రాష్ట్రం ఉడుకుతుంటే బాబు తుర్రుమన్నాడు


– పోలవరం, కాపుల రిజర్వేషన్లతో రాష్ట్రం అతలాకుతలం
– పోలవరంపై ప్రధాని, గడ్కరీలతో మాట్లాడతానని చెప్పి 
    మూడు రోజులు గడవకుండానే విదేశాలకు 
– పోలవరంపై దృష్టి మరల్చేందుకు కాపుల రిజర్వేషన్లు 
– కాపు రిజర్వేషన్లపై వ్యతిరేకత వచ్చిందని దక్షిణ కొరియాకు 
–  పెట్టుబడుల పేరుతో బాబు పలాయన మంత్రం 
– పైసా రాల్చని చంద్రబాబు విదేశీ యాత్రలు 
– ప్రతి రెండు నెలలకోసారి విదేశాలకు 

తుగ్లక్‌ పాలనతో చంద్రబాబు రాష్ట్రాన్నిసమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తున్నారు.  తన అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి పబ్బం గడుపుతున్నారు. అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి, తానే సమస్యలను సృష్టించి మీ చావు మీరు చావండంటున్నారు. ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరో కొత్త సమస్యను సృష్టించి ,  మీడియాతో సహా అందరినీ  ఉసిగొల్పి చోద్యం చూస్తున్నాడు.  తరువాత కూడా పరిస్థితులు తనకు అనుకూలంగా  మారకపోతే,  జనం సొమ్ముతో...పెట్టుబడుల పేరుతో విదేశీ పర్యటన లు చేస్తూ ప్రజల అటెన్షన్‌ డైవర్ట్‌ చేయడానికి తాపత్రయ పడుతున్నాడు. 

నాలుగేళ్లలో 18 విదేశీ పర్యటనలు..

నాలుగేళ్లలో 18 సార్లు విదేశీ పర్యటనలు చేసొచ్చిన చంద్రబాబు రాష్ట్రానికి రూపాయి ప్రయోజనం చేకూర్చిన పాపాన పోలేదు. ఇప్పుడు తాజాగా మరోసారి మూడు రోజులు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లారు. పోలవరం ప్రాజెక్టు నావల్ల కాదు బాబోయ్‌ అని అసెంబ్లీలో చేతులెత్తేశారు.  వ్యతిరేకత వ్యక్తమైన తెల్లారే 22 నెలలుగా పెండింగ్‌ పెట్టిన మంజునాథ కమిషన్‌ రిపోర్టును పట్టుకొచ్చారు. ఇష్యూను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు.  ఏకాభిప్రాయం లేని రిపోర్టును పట్టుకొచ్చి,కాపులకు 5 శాతం రిజర్వేషన్‌  తన ఇష్టానుసారంగా నిర్ణయం ప్రకటించేశాడు. పోలవరం మీద బీజేపీని కెలికి.. రాష్ట్ర ప్రజలకు ప్రాజెక్టు నిర్మాణంపై అనుమానాలు కలిగించి.. దానిని పక్కదోవ పట్టించేందుకు హడావుడిగా మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేశాడు. ఎవరికీ ముందస్తు సమాచారం లేకుండా మంత్రివర్గ సమావేశంలో మంజునాథ కమిషన్‌ రిపోర్టును ముందుకు తీసుకొచ్చి నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగూ దీనిపై బీసీల్లో అగ్గి రాజేయవచ్చని పథకం ప్రకారం  నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు కాపులు, బీసీలు ఒకరినొకరు తిట్టిపోసుకుంటే తనకేమీ పట్టనట్టు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్తున్నాడు. పోలవరంపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీలను కలుస్తానని చెప్పి మూడు రోజులు కూడా కాలేదు.. దక్షిణ కొరియాకు తుర్రుమన్నాడు. 

