బలవంతపు భూసేకరణపై కన్నెర్ర

  • రాజధానిలో టీడీపీ రౌడీయిజం
  • వైయస్‌ జగన్‌ పర్యటనను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు
  • రంగంలోకి దిగిన మంత్రులు, పోలీసులు
  • తిరగబడుతున్న రైతులు, రాజధాని ప్రాంత కూలీలు
  • ప్రతిపక్ష నేత కోసం ఎదురుచూస్తున్న రాజధాని ప్రాంతవాసులు
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ సర్కార్‌ భారీ కుంభకోణానికి తెరలేపింది. రైతులను బెదిరించి భూములు లాకున్నారు. ఇప్పటికే భూములను త్యాగం చేసిన రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదు. సీఆర్‌డీఏ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా తమ భూములను లాక్కునేందుకు ప్రయత్నించడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో ఆ ప్రాంతంలో రైతులు 33 వేల ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌కు (సమీకరణకు) ఇచ్చారు. పూలింగ్‌కు ఇవ్వకుండా వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతుల వద్ద మిగిలి ఉన్న భూములను కూడా ఇప్పుడు భూసేకరణ పేరిట లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంతో వైయస్‌ జగన్‌ బాధితులకు అండగా నిలిచారు. ఇకపై మీ ఆటలు సాగవని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించడంతో అధికార పార్టీలో అలజడి మొదలైంది. ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. తాము చేసిందే చట్టం..చెప్పిందే న్యాయం అన్నట్లు రాజధాని ప్రాంత ప్రజలను మభ్యపెట్టి, బెదిరించి భూములు లాక్కున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధపడగా తెలుగు దేశం పార్టీలో వణుకు పుడుతోంది. 

భూసేకరణ బాధితులకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అండగా నిలబడతానని హామీ ఇవ్వడంతో ఇక తమ ఆటలు సాగవని, ప్రతిపక్ష నేత తలపెట్టిన రాజధాని ప్రాంత పర్యటనను అడ్డుకునేందుకు అధికార పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు గ్రామాల బాట పట్టారు. రెండే ళ్లుగా రాజధాని ప్రాంత రైతులకు కనిపించకుండా ముఖం చాటేస్తున్న మంత్రులు, టీడీపీ నాయకులు.. వైయస్‌ జగన్‌ పర్యటన నేపథ్యంలో రంగంలోకి దిగి దిగజారుడు రాజకీయాకులకు తెరలేపారు. రాజధాని నిర్మాణం పేరుతో పలు హామీలిచ్చి రైతుల భూముల్ని లాక్కున్న ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా గాలికొదిలేసింది. రైతుల వద్ద మిగిలిన ఉన్న భూముల్నీ లాక్కునేందుకు ప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకున్న ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ వారికి అండగా నిలిచేందుకు 19న రాజధాని గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. దీంతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది.  రాజధాని నిర్మాణం కోసమని ఇప్పటికే ప్రభుత్వం 33 వేల ఎకరాలకు పైగా భూములు సేకరించింది. అంతటితో ఆగకుండా లక్షన్నర ఎకరాలకు చంద్రబాబు ఎసరు పెట్టారు. ఎలాగైనా రైతుల భూములు లాక్కునే బాధ్యతను కొందరు మంత్రులకు అప్పగించగా, వారు పోలీసుల సహాయంతో గ్రామ సభలు ఏర్పాటు చేశారు. అయితే రైతులు తమ భూములు ఇవ్వమని, మాకు అండగా నిలబడాలని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశ్రయించారు. దీంతో వైయస్‌ జగన్‌ బాధితులకు అండగా నిలిచేందుకు రాజధాని ప్రాంతంలో పర్యటనకు సిద్ధపడ్డారు. పర్యటన ఖారారు అయిననాటి నుంచి పచ్చ తమ్ముళ్లు గ్రామాల్లో బెదిరింపులకు దిగారు. ఎవరెవరూ వైయస్‌ఆర్‌సీపీ సభలకు వెళ్తున్నారో అనే అంశాలపై ఆరా తీయడం మొదలుపెట్టారు. వారి సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారు. మాట విననివారిపై అక్రమ కేసులు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. 

ఎదురు తిరిగిన లంక రైతులు
ఎన్నికల్లో మీకు ఓట్లు వేస్తే మాకు చేసే న్యాయం ఇదేనా? మీ పార్టీని నమ్మినందుకు ఇదా చేసేది? పిలిపించి అవమానిస్తారా? గజం భూమి కూడా ఇవ్వం.. ఏం చేస్తారో చేసు కోండి’’ అంటూ లంక రైతులు మంత్రులకు ఎదురు తిరిగారు. వైయస్‌ జగన్‌ పర్యటించనున్న గ్రామాల్లో మంత్రులు, అధికారులు రైతులతో చర్చలు జరిపారు. సచివాలయంలో మంగళవారం సమావేశమైన మంత్రులు నారాయణ, ప్రత్తి పాటి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, స్థానిక నాయకులు సాయంత్రం 3.30కి లింగాయపాలెం చేరుకున్నారు. లంక భూము లకు చెందిన కొందరు రైతులను పిలిపిం చారు. సాగు భూములకు పరిహారంగా ఇచ్చింది తీసుకోవాలని చెప్పడం అన్యాయమని రైతులు వాపోయారు. మేము మీ కోసం రాలేదు. అవన్నీ సీఎంతో మాట్లాడి చెబుతాం అని మంత్రులు చెప్పటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కంగుతిన్న మంత్రులు రైతులను మభ్యపెట్టేందుకు లంక భూముల్లో పర్యటించారు.

వైయస్‌ జగన్‌ సభకు స్థలం ఇవ్వకుండా ఆటంకాలు
 భూ సమీకరణ బాధితులకు అండగా నిలిచేందుకు రాజధాని ప్రాంతంలో పర్యటించనున్న వైయస్‌ జగన్‌ పర్యటనకు అధికార పార్టీ నేతలు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉందని, సభలు, సమావేశాలు నిర్వహించు కోవడానికి వీల్లేదని రైతులు, వైయస్‌ఆర్‌సీపీ నేతలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లింగాయపాలెంలో వైయస్‌ జగన్‌  రైతులతో ముఖాముఖి మాట్లాడేందుకు స్థలాన్ని ఇవ్వొద్దంటూ అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారు. మంగళవారం సాయంత్రం వైయస్‌ఆర్‌సీపీ నాయకులు మరో స్థలాన్ని పరిశీలిస్తుండగా పోలీసులు మూకుమ్మడిగా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మీడియా ప్రతినిధులు ఉండటంతో కొద్దిసేపు వేచి చూసి వెళ్లిపోయారు. వైయస్‌ జగన్‌ ఎక్కడెక్కడ పర్యటిస్తారు? రూట్‌ మ్యాప్‌ ఏంటి? అంటూ స్థానిక టీడీపీ నేతలు రెండు రోజులుగా ఆరా తీస్తుండటం గమనార్హం. టీడీపీ నేతలు, పోలీసుల తీరును వైయస్‌ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేత పర్యటనకు ఆంక్షాలా అని మండిపడ్డారు. ప్రభుత్వం నియతృత్వ ధోరణి మానుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హెచ్చరించింది. ప్రభుత్వం ఇకనైన తమ తీరు మార్చుకోకపోతే ఉద్యమం ఉధృతం కాకతప్పదు . 

 
Back to Top