‘హోదా కోసం ఎందాకైనా’


– వైయస్‌ఆర్‌సీపీ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం
– రాజీనామాలకు సిద్ధమైన వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు 
– హోదా రాకుంటే ఏపీ భవన్‌ సాక్షిగా నిరాహార దీక్ష
– సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహారదీక్షలు 
 

పార్లమెంట్‌ సమావేశాలు ఏప్రిల్‌ ఆరో తేదీతో ముగియనున్న నేపథ్యంలో వైయస్‌ఆర్‌సీపీ భారీ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. హోదా సాధనే ధ్యేయంగా ‘హోదా కోసం ఎందాకైనా’ అంటూ పోరును పతాక స్థాయికి తీసుకురానున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడమే అంతిమ లక్ష్యంగా ఢిల్లీ వేదికగా కీలక అడుగు పడనుంది. ఏపీ భవన్‌ సాక్షిగా వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. పార్లమెంట్‌లో అవిశ్వాసం చర్చకు రాకుండా అడ్డుకుంటున్న నేపథ్యంలో రాజీనామా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనలతో ఎంపీలు పదవులను వదులుకోవడానికి సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు ప్రత్యేక హోదాపై ప్రజలు, యువకుల్లో అవగాహన కల్పించడానికి ధర్నాలు, యువభేరిలు లాంటి కార్యక్రమాలతో దూసుకెళ్లిన వైయస్‌ఆర్‌సీపీ.. ఇకపై జరగబోయే ప్రతి కార్యక్రమంలోనూ ప్రజలనే భాగస్వాములను చేసేలా కార్యక్రమాలను రూపొందించారు. 

నాలుగేళ్లు మోసగించి..

ఎన్నికలకు ముందిచ్చిన హామీలు నెరవేర్చడానికి టీడీపీ, బీజేపీలకు నాలుగేళ్ల సమయం సరిపోలేదు. కనీసం ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్‌ వంటి ప్రధాన హామీలు నెరవేర్చడంలోనూ విఫలమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రశ్నార్థకం చేశారు. ఎన్నికలకు మరో ఏడాదే సమయం ఉండటంతో ప్రజల్లో చులకన అవుతున్నామని గ్రహించిన రెండు పార్టీలు వ్యూహాత్మకంగా బంధాన్ని తెంచుకున్నాయి. రాజకీయలబ్ధి కోసం ఒకరిపైఒకరు బురద జల్లుకుంటూ ఆంధ్రా ప్రజలను మోసం చేయడానికి మరో కొత్త ఎత్తుగడకు తెరదీశారు. చంద్రబాబైతే మరో అడుగు ముందుకేసి హోదా అంటే జైలుకు అన్న నోటితోనే ప్రత్యేక హోదా నినాదాన్ని వినిపించారు. అనుకూల మీడియాలో తానే ఏపీకి ప్రత్యేక హోదా తేగల సత్తా ఉన్న నాయకుడిగా బిల్డప్‌లు ఇచ్చుకుంటున్నారు. 

తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం...

హోదాపై పోరాటంలో తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్దేశించిన పోరాటంలో అన్ని వర్గాలను భాగస్వాములను చేసేందుకు వైయస్‌ఆర్‌సీపీ ప్రణాళిక రూపొందించింది. ప్రత్యేక హోదా నినాదం ఊరూ వాడా మార్మోగేలా చూడటంతోపాటు హోదా అవసరాన్ని ప్రజలకు వివరించేలా ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించాలని పార్టీ ్రÔó ణులకు దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు పార్లమెంట్‌ జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేస్తూ కేంద్ర పార్టీ ప్రకటన విడుదల చేసింది. హోదా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేలా కార్యాచరణను రూపొందించేందుకు తక్షణమే జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ ముఖ్య  నాయకులతోపాటు పార్టీ విదార్థి, యువజన, మహిళా విభాగాల నాయకులను ఆహ్వానించి, చర్చించనున్నారు. ఈ పోరాటంలో వైయస్‌ఆర్‌సీపీతో కలిసి వచ్చే పార్టీలను, ప్రజా సంఘాల వారిని లిఖితపూర్వకంగా సంప్రదించి ముఖ్యులతో నేరుగా మాట్లాడి వారి మద్దతు కూడగట్టేలా చూడాలి. 

వినూత్న నిరసనలు

ఎంపీల రాజీనామాలు, ఆమరణ దీక్షలతో ఉద్యమాన్ని తుది దశకు తీసుకెళ్తున్న క్రమమిది. అందువల్ల వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాలకు ముందుగానే ‘ ప్రత్యేక హోదా– ఆంధ్రుల హక్కు’ అనే నినాదాన్ని, హోదా ఆవశ్యకతను, హోదా సాధనకు వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేయబోతున్న రాజీనామాలను, నిరవధిక దీక్షలను, వారికి సంఘీభావంగా 175 నియోజకవర్గ కేంద్రాలలో చేపట్టనున్న రిలే నిరాహార దీక్షలను అన్ని వర్గాల ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల్ని చైతన్య పరచాలి. ఇందుకు కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా ప్రజలకు తెలియజేయాలి. అదే విధంగా మోటార్‌ బైకు ర్యాలీలు, కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, కాలేజీ విద్యార్థులతో ధర్నాలు, ఇతరత్రా వినూత్న రీతులతో నియోజకవర్గంలోని అన్ని ప్రధాన కూడళ్లలో నిరసన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు సలహాలు చేస్తుంటారు. ప్రతి కార్యకర్త ఉద్యమంలో పాల్గొనేలా చూడాలి. 
Back to Top