ప్రచారం కోసమే విదేశీ యాత్రలు

ఇక వర్తమానంలో చంద్రబాబు విదేశీయానం ఓ ప్రచారాస్త్రంగా కనిపిస్తోంది. చంద్రబాబు ప్రయాణానికి రెండు రోజుల ముందు నుంచి ఈ ప్రచారం మొదలవుతుంది. విదేశాల్లో ఉన్నంత కాలం రాష్ట్రానికి పెట్టుబడుల వరద తరలివస్తున్నట్టు రంగుల కలలు కనిపిస్తాయి, కథనాలు వినిపిస్తాయి. ఆయన వచ్చిన తర్వాత  కనీసం రెండు నెలలకొకసారి వారం, పది రోజులు ఈ హైటెక్‌ నాటకం నడుస్తుంది. పెట్టుబడుల మాట ఏమోగానీ ప్రజలకు ఈ పర్యటనల వల్ల ఒరిగిందేమిటనే ప్రశ్నకు సమాధానం ఉండదు. 

ఎక్కడికెళ్లారు? బాబు ఏం చెప్పారు? 

ఇప్పటి వరకూ చంద్రబాబు తన మూడున్నర సంవత్సరాల పాలనలో 18 విదేశీ యాత్రలు చేశారు. అంటే ప్రతి రెండు నెలలకొకసారి విదేశాలు వెళ్లి వస్తున్నారు. అందులో దావోస్‌ మూడు సార్లు వెళ్లారు. సింగపూర్‌ రెండు సార్లు , అమెరికా రెండు సార్లు, జపాన్‌ కూడా రెండు మార్లు పర్యటించారు. చైనా, టర్కీ, బ్రిటన్, థాయిలాండ్, ఉజ్బెకిస్తాన్, స్విట్జర్లాండ్, శ్రీలంక వంటి దేశాలూ చుట్టి వచ్చారు. ఆయన ప్రతి పర్యటనలోనూ ప్రధాన లక్ష్యం ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమేనని చెబుతుంటా రు. అవన్నీ ఫలిస్తున్నట్టు, భారీగా ఎంవోయూలు కుదిరినట్టు, అమరావతికి తరలివస్తున్నట్టు కూడా చెప్పుకుంటారు.
 దేశంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల్లో పది లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకున్న చంద్రబాబు, దానికి అదనంగా ఫారిన్‌ ట్రిప్పుల్లోనూ లక్షల కోట్లు ఏపీకి వచ్చేస్తున్నట్టు చెప్పుకుంటారు. దానికి తగ్గట్టుగానే ఈ పర్యటనల్లో ప్రకటనలు ఉంటాయి. ఉదాహరణకు ఆయన సీఎం అయిన తర్వాత తొలి పర్యటనలో భాగంగా సింగపూర్‌లో అడుగుపెట్టారు. 2014 నవంబర్‌ రెండో వారంలో జరిగిన ఆ మూడు రోజుల పర్యటన తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రతి జిల్లాలో ఓ ఎయిర్‌ పోర్ట్‌ నిర్మిస్తానన్నారు. కానీ ఆ తర్వాత అది మరచిపోయారు. దాని వల్ల ఉపయోగం ఏమిటనే విషయం పక్కన పెడితే బాబు బహిరంగంగా చెప్పిన మాటను పూర్తిగా విస్మరించడం విశేషం. 2015–2017 వరకు మూడు సంవత్సరాల పాటు వరుసగా ప్రతి జనవరిలోనూ దావోస్‌లో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు ఆయన హాజరయ్యారు. దానికోసం ఆ సదస్సులో పాల్గొనడానికి భారీ ఎంట్రీ ఫీజును కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. అయినా ఎంట్రీ ఫీజు కట్టిన వారందరికీ అవకాశం కల్పించే దావోస్‌కు బాబును ఆహ్వానించడమే ఘనకార్యంగా చెప్పుకోవడం కూడా విశేషం. ఆ మూడు సార్లు బాబు చెప్పిన మాటల ప్రకారం 2015లో స్పీడ్‌ రైలు వస్తుందన్నారు. 2016లో అయితే విదేశీ పెట్టుబడుల పోటెత్తి రావడం, 2017లో ఆయన మాటలను అనుసరించి విశాఖలో మాస్టర్‌ కారిడార్‌ ఏర్పాటు జరిగి ఉండాలి. కానీ చట్ట ప్రకారం  ఏపీకి రైల్వే జోన్‌ రావాల్సి ఉండగా కేంద్రాన్ని నిలదీయలేని చంద్రబాబు, స్పీడ్‌ రైల్‌ మాటలను కూడా స్పీడ్‌గానే మరచిపోయినట్టు మనం భావించవచ్చు. 
 2015లో చైనా వెళ్లినప్పుడు షాంఘై తరహాలో అమరావతి నిర్మిస్తామన్నా రు. జపాన్‌ పర్యటనలో టోక్యో మాదిరిగా అమరావతి నగర నిర్మాణం సాగుతుందన్నా రు. టర్కీ వెళ్లిన సందర్భంగా ఇస్తాంబుల్‌ నగరంలా అమరావతి నిర్మించబోతున్నా మన్నారు. గత ఏడాది జులైలో కజికిస్తాన్‌ పర్యటన సందర్భంగా కాబూల్‌ కార్లు వస్తా యని చెప్పారు. రష్యా వెళ్లిన సమయంలో మెరైన్‌ వర్సిటీ వచ్చేస్తోందని చెప్పుకొచ్చారు. మొన్నటి జనవరిలో శ్రీలంక వెళ్లిన సమయంలో అమరావతికి ’మాస్టర్‌ ప్లాన్‌ శ్రీలంక’ ఇస్తుందని చెప్పుకొచ్చారు. అంతకుముందు లండన్‌ వెళ్లినప్పుడు చేసుకున్న ఒప్పందం ప్రకారం నార్మన్‌ ఫోస్టర్‌ను ఇప్పుడు రంగంలో దింపారు.ఇటీవల 17 పర్యటనగా అక్టోబర్‌ 18 న  వెళ్లిన చంద్రబాబు 26న తిరిగి వచ్చారు. అమెరికా, దుబాయ్, లండన్‌ దేశాల్లో  పర్యటించి అమరావతికి పెట్టుబడుల వరద వస్తుందని ప్రకటించారు. అయితే ఆయన పర్యటన ముగించుకుని ఇండియాకొచ్చాక దాని ఊసే లేదు. ఎందుకెళ్లారు.?. ఏం చేశారు..? రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారో? చెప్పనేలేదు! 

