ముఖ్యమంత్రే మోసగాడు

►రాష్ట్రం అన్నీ కోల్పోతున్నా అదే మౌనం
►పదో షెడ్యూల్‌ ఆస్తుల్లో వాటా పోతున్నా మాట్లాడని బాబు
► కేంద్రాన్ని గట్టిగా నిలదీయకుండా మీనమేషాలు
► రెవెన్యూలోటు భర్తీకి నిధులడగరు
► ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీనే ముద్దంటారు
► కమీషన్లకోసం పోలవరం మేమే కడతామంటారు
► విభజన చట్టంలోని ఏ ఒక్క హామీకోసం గట్టిగా ప్రయత్నించరు
► రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లరు
► ఢిల్లీలో కేంద్రానికి పొగడ్తలు... రాష్ట్రంలో బీద అరుపులు

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన ముఖ్యమంత్రే మోసగాడైతే..? దొంగను పోలీసులకు పట్టించగలం...?కానీ ఆ పోలీసు వ్యవస్థనే గుప్పిట్లో పెట్టుకొని, అధికారాన్ని అడ్డంపెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకుంటున్న ఆ దొంగకు సంకెళ్లు ఎందుకు పడడం లేదు..? మన నాయకులు చెప్పినట్లు పైన బీజేపీ, కింద డీజీపీ ఉంటే చాలు రాష్ట్రాన్ని ఏమైనా చేయొచ్చన్న ధీమాలో చంద్రబాబు ఉన్నట్టు అర్థమవుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అరాచకాలే అందుకు నిదర్శనం. అనుభవజ్ఞుడిని, తానొస్తే రాష్ట్రం వెలిగిపోతుందని ప్రజలను మాయమాటలతో నమ్మించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు... అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఏమీ చేయకపోగా, రాష్ట్ర వనరులను కొల్లగొడుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం పోరాడడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడు. అవినీతిలో మాత్రం ఏపీని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడం ఆయనకే చెల్లింది. 

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి హక్కుగా రావాల్సిన అంశాలపట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విభజన చట్టంలోని పదవ షెడ్యూలులో గల 142 సంస్థలకు చెందిన రూ.36,835.43  కోట్ల ఆస్తుల పంపిణీ విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయం జరగడానికి ఆయన గట్టిగా ప్రయత్నించకపోవడమే కారణమని అధికార, ఉద్యోగ వర్గాలు విమర్శిస్తున్నాయి. జనాభా నిష్పత్తి మేరకు ఈ ఆస్తుల్లో ఏపీకీ 58 శాతం వాటా రావాల్సి ఉండగా... ఇప్పుడు కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులతో ఆస్తుల్లోవాటా కోల్పోతున్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు పెదవి విప్పకపోవడం దారుణమని అధికారులు, మేధావులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ఇన్ని వేల కోట్లు ఆస్తులు ఏపీకి రాకుండా జరిగిన అన్యాయాన్ని కనీసం ప్రధాని దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఈ అంశంపై ఒక విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేయలేదంటే రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఆయనకెంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది.

గత మూడేళ్లుగా ముఖ్యమంత్రి అనేకసార్లు ఢిల్లీకి వెళ్లినా, ప్రధానమంత్రిని కలిసినా రాష్ట్రానికి సంబంధించిన నిధులను రాబట్టే విషయంలో గట్టిగా పట్టుబట్టకపోవడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోందని ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను తేవాల్సిన ముఖ్యమంత్రే ప్రత్యేకహోదా సంజీవని కాదంటూ పలుమార్లు వ్యాఖ్యానించడం, లేని ప్యాకేజీని ఇచ్చినట్లు ప్రచారం చేసి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడం... రైల్వేజోన్‌ విషయంలో నోరు మెదపకపోవడం, రాజధాని నిర్మాణానికి నిధులు సాధించలేకపోవడం, విభజన చట్టంలోని పలు హామీలు అమలు కాకపోయినా పట్టించుకోకపోవడం ముఖ్యమంత్రి ఉదాసీనతకు అద్దం పడుతోందని దుయ్యబడుతున్నారు.

రాష్ట్రానికి సంజీవనిలాంటి పోలవరం జాతీయ ప్రాజెక్టును కేంద్రమే నిర్మించి ఇస్తామని చెప్పినా, పట్టుబట్టి మేమే నిర్మిస్తామంటూ తెచ్చుకోవడంతో వేల కోట్ల రూపాయలు కోల్పోవాల్సి వచ్చింది. రాష్ట్రాభివృద్ధి కోసమే ఎన్నో అవమానాలను భరిస్తున్నానంటూ పదే పదే చెప్పే చంద్రబాబు... రాష్ట్ర ప్రయోజనాల సాధనకోసం గత మూడేళ్లుగా ఢిల్లీలో నోరు మెదిపిన దాఖలాలు లేవు. ఇప్పుడు పదవ షెడ్యూలులో గల సంస్థల ఆస్తుల విషయంలోను సీఎం ఇదే ధోరణి అనుసరించడం దారుణమని ఉద్యోగులు వాపోతున్నారు.

ఏపీకి వాటాకోసం ప్రయత్నించని సీఎం...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటైన పలు ప్రభుత్వ రంగ సంస్థలు, ఇనిస్టిట్యూషన్స్‌కు చెందిన ఆస్తుల్లో ఆంధ్రప్రదేశ్‌కు వాటాకోసం గత మూడేళ్లుగా ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా గట్టి ప్రయత్నం చేయకపోవడంతో రూ.36,835.43కోట్ల విలువైన ఆస్తులను కోల్పోవాల్సి వచ్చింది. హైదరాబాద్‌ తెలంగాణలో ఉన్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఆ సంస్థలన్నీ ఏర్పాటైనందున ఆ ఆస్తుల్లో ఏపీకి తప్పకుండా వాటా ఉందని విభజన చట్టంలో పొందుపరిచారు. పదవ షెడ్యూలులో గల 142 సంస్థలకు మొత్తం రూ.36,835.43  కోట్ల విలువగల ఆస్తులున్నట్లు అధికారులు లెక్కగట్టారు. ఇందులో 120 సంస్థలు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసినందున ఈ సంస్థల్లో రాష్ట్రానికి జనాభా నిష్పత్తి మేరకు ఏపీకీ 58 శాతం వాటా రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులతో ఆస్తుల్లోవాటా కోల్పోతున్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు పెదవి విప్పకపోవడం దారుణమని అధికారులు, మేధావులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌పై పదేళ్ల పాటు హక్కు ఉన్నప్పటికీ ఓటుకు కోట్లు కేసులో ముఖ్యమంత్రి దొరికిపోవడంతో అర్ధంతరంగా హక్కులన్నీ వదిలేసుకుని విజయవాడకు వచ్చేశామని, ఇప్పుడు ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నా నోరు మెదపకపోతే ఎలాగని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి మౌనంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విద్యామండలి నిధుల విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరించారని, చివరకు ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో... రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తగ్గేదిలేదంటూ మంత్రివర్గంలో చర్చించినట్లు తమ అనుకూల పత్రికల్లో రాయించుకోవడం తప్ప ఆ దిశగా ప్రయత్నాలేమీ జరగడంలేదని విమర్శిస్తున్నారు
Back to Top