మంత్రి గారి టీమ్ అవినీతి ఖరీదు 230 కోట్లు


పత్తి కొనుగోళ్ల స్కామ్ లో
తవ్వే కొద్దీ వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. పలు రకాల ఆరోపణలకు వ్యవసాయ మంత్రి
పత్తిపాటి పుల్లారావు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. ఇందులో ఆయనకు సంబంధించిన
బినామీల చుట్టూ కథ తిరుగుతోంది.

గత ఏడాది ఒక్కసారిగా పత్తి
కొనుగోళ్లు పెరిగిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా, క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం
జిల్లాల్లోని తొమ్మిది కేంద్రాల్లో ఈ కొనుగోళ్లు జరిగాయి. రైతుల ప్రమేయం లేకుండా నేరుగా
లావాదేవీలు జరిగినట్లు అనుమానిస్తున్నారు.

వాస్తవానికి పత్తి
కొనుగోళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా..సీసీఐ బాధ్యత వహిస్తుంది. గత ఏడాది
గుంటూరు కేంద్రంగా పనిచేసిన కొందరు ఉద్యోగులతో ఏజంట్లు మిలాఖత్ అయినట్లు
తెలుస్తోంది. స్వయానా పత్తి వ్యాపారిగా పేరు గాంచిన వ్యవసాయ మంత్రి పత్తిపాటి
పుల్లారావు అనుచరులు ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్లు సమాచారం. రైతులు లేకుండానే
పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఏజంట్లు బినామీ రైతుల పేరుతో ఎక్కువ రేటుకు
సీసీఐ కు విక్రయించినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇందులో అక్షరాలా 230 కోట్ల
రూపాయిలకు పైగా కొట్టేసినట్లు చెబుతున్నారు.

సీసీఐ కేంద్ర ప్రభుత్వ రంగ
సంస్థ కావటంతో అవినీతి వ్యవహారాన్ని తేల్చేందుకు  సీబీఐ రంగంలోకి దిగింది. ఏ ఏ కేంద్రాల్లో
అత్యధికంగా కొనుగోళ్లు నడిచాయి..ఇందుకు మూలంగా నిలిచింది ఎవరు.. వంటి వివరాల్ని
సేకరిస్తున్నారు. పనిలో పనిగా కొందరు రైతుల సాక్ష్యాధారాల్ని కూడా
తీసుకొంటున్నట్లు సమాచారం. మొత్తం మీద ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా
మారుతోంది. 

Back to Top