అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్

  • అప్పుల ఊబిలోకి రాష్ట్రం
  • కోట్లకు పడగలెత్తుతున్న సీఎం,మంత్రులు
రాష్ట్రాన్ని మరోసారి అప్పుల ఊబిలోకి నెడుతూ, చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తన చేతకాని తనాన్ని చాటుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ప్రతి చిన్న ఖర్చు కోసం ఓవర్ డ్రాఫ్టునకు వెళ్లన చరిత్ర ఉన్న ఆయన తన వైఖరిని మార్చుకోలేదు. తానో పెద్ద ఆర్దిక వేత్తనంటూ గొప్పలు చెప్పుకోడంలోని శ్రద్ధలో ఒక వంతు కూడా ఆచరణలో చూపకపోవడమనేది తన ప్రత్యేకత అని ఆయన మరోసారి నిరూపించుకుంటున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని రోజురోజుకు దిగజారుస్తూ, కేంద్రం నుంచి వచ్చిన నిధులను, వివిధ మార్గాల్లో తీసుకువచ్చిన వేల కోట్ల రూపాయల రుణాలను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తూ, ఖజానాను ఖాళీ చేస్తున్నారు. 

గత మూడు సంవత్సరాల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినా వేల కోట్ల అప్పుమాత్రం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో 90వేల కోట్లు ఉన్న అప్పు మూడేళ్లలో లక్షల కోట్లకు చేరుకుంది. ఎఫ్ ఆర్ బి ఎమ్ పరిమితి ప్రకారం ప్రభుత్వం ఈ ఏడాది రూ.23,794కోట్లు రుణం మాత్రమే తీసుకునే వీలుంది. అందులో ఇప్పటికే రాష్ట్రం 16వేల కోట్ల రుణం తెచ్చుకుంది. ఇక  7,794కోట్లు అప్పు తీసుకునే అవకాశం మాత్రమే మిగిలింది. కేంద్రం నుంచి కోట్లు కురుస్తాయని భ్రమల్లో పెట్టిన చంద్రబాబు ఇప్పుడు బీద ఏడుపులు మొదలు పెట్టాడు. కేంద్రం అవసరాలకు సరిపడా నిధులు ఇవ్వడం లేదంటూ నిట్టూర్పులు విడుస్తున్నాడు. ఆడలేక మద్దలు ఓడు అన్నట్లుగా అసలు నిధులు రాకపోవడానికి ప్రతిపక్షమే కారణం అని కూడా అంటుంటాడు. 

రుణభారం
గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఖజానాపై 2,15,797 కోట్ల అప్పు భారం ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడునెల్లకే అది 2,18,731 కోట్లకు పెరిగింది. రాష్ట్ర జిడిపిలో అప్పుల శాతం 28.46కి చేరింది. మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో పోల్చినా ఈశాతం చాలా ఎక్కువ. ఇక ఆర్థిక లోటు అనే బూచిని చూపిస్తూ అన్ని శాఖలకూ మొండి చేయి చూపించడానికి రాష్ట్ర సర్కార్ సిద్ధం అయ్యింది. విద్యార్థుల స్కాలర్ షిప్ లు, ఫించను బిల్లులు, రాష్ట్ర పథకాలకు సంబంధించిన కేటాయింపులకు మొండిచెయ్యి చూపుతోంది. ప్రతి జిల్లాలోనూ 200కోట్ల నుంచి 300కో్ట్ల రూపాయిల బిల్లులు ఆగిపోతున్నాయి. గతంలో జిల్లాల వారీగా బిల్లుల ఆమోదం జరిగితే, ఇప్పుడు ఆ ప్రక్రియ అంతా ఆన్ లైన్ ద్వారా రాష్ట్రం అంతటా ఒకే పద్ధతి అమలు చేసేలా ఆర్థిక శాఖ ఆంక్షలు విధించింది.  జీతాలు తప్పించి మిగితా ఏ బిల్లులనూ ట్రెజరీ సకాలంలో ఆమోదించలేదు. విద్యార్థులు, ఉద్యోగులు, పింఛను లబ్దిదారులు బిల్లుల ఆమోదం కోసం రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. 

చంద్రబాబు తన రెండు నాల్కల ధోరణితో ప్రజలను కన్ ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయం లేదు, కేంద్రం నుంచి నిధులు రావడం లేదు అని ఒక పక్క స్టేట్ మెంట్లు ఇస్తూనే మరోపక్క అభివృద్ధి సూచి అదరహో అనే తనే జబ్బలు కొట్టుకుంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం 11.72శాతం వృద్ధి రేటు సాధించిందని ఈమధ్య చెప్పుకోచ్చారు చంద్రబాబు.  కేవలం నిధులు వెచ్చించడం వల్లే అభివృద్ధి జరగదని కూడా శెలవిచ్చారు.  అందినకాడికి అప్పులు తేవడం, పథకాల పేరిట అందినంత దండుకోవడం చంద్రబాబు సర్కార్ ఆర్థిక ఎదుగుదల తీరిది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే, టిడిపి అధినేత ఆయన అనుయాయ మంత్రులందరూ కోట్లకు పడగలెత్తుతున్నారు. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ ను అప్పుల పాలు చేస్తున్నారు. ఇవీ అమరావతీశుడి సుదీర్ఘ పాలనా అనుభం తాలుకు ఫలితాలు!

తాజా ఫోటోలు

Back to Top