తాజా వీడియోలు

Back to Top