బిసి విద్యార్థులకు బాబు ద్రోహం


కుండను చూపిస్తూ కంచాన్ని బోర్లించచేయడం చంద్రబాబు అలవాటు. ఏదో చేస్తున్నట్టు, చేయబోతున్నట్టు, ఉద్ధరించేస్తున్నట్టు భ్రమలు కల్పించి ఆఖరికి అంతా మాయం చేస్తాడు బాబు. స్టైలుగా పేర్లు పెట్టి, కళ్లకు కనిపించని గంతలు కట్టి సంక్షేమ పథకాలను అటకెక్కించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. బిసి విద్యార్థులకు కూడా అలాంటి చచ్చు తెలివితేటలతోనే అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు. ఇప్పటికే వందలాది బిసి హాస్టళ్లను మూతేయించింది చాలక, ఇప్పుడు మరికొన్నిటిని మూసేసే ప్రణాళికలు వేస్తున్నాడు. 

పేరు మార్చి విద్యార్థులను ఏమార్చి

సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖల్లో అమలు చేసిన విధంగా బిసి సంక్షేమ శాఖలోనూ దశల వారీగా బిసి వసతి గృహాలను గురుకులాలుగా మార్చేందుకు చంద్రబాబు సర్కార్ రంగం సిద్ధం చేసింది. తొలి విడతగా 65 వసతి గృహాల ఏర్పాటు అంటోంది. గురుకులాల ఏర్పాటంటే మంచిదే కదా, పైగా కొత్తగా 65 అంటున్నారు అనుకుంటాం. కానీ అందులో ఉండే మతలబే వేరు. నియోజక వర్గానికి ఒకటి ఉండేలా ఈ కన్వర్టెడ్ రెసిడెన్షియల్స్ ఉండేలా, తక్కువ స్కూళ్లు ఉండే చోట కొన్ని నియోజక వర్గాల్లో మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న వారిని విడదీసి, కొత్తవి అని చెబుతున్న గురుకులాల్లోకి పంపుతారు. ఐదారు హాస్టళ్ల నుంచి 300- 400 మందిని ఇలా కొత్త హాస్టళ్లకు బదిలీ చేస్తారన్నమాట. గతంలో  ప్రభుత్వం 201 హాస్టళ్లను రద్దు చేసింది. ఇప్పుడు ఈ బిసి రెసిడెన్షియల్ హాస్టల్ పేరుతో 350 బిసి హాస్టళ్లను రద్దు చేయబోతున్నారు. మిగిలిన హాస్టళ్లను కూడా వచ్చే విద్యాసంవత్సరంలో మూతేసేందుకు సర్కార్ అన్నీ ప్రణాళికలూ సిద్ధం చేసుకుంది. 

ఇదీ మంజూరు లెక్క

కొత్త గురుకులాలు మంజూరు చేసిన జిల్లాల లెక్క ఇది. వీటిలో బాలికలకు 32, బాలురకు 33 ఉన్నాయి. శ్రీకాకుళంలో 8, విజయనగరంలో 7, విశాఖలో 5, తూర్పుగోదావరి జిల్లాలో 6, పశ్చిమగోదావరి జిల్లాలో 6, కృష్ణాజిల్లాలో 3, గుంటూరులో 6, ప్రకాశంలో 3, నెల్లూరు 5, కడప 3, కర్నూలు 3, అనంతపురం 6, చిత్తూరులో 4 చొప్పున ఈ గురుకులాల ఏర్పాటు జరగనుంది. ఒక్కో హాస్టల్ లో 960 మందికి ప్రవేశం ఉంటుంది. చుట్టుపక్కల సాంఘీక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులను కలెక్ట్ చేసి ఈ రెసిడెన్షియళ్లకు తరలిస్తారు. ఇక ఈ కొత్త హాస్టళ్లకు కొత్త భవనాలు ఉంటాయని గ్యారెంటీ లేదు. ఇప్పటిదాకా ఉన్న అవే పాత బిల్డింగుల్లో కొనసాగించేందుకు ఆలోచన చేస్తున్నారు. ఏడాదికి ఒక్కో పాఠశాలకు 3.58 కోట్లు ఖర్చు అవుతుందని తేల్చారు. ఈ వసతి గృహాలను బిసి సంక్షేమ శాఖ కాకుండా, మహాత్మా జ్యోతీబా పూలే వెనకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల సొసైటీ నిర్వహించనుంది. వసతి గృహాల్లోని సమస్యలు పరిష్కరించమంటూ విద్యార్థులు ఎన్నోసార్లు ప్రభుత్వానికి వినతులు ఇచ్చారు. ప్రభుత్వం ఆ విషయాలను పట్టించుకోనేలేదు. నేడు కన్వర్షన్ పేరుతో వాటిని మూసేసి బిసి విద్యార్థులకు ద్రోహం చేస్తోంది అంటున్నారు ఆ సామాజిక వర్గ నేతలు. ఫీజ్ రీయంబర్స్ మెంట్ ద్వారా బిసిలకు మేలు చేసిన రాజశేఖర్ రెడ్డిని మరిచిపోలేమని అంటున్నారు. ఆ పథకాన్ని నిర్వీర్యం చేసి, ఉన్న సంక్షేమ వసతి గృహాలను కూడా మూసేయడం చంద్రబాబు కపటత్వానికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిసిలపై ప్రేమ అంటూ చంద్రబాబు ఆడేదంటా నాటకమని, ఎన్నికల్లో బాబుకు బుద్ధి చెప్పేందుకే బిసిలంతా వైఎస్ జగన్ వెంటనడుస్తున్నారని అంటున్నారు. 
 
Back to Top