ఎక్కడి పనులు అక్కడే గప్‌చుప్‌!

పాలకొండ (శ్రీకాకుళం జిల్లా) :

ఎక్కడి పొలం పనులు అక్కడే పక్కన పెట్టారు రైతన్నలు. ఎన్నికల సందడికీ విరామం ఇచ్చారు. అన్నిరకాలుగా తమను ఆదుకున్న మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ శ్రీమతి షర్మిలకు మద్దతుగా నిలిచారు. మరో ప్రజాప్రస్థానం పేరుతో శ్రీమతి షర్మిల చేస్తున్న పాదయాత్రలో కలిసిపోయారు. ఆమె అడుగులో అడుగు వేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోని బూర్జ మండలం డొంకలపర్తి నుంచి నాలుగవ రోజు బుధవారం శ్రీమతి షర్మిల పాదయాత్ర జోరుగా, హుషారుగా కొనసాగింది. ఉదయం 9 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. తన కోసం వేచి ఉన్న అభిమానులు, ప్రజలకు శ్రీమతి షర్మిల అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ముందు ఒక్కొక్కరు... ఆ తర్వాత పదులు... వందలు.. వేల సంఖ్యలో జనం ప్రభంజనమై వెల్లువెత్తారు.

దారి పొడవునా ప్రజలకు అభివాదాలు చేస్తూ... ఆత్మీయంగా పలకరిస్తూ... బాధలు చెప్పుకున్న వారికి రాజన్న రాజ్యం వస్తుందని భరోసా ఇస్తూ శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగించారు. డొంకలపర్త నుంచి లక్కుపురం, పాలవలస, రామన్నపేట, కొండపేట, పెద్దపేట, మదనాపురం, బూర్జ, ఏపీ పేట, కేకే రాజపురం, ‌టిఆర్ రాజుపేట, కొల్లివలస, లచ్చయ్యపేట, సింగన్నపాలెం, ఉప్పినివలస మీదుగా వైకుంఠపురం వరకు యాత్ర సుదీర్ఘంగా దాదాపు 16 కిలోమీటర్లు కొనసాగింది. బస కేంద్రం వద్ద ప్రారంభమైనప్పుడు సంప్రదాయబద్ధంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్ మహిళా కన్వీన‌ర్ బొడ్డేపల్లి పద్మజ కుమార్తె జాహ్నవి‌ ప్రసాద్ చీర, గాజులను‌ శ్రీమతి షర్మిలకు అందజేశారు. ఇదే ప్రాంతంలో పార్టీ రాష్ట్ర ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదనరెడ్డి పార్టీ అధికారిక ఫే‌స్‌బుక్‌ను శ్రీమతి షర్మిల వద్ద ప్రదర్శించారు.

తుడ్డలి ప్రాంతం వద్ద అరసవిల్లి రామలింగాచారి తాను కలపతో తయారుచేసిన ఉపకరణాలు శ్రీమతి షర్మిలకు చూపించగా ఆమె ప్రశంసించారు. పాలకొండ మండలం ఎన్.కె.రాజపురానికి చెందిన రైతులు పొలాల్లోంచి పరుగు పరుగున వచ్చి శ్రీమతి షర్మిలను కలిశారు. ఇలా... ప్రజలు, కర్షకులు, కార్మికులు, వృత్తిపని వారు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, వికలాంగులు శ్రీమతి షర్మిలను కలిసి తమ గోడు వినిపించారు. ఆమెను కలిసినందుకు ఎంతగానో సంబరపడ్డారు.

మార్గం మధ్యలో పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్తలు కిల్లి రామ్మోహనరావు, బొడ్డేపల్లి మాధురి, ముఖ్యనేతలు డాక్టర్ పైడి మహేశ్వరరావు, పైడి కృష్ణప్రసాద్, మొదలవలస వెంకటరావు, పైడి రాజారావు తదితరులు శ్రీమతి షర్మిలను మర్యాదపూర్వకంగా కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. బూర్జ మండలమంతా పల్లె ప్రాంతం కావడంతో ప్రశాంత వాతావరణం నడుమ ఆహ్లాదకరమైన పరిసరాలను ఆస్వాదిస్తూ పాదయాత్రలో పార్టీ శ్రేణులు, అభిమానులు సమరోత్సాహంతో పాల్గొన్నారు.

తండ్రి రాజన్న మాదిరే తనయ :

దివంగత మహానేత ఈ లోకంలో లేకపోయినా ఆయన ఉన్నట్టే అన్పిస్తోంది.. పాదయాత్రలో నడుస్తూ.. అలుపెరగని బాటసారిగా శ్రీమతి షర్మిల చేస్తున్న సాహసం, ఆమె హావభావాలన్నీ.. అప్పట్లో మహానేత వైయస్‌ను చూసినట్టుగానే ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. ఎక్కడ చూసినా, ఏ నలుగురు కలిసినా.. ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. మహానేత లాగానే చేత్తో అభివాదం చేయడం, చిరునవ్వు, దాదాపుగా నడిచే వైఖరి కూడా తండ్రి వైయస్‌ను తలపిస్తోందని కొందరు మహిళలు అంటున్నారు. మరికొందరైతే ఏకంగా తండ్రి రాజన్న రూపమే కదులుతోందనట్టుగా కూడా మాట్లాడుకోవడం కన్పించింది.
వీటినన్నంటినీ మించి ఆమెలో పట్టుదల సామాన్యమైనది కాదని, తన కుటుంబానికి ఎంత ఇబ్బందులున్నా అవేవీ కన్పించనీయకుండా తనదైన శైలిలో పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిల నిజంగా గ్రేట్ అని కొందరు కాలేజీ విద్యార్థినులు అంటున్నారు.

Back to Top