అసంపూర్ణ అఖిలపక్షం


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ చెప్పినమాటే నిజమైంది. నిరర్థకమైన సమావేశమని, ముఖ్యమంత్రి మాటలు నమ్మి అఖిలపక్షానికి రాలేమని తేల్చి చెప్పారు వైఎస్ జగన్. ఆయన ఊహించినట్టుగానే అఖిలపక్షంలో బాబు వైఖరి ఆహ్వానితులను ఆశ్చర్యపరిచింది.
ఇది అఖిల పక్షాల సమావేశం కాదు, అఖిల సంఘాల సమావేశమే అని అన్నాడు బాబు. అంటే చంద్రబాబుకు కూడా ఇతర పార్టీల నాయకులెవ్వరూ తనను నమ్మి, అఖిలపక్ష భేటీకి రారని బాగా తెలుసు. అందుకే అఖిల సంఘాలు అని పేరు పెట్టుకుని తనకు తానా తందానా ఆడే వాళ్లను కూడా కలుపుకుని అఖిల సంఘాల పేరుతో అర్థంతర సమావేశం ఏర్పాటు చేసాడు. లెక్కకు మిక్కిలి ఉండాలనే ఉద్దేశ్యంతో చాలామందిని పిలిచినా, ఆశించిన స్థాయిలో పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు స్పందించలేదు. అఖిల సంఘమైనా, పక్షమైనా వచ్చిన వారితో చర్చించి ఓ నిర్ణయానికి రావాలి. ప్రభుత్వంతో కలిసి వచ్చ పార్టీలను, సంఘాలనూ కలుపుకుని వారి ఆలోచనలు పరిగణలోకి తీసుకుని ఉద్యమానికి ఓ రూపం తేవాలి. కానీ బాబు ఉద్దేశ్యమే వేరు. అసలీ సమావేశం పెట్టిందే ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరునుంచి ప్రజల దృష్టి మరల్చాలని. కానీ బాబుకు అక్కడ చుక్కెదురైంది. మిత్రపక్షం నుంచి వైదొలగడం, తమ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం వల్ల బిజెపి ఈ సమావేశానికి హాజరు కాలేదు. చంద్రబాబు మీద నమ్మకం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ ఈ భేటీని వ్యతిరేకించింది. అయితే అఖిలపక్షం ఏర్పాటు చేయమని ఒకప్పుడు అడిగిన జన సేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు అఖిలపక్షాన్ని లెక్కచేయాల్సిన పని లేదని ప్రకటించేశాడు. ఇక మిగిలినవి కాంగ్రెస్ ఇంకా వామపక్షాలు. గత కొన్నేళ్ల కిందటే కాంగ్రెస్ తో కలిసి విభజన హామీలపై కేంద్రంతో చర్చించడానికి అఖిలపక్షం ఏర్పాటు చేయమని డిమాండ్ చేసాయి సిపిఎమ్.సిపిఐలు. తాము డిమాండ్ చేసిన అఖిలపక్షం ఏర్పాటయ్యి పిలుపు వచ్చింది కనుక తప్పని సరి పరిస్థితుల్లో ఆ మూడు పార్టీల నేతలూ సమావేశానికి హాజరయ్యారు. 
బాబు వింత ప్రసంగం
అఖిలపక్షంలో చంద్రబాబు స్పీచ్ విన్న అందరికీ దిమ్మ తిరిగింది. ఆంధ్రప్రదేశ్ పసిగుడ్డు లాంటిది అని అభివర్ణించారు చంద్రబాబు. ఎంత జాగ్రత్తగా కేంద్రంతో వ్యవహరించాలో అంత జాగ్రత్తగానూ మసలుకున్నానని చెప్పుకొచ్చారు. ముందు నుంచే దూకుడుగా వ్యవహరించి ఉంటే, కేంద్రంతో సామరస్యంగా ఉండి రాష్ట్ర ప్రయోజనాలు రాబట్టుకుంటే బాగుండేదని మీరే అనేవాళ్లు కదా అని అఖిలపక్ష నేతలనుద్దేశించి అన్నారు. విభజన హామీల కోసం శాంతియుత పంథాలో పోరాటం చేయాలని, ఎక్కడా ఆవాంఛనీయ ఘటనలు జరకూడదు అని అన్నారు. 
విభజన జరిగినప్పటి నుంచీ వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన ఎన్నో ప్రజా ఉద్యమాలు ఎలాంటి అవాంచనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా సజావుగా సాగాయి. యువతను చైతన్యం చేస్తూ చేసిన యువభేరీల్లోనూ ఎక్కడా అపశృతి దొర్లలేదు. విద్యార్థుల పరీక్షలను కూడా దృష్టిలో ఉంచుకుని మరీ ఉద్యమ కార్యాచరణ రూపొందించారు వైఎస్ జగన్. అలాంటప్పుడు అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని చంద్రబాబు ఎందుకు అన్నట్టు. ఇక కేంద్రంతో టిడిపి వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఈ జాగ్రత్త పలుకులని బాబు మాటలు విన్న ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఎన్డీయేతో పొత్తు అని చెప్పిన బాబు, నాలుగేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా నోరు మెదరపక పోవడం, ఒక్క సారి కూడా బిజెపీ నాయకత్వాన్ని రాష్ట్ర హామీల గురించి ప్రశ్నించకపోవడం జాగ్రత్తగా వ్వవహరించడం అవుతుందా? లేక చంద్రబాబు చేతకానితనం, రాష్ట్ర ప్రయోజనాలపట్ల నిర్లక్ష్యం అవుతుందా? దూకుడుగా నేను వ్యవహరిస్తే ఇప్పుడు మీరు నన్ను నిందించి ఉండేవారంటూ చంద్రబాబు పిల్లిమొగ్గల కబుర్లు చెబుతున్నారు. సామరస్యంగా చేసినా, దూకుడుగా చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అయితే టిడిపి ప్రభుత్వాన్ని చంద్రబాబునూ ఎవ్వరూ నిందించలేరు. అధికారంలోకి వచ్చినప్పటి నుండీ రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశం గురించీ కేంద్రాన్నిసంప్రదించలేదని సాక్షాత్తూ ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అలాంటప్పుడు బాబు అలా చేస్తే ఇలా అనేవారు అన్న మాటే ఉండదు. ఇన్నాళ్లుగా హోదా  కోసం, విభజన హామీల కోసం చంద్రబాబు ఏమీ చేయలేదు అన్నదే వాస్తవం. బాబు ఒప్పుకోని నిజం. చివరకు అఖిలపక్షం నల్లబాడ్జీలతో శాంతియుత నిరసన, ఏప్రిల్ లో అఖిలపక్ష ఢిల్లీ ప్రయాణం అనే తీర్మానాన్ని చేసినట్టు ప్రకటించారు చంద్రబాబు. అసలు తీర్మానానికే ఉండని పక్షాలు కొన్ని, తీర్మానం వల్ల ఒరిగేదేం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన పక్షాలు కొన్ని వెరసి బాబు తీర్మానం అఖిల పక్షానిది కాదు, స్వపక్షానిదని ప్రజలు అర్థం చేసుకోవాలి. కనుక చంద్రబాబు అర్థాంతర అఖిలపక్షం అర్థంలేని తీర్మానంతో అసంపూర్ణంగా ముగిసిందని భావించొచ్చు. 
 
Back to Top