మంత్రుల వ్యాఖ్యలపై కన్నెర్ర...!

గుంటూరుః ప్రత్యేకహోదా డిమాండ్ తో ఆరురోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ ఆరోగ్యం పూర్తిగా విషమించింది. దీంతో పార్టీనేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వైఎస్ జగన్ దీక్షపై ...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై మండిపడుతున్నారు. 

అంబటి రాంబాబు..!
ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షపై చంద్రబాబు మంత్రులు మాట్లాడిన తీరు సిగ్గు చేటని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. చిత్తశుద్దితో దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ పై ఆరోపణలు మానుకోవాలని లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇష్టమొచ్చినట్లు వాఖ్యానిస్తున్నారని, అసలు రక్త నమునాలు ఎప్పుడు తీసుకుంటున్నారో పరీక్షలు ఎప్పుడు చేస్తున్నారో మీకు తెలుసా అని ప్రశ్నించారు. జీజీహెచ్ లో వైద్య పరికరాలు లేక ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లో టెస్టులు చేస్తున్నారంటే ప్రభుత్వం ఎంత పనికిరాని పరిపాలన చేస్తుందో అర్థం కావడం లేదా అని నిలదీశారు. ఆరు రోజులుగా నిద్రాహారాలు మానుకొని వైఎస్ జగన్ దీక్ష చేస్తుంటే కనిపించడం లేదా అన్నారు. మెచ్చుకోకపోయినా పర్వాలేదుకానీ ఆరోపణలు మాత్రం చేయొద్దని అన్నారు.మంత్రులు, చంద్రబాబునాయుడు అధికారం నెత్తికెక్కి అహంభావంతో మాట్లాడుతున్నారని , కాలం తిరిగొచ్చి వారిని అథపాతాళంలోకి నెట్టేసే రోజు తొందర్లోనే వస్తుందన్నారు. 

రాజన్నదొర..!
రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ని చంపేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందనే అనుమానం కలుగుతోందని విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. ప్రజా ప్రయోజనాలను ఆశించి దీక్షకు దిగిన జగన్‌మోహన్‌రెడ్డిని మంత్రులు కామినేని, ప్రత్తిపాటి హేళన చేయడాన్ని నిరసిస్తూ...దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దిష్టిబొమ్మలను లాక్కోవడంతో పోలీసులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యాతారహితంగా మాట్లాడిన మంత్రులను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి..!
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో  ద్వారంపూడి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆరవరోజు రిలేదీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో చంద్రబాబు చేసినవన్నీ దొంగ దీక్షలని ఎద్దేవా చేశారు. అందుకే అందరినీ దొంగ బుద్దితో చూస్తున్నారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు నిరాహార దీక్ష చేస్తే షుగర్, బీపీ లెవల్స్ ఎందుకు డౌన్ కాలేదని ప్రశ్నించారు. దమ్ముంటే లోకేశ్ ను జగనతో సమానంగా దీక్ష చేయించాలని చంద్రబాబుకు చంద్రశేఖరరెడ్డి సవాల్ విసిరారు. ఈ దీక్షలో మైనారిటీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
 
హర్షకుమార్..!
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం వైఎస్ చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షకు మాజీ ఎంపీ హర్షకుమార్ మద్దతు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైఎస్ఆర్ సీపీ నేతలు చేపట్టిన రిలే దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. అనంతరం హర్షకుమార్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ దీక్ష తన స్వార్థం కోసం కాదన్నారు. ప్రత్యేక హోదా కోసం కలిసి పోరాడాలని హర్షకుమార్ అన్ని పార్టీలకు సూచించారు.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
వైఎస్ జగన్ ఆరోగ్యంపై మంత్రి కామినేని, ప్రత్తిపాటి పుల్లారావులు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని పిచ్చి కుక్కల్లా మొరుగుతున్న మంత్రులు.. దమ్ముంటే ప్రత్యేకహోదా కోసం  రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.  ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.

మోపిదేవి, రాజశేఖర్,కృష్ణమూర్తి..!
హైకోర్టు ఉత్తర్వులు లెక్కచేయకుండా భార్య పేరుతో అగ్రిగోల్డ్ ఆస్తులను కారుచౌకగా కొన్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును మంత్రి వర్గం నుంచి తొలగించాలని  వైఎస్సార్ సీపీ నేతలు మర్రి రాజశేఖర్, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తిలు డిమాండ్ చేశారు. కోటప్పకొండ ప్రక్కనే ఉన్న బలిజేపల్లిలో 15 ఎకరాలు, చీమకుర్తిలో 20 ఎకరాలు మంత్రి కొన్నారని ఆరోపించారు.  మంత్రి భూముల కొనుగోలు వ్యవహారంపై సీఐడీ చేత దర్యాప్తు చేయించాలన్నారు. లేనిపక్షంలో  తామే దస్తావేదులు బయటపెడతామన్నారు.

లక్ష్మీపార్వతి..!
నైతిక హక్కులేని వారంతా వైఎస్ జగన్ ఆరోగ్యంపై మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆయన భజన బ్యాచ్ పై లక్ష్మీపార్వతి మండిపడ్డారు. , తక్కువ ధరలకే రైతుల భూములు ఆక్రమించుకున్నారని, రైతుల పత్తి పంట సొమ్ములు తన ఖాతాలోకి వేసుకున్నారని, మందిని ముంచిన మంత్రి ప్రత్తిపాటి అని లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో అధికారంలోకి వస్తే... రాష్ట్ర సమస్యల పరిష్కారం , అభివృద్ధి కోసం చిన్నవాడైనా వైఎస్ జగన్ అనేక దీక్షలు, ధర్నాలతో ముందుకు వెళుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ లాగా ఎవరూ శ్రమించలేదని పేర్కొన్నారు. జగన్ ను చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. గాంధీ అనుసరించిన మార్గాన్ని వైఎస్ జగన్ ఎంచుకున్నారని తెలిపారు. నిరవధిక దీక్ష అంటే అమరణ నిరాహార దీక్షేనని, అలాంటి దీక్షను అవమాన పరుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


అవినాష్ రెడ్డి...!
ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అంతకంతకు విషమిస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్, నిరుద్యోగ యువత కోసం జననేత తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి దీక్ష చేస్తున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా సాధన ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రజలకు, యువతకు పిలుపునిచ్చారు. జగన్ చూపిన బాటలో ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాడాలని కోరారు. పార్టీలకు అతీతంగా మద్దతు పలకాల్సిన అంశమిదని, అవహేళన చేసే విధంగా మంత్రులు మాట్లాడడం దారుణమన్నారు. ప్రతిపక్ష నేత ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోని వ్యక్తి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడం సిగ్గుచేటని అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీహెచ్ హనుమంతరావు..!
ఆరోగ్యం క్షీణిస్తున్నందున వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష విరమించాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ ప్రకటన చేయాలని  డిమాండ్ చేశారు.  ముందుగా వైఎస్ జగన్ దీక్ష విరమించాలని, సానుకూల ప్రకటన రావాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా10 ఏళ్ల పాటు కావాలని డిమాండ్ చేసిందే వెంకయ్య నాయుడు అని గుర్తు చేశారు. హామీని నెరవేర్చాల్సిన వెంకయ్య ఇప్పుడు చంద్రబాబు భజన చేస్తున్నారని విమర్శించారు.
Back to Top