తిరుపతి: ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణ చేసుకొన్న మునికోటి కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా నిలిచింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సూచన మేరకు పార్టీ తరపున ఆయన కుటుంబానికి రూ. 3లక్షల మేర ఆర్థిక సాయం అందించారు. తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శేషాద్రి కుటుంబానికి రూ. 50వేలు సాయం చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి నారాయణ స్వామి, పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఈ మొత్తాన్ని అందచేశారు.<br/><br/>మునికోటి ఆత్మహత్య యత్నం చేసుకొన్న వెంటనే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పందించారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోవటంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీలో మహా ధర్నా తర్వాత రోజు వైఎస్ జగన్ నేరుగా తిరుపతికి వచ్చారు. మునికోటి కుటుంబ సభ్యుల్ని పలకరించి పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లి శేషాద్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. ఆ సమయంలో అక్కడ కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితులు, మునికోటి ఆత్మార్పణం పూర్వాపరాలమీద వివరాలు తెలుసుకొన్నారు.<br/>పార్టీ తరపున ఆ కుటుంబాలకు సాయం అందించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నాయకులు స్వయంగా వెళ్లి బుధవారం ఈ ఆర్థిక సాయం అందించి వచ్చారు. <br/>