అవిశ్వాసమా రాజకీయ విన్యాసమా??

పార్లమెంట్ లో ప్రస్తుతం జరుగుతున్న 27వ అవిశ్వాస తీర్మానం. అవిశ్వాస తీర్మానాల గత చరిత్రలు ఎలా ఉన్నా, ఇది మాత్రం చాలా ప్రత్యేకమే. రాష్ట్రంలో పొత్తు పెట్టుకుని కలిసిమెలిసి తిరిగిన పార్టీతో తెగతెంపులై, అవిశ్వాసానికి వచ్చిన సందర్భం ఓ విచిత్రం. అంతకు కొద్ది రోజుల ముందు కూడా ఓ రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను 10రోజుల పాటు చర్చకు రాకుండా చేసిన సభలో, విడిపోయామని చెబుతూ, కయ్యం అంటూ కబుర్లు చెబుతున్న పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి సై అని చెప్పింది. ఇక అదే సభలో విపక్షాల మాటను తనమాటగా చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ ఎంపీల గొప్పతనం, ప్రధానిని కౌగిలించుకుని, కన్నుకొట్టి సరదా పడుతున్న ప్రధాన ప్రతిపక్ష చిలిపితనం ఓ నాటకాన్ని బాగా రక్తి కట్టించాయని చెప్పాలి. 
ఎందుకీ అవిశ్వాసం
కొద్ది రోజుల క్రితం విభజన హామీల కోసం, ప్రత్యేకించి ప్రత్యేక హోదా సాధన కోసం ఎపి ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్రంపై అవిశ్వాసాన్ని ప్రవేశపెడతామని ప్రకటించింది. ఆ సమయంలో రాష్ట్రంలోని అధికార పక్ష టిడిపి, కేంద్రంలో అధికారంలో ఉండి, రాష్ట్ర అధికార పార్టీతో పొత్తులో ఉన్న బిజెపి ఈ అవిశ్వాసం వల్ల ఒరిగేదేం లేదు అంటూ పెదవి విరిచారు. నేడు రాష్ట్రంలోని అదే అధికార టిడిపి కేంద్రంతో అవిశ్వాసం కోసం సిద్ధపడి, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాదు, దేశం దృష్టిలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని తెలపడానికి అని పాట పాడుతున్నారు. నాడు ఎందుకు అన్న నోటితోనే నేడు అవిశ్వాసం రాష్ట్రం అన్యాయం అవుతోందని తెలియజేయడానికి, కేంద్రం చేసిన మోసం బైయటపెట్టడానికి అంటూ కబుర్లు చెబుతున్నారు. 
పార్లమెంట్ లో పదనిసలు
బిజెపి అవినీతి, మోదీ పాలనలో మహిళలపై దాడులు, కరెన్సీ కస్టాలు, జిఎస్టీ పొరపాట్లు, చైనాతో భేటీల గురించి అనర్గళంగా మాట్లాడారు రాహుల్ గాంధీ. అధికార పక్షంతో మాటలతో యుద్ధం చేసారు. ఎన్నో అస్త్రాలు ఎక్కుపెట్టారు. అయితే ఉన్నట్టుండి ప్రధాని వద్దకు వెళ్లి హఠాత్తుగా ఆయన్ను కౌగిలించుకున్నాడు రాహుల్ గాంధీ. బిత్తరపోయి ఆతర్వాత సర్దుకున్న మోదీ రాహుల్ భుజం తట్టి, కరచాలనం చేసారు. అధికార, ప్రతిపక్ష నాయకుల తీరు చూసి సభంతా విస్తుపోయింది. తన చర్యలను సమర్థించుకుంటూ చిలిపిగా కన్నుకొట్టిన రాహుల్ ను చూసి దేశ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎన్డీయే ప్రభుత్వం అవిశ్వాసం వల్ల నష్టపోదని చెబుతూ, మోదీని కౌగిలించుకున్న రాహుల్ తీరుపై విస్తృతంగా చర్చ నడుస్తోంది.
ఉదయం 11 గంటలనుండి ఆరంభమైన అవిశ్వాస తీర్మానం పై చర్చలో వివిధ పార్టీలకు కేటాయించిన సమయంలో ఎంపిలు తమ వాణి వినిపించారు. చిత్రమేంటంటే ప్రత్యేక హోదా వద్దని, ప్యాకేజీ ముద్దని నిన్నటి వరకూ ప్రచారం చేసిన టిడిపి నాయకులు, దాన్ని ఖండించి, అసెంబ్లీలో వాదించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆనాటి మాటలను అక్షరం పొల్లుబోకుండా పార్లమెంట్ లో చిలకపలుకుల్లా వినిపించారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి అవసరమని, హోదా ఉండబోదు అనే కేంద్రం వాదన తప్పని నాడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చెప్పిన విషయాన్నే నేడు పార్లమెంట్ సెషన్ లో ఎంపి గల్లా జయదేవ్ అర్థగంట ఉపన్యాసం టిడిపి అవకాశవాద వైఖరికి అద్దం పట్టింది.  
ఇక అన్నిటికీ మించిన హైలెట్ సంగతి బిజెపి నేత రాజనాథ్ సింగ్ తన ప్రకటనలో టిడిపి బిజెపి మైత్రి గురించి పార్లమెంట్ సాక్షిగా నిజాలు బైటపెట్టడం. చంద్రబాబుతో ఎప్పటికీ కలిసే ఉంటామని ప్రకటించారు రాజ్ నాథ్ సింగ్. పార్టీలు వేరైనా చంద్రబాబు మాకెప్పుడూ మిత్రుడే అని ఆయన సభలో తేల్చి చెప్పారు. ఈ మితృత్వం తెగిపోదని, మున్ముందు కొనసాగుతుందనీ కూడా చెప్పడం బిజెపి టిడిపి రహస్య మైత్రి గురించి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎప్పటి నుండో చెబుతున్న విషయాలు వాస్తవాలని తేటతెల్లం చేసినట్లైంది. 
బిజెపి నేత కంభంపాటి హరిబాబు చంద్రబాబుకు చురకలంటించారు. విభజన కోసం లేఖ రాసింది చంద్రబాబే అని గుర్తు చేసారు. జీవితకాలం ఎన్టీరామారావు ద్వేషించిన కాంగ్రెస్ తో ఇప్పుడు చేతులు కలిపారంటూ ఘాటుగా విమర్శించారు. 
ఈ 27వ అవిశ్వాసం బిజెపి టిడిపిల ఓ రాజకీయ ఆవశ్యక డ్రామా అన్న విషయం ప్రజలకు అర్థమైంది. దీని ఫలితం ఏం కానుందో స్పష్టమైంది. 

 
Back to Top