అపర భగీరథుడి తనయ కోసం పరుగులు!

శ్రీకాకుళం :

దూరంగా పొలం పనులు చేసుకుంటున్న రైతులు.. కాలేజీకి వెళ్తున్న విద్యార్థులు.. దుకాణాలు నడుపుతున్న చిరువ్యాపారులు.. బస్సుల్లో వెళ్తున్న ప్రయాణికులు.. బిడ్డను ఎత్తుకుని ఆడిస్తున్న తల్లి.. అందరి కళ్లు అటువైపే.. మహానేత డాక్టర్ రాజన్న తనయ అటుగా వస్తు‌న్నదనే తెలియగానే ఒక్కసారిగా వారంతా ఉరుకులు.. పరుగులు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన తనయను ఒక్కసారైనా చూడాలనే ఆతృతతో వారు రోడ్డుకు చేరుకుంటున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను పట్టించుకోకపోవడంతో తమ కష్టాలను వివరించాలనే తపన ఒకరి‌ది.. రాజన్న లేని రాజ్యంలో బాలింతలకు సంక్షేమ పథకాలు అందక పడుతున్న మనోవేదనను వివరించేందుకు ఓ తల్లి... పెరిగిన ఎరువుల ధరలు.. వ్యాపారుల అత్యాశతో నిలువునా దోపిడీకి గురవుతున్న బాధను చెప్పుకోవడానికి రైతన్నలు.. ఇలా ప్రతి ఒక్కరూ... తమ సాదకబాధలను వివరించేందుకు పోటీపడుతూ పల్లెల నుంచి కదలి వస్తున్నారు. పాదయాత్ర జరుగుతున్న ప్రాంతం నుంచే కాకుండా యాత్రలేని నియోజకవర్గాల నుంచి, యాత్ర జరగాల్సి ఉన్న మండలాల నుంచి వేలాదిగా అభిమాన జనం విశేషంగా తరలివస్తున్నారు.

శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమై శుక్రవారానికి ఆరు రోజులు ముగిసింది. శ్రీమతి షర్మిల పాదయాత్రలో విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజన్నను ముఖ్యమంత్రిగా చూసిన కళ్లతో.. జనరంజక పథకాలతో తమ బతుకుల్లో వెలుగులు నింపిన మహానేత తనయ శ్రీమతి షర్మిల అలుపెరుగని పాదయాత్రను చూసి ఆవేదనకు గురయ్యారు. నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన కోమర్తి ప్రజలైతే ‘పులిబిడ్డ పులిబిడ్డే.. మానవ మాత్రుడికి సాధ్యంకాని అసాధారణ యాత్ర చేసి మహానేత తనయ అనిపించుకున్నారు’ అంటూ గుండెల్లోని తమ ఆనందాన్ని, ఆవేదనను వెళ్లబుచ్చారు. మహానేత వైయస్ఆర్ తనయ ‌వేలాది కిలోమీటర్లు పాదయాత్రగా నడుస్తూ రావడం పట్ల అభిమానంతో కూడిన ఆవేదనను వెలిబుచ్చారు.

ప్రజాప్రస్థానంపై ప్రజల రచ్చబండ !:
శ్రీమతి షర్మిల పాదయాత్ర శిలగాంసింగువలస, అలికాం కాలనీ, బైరిజంక్షన్, కరజాడ, మడపాం, దేవాది, కోమర్తి గ్రామాల మీదుగా కొనసాగగా.. మహిళలు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు నీరాజనాలు పలికారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర ఎంతో దూరంలో ఉన్నా చాలా ముందుగానే రోడ్లపైకి చేరుకున్నారు. ఈ లోపే రచ్చబండ వద్ద కూర్చుని మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పరిణామాలు, కాంగ్రెస్ కక్ష‌ కట్టి శ్రీ జగన్‌ను వేధించడం, ముఖ్యమంత్రిగా వైయస్ అమలు‌ చేసిన సంక్షేమ పథకాల గురించి చర్చించుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో అనేక కష్టాలు పడుతున్నామని వాటిని శ్రీమతి షర్మిల దృష్టికి తీసుకువెళ్తేనే పరిష్కారమవుతాయనే ఆశాభావంతో వచ్చామని సత్యవతి చెప్పారు. రావులవలస గ్రామస్తులు శ్రీమతి షర్మిలకు తమ కష్టాలు వివరించారు. ఎరువుల ధరలు పెరిగిపోయాయని, వ్యాపారులు అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్నామని, ఇప్పుడు పొలంలోకి అడుగుపెడదామంటే భయం వేస్తోందని కన్నీళ్ల పర్యంతమయ్యారు. దీర్ఘాశి రాము అనే రైతు.. తమ కష్టాలు ఈ ప్రభుత్వం తీర్చకపోయినా అపర భగీరథుడి బిడ్డకు వివరిస్తే రాజన్నకు చెప్పుకున్నట్టేనని అభిప్రాయపడ్డారు. జాతీయ రహదారికి చేరుకున్న ఇంజినీరింగ్ విద్యార్థులు ఫీజురీయింబ‌ర్సుమెంట్ పథకంపై ప్రభుత్వ ఆంక్షల ఫలితంగా పడు‌తున్న ఇబ్బందులు చెప్పడానికి వచ్చామని వివరించారు.

ఇలా ప్రతి ఒక్కరూ రాజన్న రాజ్యాన్ని తల్చుకుంటూ శ్రీమతి షర్మిలను చూసేందుకు పల్లెల నుంచి దండులా కదులుతున్నారు. జగనన్న వదిలిన బాణం శ్రీమతి షర్మిలను చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. సమస్యలు ఏకరువు పెడుతూనే రాజన్నరాజ్యం మళ్లీ వచ్చేందుకు జగనన్నకు సాయపడతామంటూ భరోసా ఇస్తున్నారు.

తాజా వీడియోలు

Back to Top