కృష్ణాకు వ‌ర‌దొస్తే అమ‌రావ‌తికి పెనుముప్పు

న్యూఢిల్లీ:  రాజ‌ధాని నిర్మాణాన్ని స‌వాల్ చేస్తూ నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్లో దాఖ‌లైన పిటిష‌న్ల‌పై విచార‌ణ సెప్టెంబ‌ర్ 9కి వాయిదా ప‌డింది. గ‌త ఏడాది కాలంగా వాయిదాలు ప‌డుతున్న ఈ కేసులో తుది వాద‌న‌లు పూర్త‌య్యాయి. ఈ కేసును జ‌స్టిస్ స్వ‌తంత్ర‌కుమార్ నేతృత్వంలోని న‌లుగురు స‌భ్యుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచారించింది. ఈ సందర్భంగా పిటిష‌న‌ర్ల త‌ర‌పు న్యాయ‌వాధి సంజ‌య్ ప‌రేఖ్ వాద‌న‌లు వినిపిస్తూ... కృష్ణా న‌ది, కొండ‌వీటి వాగుకు వ‌ర‌ద‌లొస్తే ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన రాజ‌ధాని ప్రాంతానికి తీవ్ర‌ముప్పు వాటిల్లుతుంద‌ని పేర్కొన్నారు. 

న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో నిర్మాణాలు చేప‌ట్ట‌డం వ‌ల్ల శ్రీ‌న‌గ‌ర్‌, ఉత్త‌రాఖండ్‌, ఉజ్జ‌యినీ, అల‌హాబాద్ ప్రాంతాలు తీవ్ర న‌ష్టాన్ని ఎదుర్కొన్నాయ‌ని గుర్తు చేశారు. రాజ‌ధాని ఎంపిక‌కు ఏర్పాటైన శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ సిఫార్సుల‌కు వ్య‌తిరేకంగా రాష్ట్ర ప్ర‌భుత్వం రాజ‌ధాని నిర్మాణానికి అమ‌రావ‌తిని ఎంపిక చేసింద‌ని సంజ‌య్ వాదించారు. అక్క‌డి భూములు వ్య‌వ‌సాయ యోగ్య‌మైన‌వ‌ని క‌మిటీ పేర్కొందంటూ వివ‌రించారు. మేం రాజ‌ధాని నిర్మాణానికి అడ్డుకాదు. కానీ అందుకు ఎంపిక చేసిన ప్రాంతాన్నే మేం వ్య‌తిరేకిస్తున్నామ‌న్నారు. వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం విచార‌ణ‌ను సెప్టెంబ‌ర్ 9కి వాయిదా వేసింది. ఆ రోజున ప్ర‌భుత్వం వాద‌న‌లు వినిపించ‌నుంది

ప్ర‌జాస్వామ్యానికి విరుద్ధంగా రాజ‌ధాని
ప్ర‌జాస్వామ్యానికి విరుద్ధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నూత‌న రాజ‌ధాని నిర్మాణాన్ని చేప‌డుతోంద‌ని సామాజిక‌వేత్త మేథాపాట్క‌ర్ విమ‌ర్శించారు. నేష‌నల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్‌లో రాజ‌ధాని నిర్మాణానికి వ్య‌తిరేకంగా దాఖ‌లైన పిటిష‌న్‌ల విచార‌ణ సంద‌ర్భంగా ఆమె కోర్టుకు హ‌జ‌ర‌య్యారు. అమ‌రావ‌తి నిర్మాణం కోసం మూడు పంటలు పండే భూముల‌ను ల్యాండ్‌పూలింగ్ పేరుతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం లాక్కుంటోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. దీనివ‌ల్ల భ‌విష్య‌త్తులో ఆహార కొర‌త ఏర్ప‌డే ప‌రిస్థితులు ఉత్ప‌న్న‌మ‌వుతాయ‌ని హెచ్చ‌రించారు. భూములు లాక్కొని ఇప్ప‌టికీ రైతుల‌కు స‌రైన న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వ‌లేదన్నారు. ప‌ర్యావ‌ర‌ణ సంర‌క్ష‌ణ‌కు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోలేద‌న్నారు. 
Back to Top