ఆర్థిక భారంగా పర్యటనలు...

బాబు పర్యటనలో పెడుతున్న ఖర్చు అసలే ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రానికి అదనపు భారంగా మిగలడమే తప్ప ఒరిగిందేమీ కనిపించడం లేదు. ఏపీ రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో ఇప్పటికీ స్పష్టత లేదు. స్విస్‌ ఛాలెంజ్‌లో గోప్యత, సింగపూర్‌ కంపెనీల పట్ల ప్రదర్శిస్తున్న అపార ప్రేమ విషయంలో అనుమానాలకు వివరణ లేదు. రాజధాని నిర్మాణం పెద్ద సందేహంగా మారుతోంది. ఇక వెలగపూడి వెళుతున్న ప్రజలకు మండు వేసవిలో గుక్కెడు నీళ్ల కోసం విలవిల్లాడాల్సి వస్తోంది. అయినా ఇప్పటికీ చంద్రబాబు తన  వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ , మరింతగా ముందుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి ప్రచారంతో నెట్టుకు రావాలని చూస్తున్నారు. 

దక్షిణ కొరియా పర్యటన దేనికి.. 

తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై జనం గంపెడాశలు పెట్టుకుంటే దానిగురించి చర్చించకుండా చంద్రబాబు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లాడు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి గడ్కరీలను కలుస్తానని చెప్పిన మనిషి మూడు రోజులు కూడా గడవకుండానే దక్షిణ కొరియాకు తుర్రుమన్నారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. సియోల్, బూసన్‌ నగరాల్లో పర్యటిస్తారని.. కియో మోటార్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌ను సందర్శిస్తారని మీడియాకు సమాచారం ఇచ్చారు. తనకు నచ్చిన వారిని, తన ఇష్టం వచ్చినట్లుగా, నచ్చినన్ని సార్లు విదేశాలకు తీసుకెళుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే  హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారు? అన్న ప్రశ్న జనసామాన్యం నుంచి వెల్లువెత్తుతోంది.
Back to Top