అప్పుల అప్పారావ్


అప్పుఇవ్వండి మ‌ళ్లీ పువ్వుల్లో పెట్టి తిరిగిస్తా అంటాడు అప్పుల అప్పారావ్...క‌చ్చితంగా ఇస్తాడు కానీ అవి ఇచ్చిన అప్పులు కాదు తెచ్చిన పువ్వులు అని తెలిసేస‌రికి తిరుక్ష‌వ‌రం అవుతుంది. ఈ చెవులో పువ్వులు పెట్టే విద్య బాబుకు తెలిసినంతగా ఎవ్వ‌రికి తెలుస‌ని? గ‌త పాతికేళ్లుగా క‌నీ వినీ ఎరుగ‌ని అప్పుఆంధ్రా నెత్తిన వేసిన అభిన‌వ అప్పారావ్ మ‌న చంద్ర‌బాబే. గంట‌లో 2000 కోట్ల అప్పు పుట్టించిన ఘ‌నుడాయ‌న‌. గుల‌క‌రాయ‌ను గ్రానైట్ రాయ‌ని అమ్మే నైపుణ్యం వున్న వ్యాపార‌వేత్త‌. బీడు నేల మీద బాహుబ‌లి గ్రాఫిక్స్ చూపించి మాహిష్మ‌తిని మించి అమ‌రావ‌త‌ని ప్ర‌మోట్ చేయ‌గ‌ల మేధావి. ఇంత‌కీ బాబుగారు అర్థంతరంగా అప్పుగా తెచ్చిన ఈ 2000 కోట్లు ఎక్క‌డివి? ఎంత‌మంది ఇంత సొమ్మును ఇచ్చారు?   వీటిగురించి కాస్త ఎంక్వైరీ చేస్తే కొన్ని చెవులో పూల‌లాంటి ప‌సందైన నిజాలు బైటికొస్తాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ లో గంట‌కొట్టి మ‌రీ బాండ్ల లిస్టింగ్ ప్రారంభించిన బాబు ఆ రెండు వేల కోట్ల‌ను మ‌దుపు చేసిన న‌వ‌నారాయ‌ణుల పేర్లు చెప్ప‌నేలేదు. అదో ట్రేడ్ సీక్రెట్ లాగా దాచిపెట్టారు. 


అప్పులు కావాలంటే క్రెడిబులిటీ కావాల్ట‌. అది లాయ‌ల్టీ ఉన్న చంద్ర‌బాబును చూసే వ‌స్తాయ‌ట‌. అందుకే బాబు ముఖం చూపి ప‌ళ్లికిలించ‌గానే 2000 కోట్ల రూపాయిలు అప్పు బాండ్ల ద్వారా పుట్టేసింద‌ట‌. జ‌గ‌న్ గానీ మ‌రో నాయ‌కుడుగానీ ఇంత అప్పు పుట్టించ‌లేక పోయేవార్ట‌. ఇదీ బాబుగారి భ‌జ‌న గ‌ణం పాడుతున్న పాట‌. అమ‌రావ‌తి బాండ్లు భ‌రోసా తెచ్చేసాయ‌ట‌. గ‌తంలో కొన్ని న‌గ‌రాలు బాండ్లు పెట్టినా ఎవ్వ‌రూ కొన‌లేద‌ట‌. కానీ అమ‌రావ‌తి పేరు పెట్ట‌గానే స్టాక్ ఎక్సేంజ్ లో క‌ల‌వ‌రం పుట్టింద‌ట‌. నిజ‌మే మ‌రి ప్లేగు లాంటి వ్యాధి క‌ల‌వ‌రాల‌నే పుట్టిస్తుంది. కాన్స‌ర్ లాంటి రాచ‌పుండు క‌ల‌వ‌రాన్నే సృష్టిస్తుంది. చంద్ర‌బాబు బాండ్ల వ్య‌వ‌హారంలో మ‌త‌ల‌బేంటో కొన్ని విష‌యాలు చీక‌ట్లోంచి వెలుగులోకి వ‌చ్చిన‌ప్పుడే బ‌య‌టికొస్తాయి. బాబు ఆడియో టేపుల్లో లాగా. తెలంగాణాలో కెసిఆర్ టిడిపిని ఖాళీ చేయించిన‌ప్పుడు గ‌గ్గోలు పెట్టాడు బాబు. కానీ ఓటుకు నోటు బైట‌ప‌డ‌గానే గ‌మ్మునుండిపోయాడు. అలాగే ఈ బాండ్ వెన‌కాలున్న బ‌డా బాబుల పేర్లు బైట‌కు వ‌స్తేనే అమ‌రావ‌తి బాండ్లు ఎవ‌రు ఎందుకు కొన్నారో ఏ చీక‌ట్లు తెల్ల‌రంగు పులుముకుని బ‌జార్లో బ‌రితెగిస్తున్నాయో బ‌ట్ట‌బ‌య‌లైతుంది. ఇది మేక తోలు క‌ప్పుకున్న పులి వ్య‌వ‌హార‌మే. 

అప్పులు తేవ‌డం ఘ‌న‌త‌. పైగా ఎక్క‌డా లేనంత ఎక్కువ వ‌డ్డీ ఇస్తామ‌ని కోట్లు కూడ‌బెట్ట‌డం కూడా ఘ‌న చ‌రితుల ఘ‌న‌తే. కానీ ఆ అప్పుల కుప్ప‌లు తెప్ప‌లు తెప్ప‌లై, రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి చిల్లుప‌డ్డ చిప్ప అయితే చంద్ర‌బాబు సాయం చేస్తాడా? వ‌ర‌ద‌లొచ్చాయి క‌నుక కేర‌ళ‌కు జాల‌ప‌డి సాయం చేస్తున్నారు. బాబుగారు చేసే జ‌ల్సాల‌కు, అధిక వ‌డ్డీల‌కు తెచ్చి త‌గ‌లేసే బాండ్ల‌కు రేపు కేంద్రం మాత్రం పూచీదారౌతుందా? ఇప్ప‌టికే లెక్క‌లు చెప్ప‌ని లోగుట్టుల గురించి ఆరాతీసి, నిధుల‌కు అడ్డుక‌ట్ట‌లేసింది. ఇస్తామ‌న్న హామీల‌కూ గండి కొట్టేసింది. కార‌ణం బాబుగారి జ‌వాబుదారీత‌నం లేని న‌వాబుదారీత‌న‌మే అని స్ప‌ష్టంగా చెప్పేసింది. ఇప్పుడు ఆర్థిక శాఖ‌, కేంద్రం, రాష్ట్ర ఖ‌జానాపై ప‌డే భారం ఇవేం లెక్క చేయ‌కుండా చేబ‌దుళ్ల‌లా, చిరు తిండ్ల‌కు ఇంట్లో చెంబులు తాక‌ట్టు పెట్టినచందంగా రాష్ట్రాన్ని అరువుకు పెట్టేశాడు బాబు. అందిన‌కాడ‌ల్లా అప్పులు చేసి ఆన‌క చెవిలో పువ్వులు పెట్టే అప్పుల‌ప్పారావు లాగే చంద్ర‌బాబు తీరూ ఉంది. రేపు ప‌చ్చ‌జెండా గ‌న‌క ఎత్తేస్తే...ఇక రాబోయే ప్ర‌భుత్వాలు బాబు త‌వ్విన‌ ఈ అప్పుల ఊబి నుంచి బైట‌ప‌డ‌టానికి మ‌రో అమ‌రావ‌తిని అప్ప‌డ‌గాలి.

Back to Top