చలికాలంలో వేడెక్కుతున్న రాజకీయాలు

ఓవైపు చలిగాలులు వీస్తున్న సీజన్‌లో...ఎపీ రాజకీయాల హీట్‌వేవ్స్‌ స్పీడందుకున్నాయి. ప్రతిపక్షాన్ని మాట్లాడనీయకుండా చేయాలన్న లక్ష్యంతోనే ఇన్నాళ్లు పాలిటిక్స్‌ నడిచాయి. ఎప్పుడైతే ప్రతిపక్షనేత కాస్త...ప్రజాపక్షనేతగా పాదయాత్రకు  శ్రీ‌కారం చుట్టారో...ఇక్క అప్పట్నుంచి పొలిటికల్‌సీన్‌ మారుతూవస్తోంది. 

పాదయాత్ర వంద, రెండువందలు, మూడువందల కిలోమీటర్లు దాటేసి...నాలుగువందల కిలోమీటర్లను దాటేసింది. వేలు, లక్షలుగా జనం నడిచివస్తున్నారు. వైయస్‌జగన్‌తో కలిసి అడుగులో అడుగేస్తున్నారు. అడుగడుగునా తమ జీవితాల్లోని సమస్యల చిట్టావిప్పిచెబుతున్నారు. నాలుగేళ్లకు దగ్గరవుతున్న బాబు పాలనలో తమ బతుకులెలా సమస్యల వలయంలో చిక్కుకుపోతున్నాయో, భవిష్యత్‌ ఎలా భయపెడుతోందో వినిపిస్తున్నారు.

ఇప్పటిదాకా హామీల సొదేగానీ, ఆచరణలో కనిపించని బాబుపాలన ఫలితాలు నిస్సందేహంగా ప్రజాజీవితాలను ప్రశ్నార్థకం చేసిపడేస్తున్నాయి. మాటెత్తితే చాలు...లక్షల కోట్ల పెట్టుబడులు, వేలు లక్షల ఉద్యోగాలంటూ, ఊదరగొట్టడం మినహా.. చేసిచూపింది లేదు. అరచేతిలో వైకుంఠమంటారే సరిగ్గా అలానే వుంది  ఏలుతున్నవారి పాలనా ప్రదర్శన. వ్యవసాయరంగంలో అనేకానేక సమస్యలు. గోడు చెప్పుకుందామంటే వినిపించుకునే నాధుడే కనిపించని వైనం.

డ్వాక్రా మహిళలవి ఓ రకం సమస్యలైతే, రైతుకూలీలవి మరోరకం సమస్యలు, చేయిసాచి అడిగినా అందని సంక్షేమ ఫలాలు, ఆరోగ్యశ్రీ అటకకెక్కుతున్నవైనాలు, కంటితుడుపుగా మారిపోతున్న  ఫీజురీయింబర్స్‌మెంట్,... షాకులు కొడుతున్న కరెంటుబిల్లులు, చితికిపోతున్న పడుగుపేకల చేనేత బతుకులు ఇలా ఒకటనేమిటి...అనేకానేకజీవనరంగాల్లో ఒక అలజడి. ఒక ఆందోళన. ఈ సామాజికవాతావరణాన్ని  కళ్లుండి చూడలేని కబోదిలా అర్థం చేసుకోలేకపోతున్న అధికారపక్షానికి,.నిలువుటద్దంలో నిజాలు చూపాలన్నట్టు జగన్‌ పాదయాత్ర సాగుతోంది. 
మొదట్లో విపక్షనేత ప్రజాసంకల్పయాత్రను ఎద్దేవా చేసిన ఏలినవారిప్పుడు...లైట్‌గా కాదు సీరియస్‌గా తీసుకుంటున్నారిప్పుడు.  ఆ రకమైన రాజకీయం దిశగా మళ్లుతున్నారు. నేనూ వున్నానంటూ జనసేన నాయకుడు తరలివచ్చాడు. అలా పాదయాత్ర రూపంలో ఓ అడుగుపడగానే, ఇలా పక్కదారి పట్టించేందుకు కొత్త పాలిటిక్స్‌ మొదలయ్యాయన్నమాట. జనాన్ని డైవర్ట్‌ చేయడానికి ...తపిస్తునారు. నేనిక పాలిటిక్స్‌లో ఫుల్‌టైమర్‌నవుతానంటున్న పవన్‌కళ్యాణ్‌ ఓవైపు నడుచుకుంటూ వస్తుంటే, ఇప్పటిదాకా తను మాటతప్పినా, హామీలను అమలు చేయకపోయినా, రేపు పోలవరం గడువులోగా పూర్తికాకున్నా, తాత్కాలిక కట్టడాలతో రాజధాని కథ కొనసాగినా, అదంతా నా తప్పుకాదు. అక్కడి వారిదేనంటూ ఢిల్లీకేసి వేలుచూపెట్టే ప్రయత్నాలకు శ్రీకారం చుడుతున్నారు ఎపీ సీఎంగారు. 

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, విపక్షనేత ప్రజాపక్షనేతగా ప్రజల సమస్యలను ఆలకిస్తూ, భవిష్యత్తుకు భరోసానిస్తూ ముందుకు సాగుతున్న వేళ... ఇక సర్కారు రోజుకొక సర్కస్‌ ఫీటు చేయక తప్పదు. జనసేన నాయకుడు సినిమా కథలూ వినిపించక తప్పదు.  

Back to Top