మూగబోయిన నిజాలు

– ప్రాజెక్టులు ప్రారంభించడమే గొప్పగా ప్రచారం.. జనం మండిపాటు 
– మైకు కట్‌ చేసి వాస్తవాలు అడ్డుకోవచ్చని భ్రమ

వాస్తవాలు చెప్పే అలవాటు లేదు.. ప్రజల కోసం పనిచేసే పట్టుదల లేదు.. తప్పును నిజాయితీగా ఒప్పుకునే ధైర్యం లేదు.. జనం కోసం ఏదైనా చేయాలనే తపనా లేదు. ఉన్నదల్లా ఒకటే. రాష్ట్రంలో, దేశంలో ఏ మంచి జరిగిన దానికి మూల విరాట్‌ని తానేనని చెప్పుకోవడం. ఇన్ని విశేషణాలు ఎవరి గురించా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన శ్రీమాన్‌ చంద్రబాబు నాయుడి గురించే. మోకాలికీ బోడి గుండుకి ముడిపెట్టి.. సొంత డబ్బా కొట్టుకోవడం చంద్రబాబు నాయుడికి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు. 
నాలుగేళ్లలో అన్నీ అబద్ధాలు
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా గడిచిన నాలుగేళ్ల కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పరిశీలిస్తే ఆయన జనానికి చేసిందేమీ లేదు ఖర్చు లేని మాటలు చెప్పడం తప్ప. ఇప్పటికే దాదాపు 17 సార్లకు పైగా పెట్టుబడుల పేరుతో విదేశీ పర్యటనలు చేసొచ్చిన చంద్రబాబు రాష్ట్రానికి విమాన ఖర్చులు కూడా సాధించలేకపోయాడు. వీటికితోడు విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు, దావోస్‌లో పారిశ్రామిక వేత్తల సదస్సుకు 7 కోట్లు ఖర్చు పెట్టి టిక్కెట్‌ కొని వెళ్లి రావడం. అంతర్జాతీయ రాజధాని పేరుతో తగలేసిన రూ. 400 కోట్లు, పట్టిసీమకు మూడు సార్లు, రాజధానికి మూడు సార్లు శంకుస్థాపనలకు చేసిన ఖర్చులు వీటన్నింటికీ అదనం. అయితే తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు మీడియాను కొనుగోలు చేసి గొప్పలు చెప్పించుకుని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడు తప్ప ఒరిగింది మాత్రం శూన్యం. 
15 శాతం పనులకు నాలుగేళ్లా...
చంద్రబాబుకు వ్యవసాయం అంటే ఎంత విరక్తో చాలా సార్లు ఆయన మాటల్లో విన్నాం. మూడేళ్లుగా పదిహేను శాతం కూడా పూర్తి కావడానికి ఆపసోపాలు పడిన సాగు, తాగు ప్రాజెక్టులే దీనికి ఉదాహరణ. గతంలో పైడిపాలెం, ముచ్చుమ్రరి, ఇప్పుడు గండికోట. అన్నీ వైయస్‌ఆర్‌ హయాంలో దాదాపు 85 శాతంకు పైగా పూర్తియినవే. వీటిని పూర్తి చేయడానికి నాలుగేళ్లు సమయం తీసుకున్న చంద్రబాబు ప్రారంభోత్సవాన్ని మాత్రం అంగరంగ వైభవంగా ప్లాన్‌ చేశారు. ఇంతా చేసిన చంద్రబాబు వాస్తవాలను మాత్రం మరిచారు. నాయకులందరూ డబ్బుల కోసం తన పంచన చేరిన వారి లాగే ఉంటారనుకున్నట్టున్నాడు. ముచ్చుమ్రరి ప్రాజెక్టు శంకుస్థాపన సభలో మొదటిసారి కర్నూలులో ఎమ్మెల్యే ఐజయ్య చంద్రబాబుకు షాకిచ్చాడు. చంద్రబాబు వక్రభాష్యాలకు గండికొట్టాడు. తర్వాత పైడిపాలెం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఎంపీ అవినాశ్‌రెడ్డి చేసిందీ అదే. ఇప్పుడు గండికోట విషయంలోనూ జరిగిందీ అదే. కానీ చంద్రబాబుకు మాత్రం వాస్తవాలు రుచించలేదు. జనం నిజాలు తెలుసుకుంటే తనను చీదరించుకునే ప్రమాదముందని గ్రహించిన చంద్రబాబు ప్రతిపక్షాల నోరు నొక్కాలని ప్రయత్నించి విఫలమయ్యారు. 
ఎంపీకే సమాధానం చెప్పలేక..
గండికోట ప్రాజెక్టు ద్వారా పులివెందులకు నీళ్లిచ్చామని చెప్పిన చంద్రబాబు మాటలపై ఎంపీ అవినాశ్‌రెడ్డి స్పందించారు. ప్రాజెక్టును గతంలోనే వైయస్‌ఆర్‌ 85 శాతం పనులు పూర్తి చేశారని చెబితే.. ఖండించాల్సిన చంద్రబాబు మైకును కట్‌ చేయించడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ప్రాజెక్టుకు తాను ని«ధులు కేటాయించి ఆయనే నిజంగా పూర్తి చేసి ఉంటే చంద్రబాబు ఏమాత్రం వెనక్కి తగ్గేవాడే కాదు. దివంగత సీఎం వైయస్‌ఆర్‌  పనలను తనవిగా చెప్పకుంటున్నాడు కాబట్టే అవినాశ్‌ రెడ్డికి సమాధానం చెప్పుకోలేక మైకు కట్‌ చేయించాడు. గతంలో ముచ్చుమ్రరి, పైడిపాలెం ప్రాజెక్టుల విషయంలోనూ జరిగింది ఇదే. పైగా ప్రశ్నిస్తే బుకాయించడం మరింత విడ్డూరం. ప్రాజెక్టులు ఎవరు కట్టారో కాదు.. ఎవరు ప్రారంభించారో అనేది ప్రస్తావించాలని చెప్పడం చూస్తుంటే చంద్రబాబు చేతకానితనం తెలుస్తుంది. తనలాగే చట్టసభల్లో ఉన్న ఒక ఎంపీకి సమాధానం చెప్పలేని చంద్రబాబు పరిస్థితి కడు దయనీయం. ప్రతిపక్ష ఎంపీకి వివరణ ఇచ్చుకోలేక పేపర్‌ మీద రాసిస్తే సమాధానాలు చెబుతామనడం చూస్తే సమాధానం చెప్పుకోలేని డిఫెన్సులో పడినట్టు స్పష్టమవుతుంది. తనేదో సకలం తానే చేసినట్టు చెప్పుకుంటూ ఉండగా.. ప్రజలకు అవినాష్‌ రెడ్డి నిజాలు చెప్పడంతో చంద్రబాబు సొంత డబ్బాకు బ్రేకులు వేసినట్లయిందని పలువురు అనుకున్నారు.  
 
Back to Top