మళ్లీ అదే మహా(మాయ)నాడు

– ఆర్భాటాలు, అర్ధసత్యాలు అసత్య హామీలు 
– పోలవరం పూర్తి, అమరావతి నిర్మాణంపై ప్రజల్లో అనుమానాలు
– కేంద్రంపై నెపం నెట్టేసి తప్పించుకునే యోచనలో బాబు 
– ప్రత్యేక హోదా ఛాంపియన్‌ కావాలని బాబు మెరుపు కలలు 
– ఉద్దానంను ఉద్దరించింది లేదు.. విశాఖకు రైల్వేజోన్‌ రాదు


ఎప్పటిలాగే మే 28వ తేదీ వచ్చింది. టీడీపీ చేసుకునే మూడు రోజుల మహానాడు కార్యక్రమం విజయవాడ వేదికగా సిద్ధార్థ కాలేజీలో మొదలైంది. ఎప్పట్లాడే చింతపండు పులిహోర, తోటకూర పప్పు, గడ్డ పెరుగు, బెండకాయ ఫ్రై లాంటి గొప్పలు తప్ప గత హామీల సంగతులు, రాష్ట్ర స్థితిగతులు, బీజేపీతో తెగతెంపుల నేపథ్యంలో రానున్న ఏడాది కాలంలో ఎలా నడిపిస్తారన్న అనుమానాలు ప్రజల్లో ఉంటే అవన్నీ నివృత్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. బీజేపీతో సత్సంబంధాలు నెరిపినా పోలవరం, రాజధాని నిర్మాణం అనుమానంగా తయారైంది. నాలుగేళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్‌ వంటి హామీల అమలు కోసం ప్రతిపక్షాలు పోరాడితే చంద్రబాబు అరెస్టు చేయించి గొంతు నొక్కారు. ఇప్పుడు ఆయనే స్వయంగా ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే అని జనాన్ని నమ్మించడానికి సాము గరిడీలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ సహా ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై కేసులు బనాయించి... అరెస్టులు చేయించిన బాబు.. ఇప్పడు తాను ప్రత్యేక హోదా ఛాంపియన్‌ కావాలని కలలు కంటున్నాడు. ఏడాదిలో ఎన్నికలున్న నేపథ్యంలో అనుకూల మీడియాతో వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయించుకుని తాను మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రేతాత్మ ప్రార్థనలు చేస్తున్నాడు. ఏరు దాటినాక తెప్ప తగలేసే అలవాటున్న చంద్రబాబు.. నరేంద్ర మోడీని నాలుగేళ్లు భుజాన మోసి ఇప్పుడు కాంగ్రెస్‌ పంచన చేరి బీజేపీని తిట్టిపోస్త్నునాడు. చంద్రబాబు స్వయంగా డిమానిటైజేషన్‌ కమిటీకి చైర్మన్‌గా కొనసాగాడు. నోట్ల రద్దు చేసిన తర్వాత కూడా చంద్రబాబు రెండేళ్ల పాటు చైర్మన్‌గా ఉన్నాడు. నోట్ల రద్దు సమయంలో అది తన క్రెడిట్‌గా ప్రచారం చేసుకున్న చంద్రబాబు.. ఇప్పుడేమో నోట్ల రద్దును పనికిమాలిన చర్యగా అభివర్ణిస్తున్నాడు.  గతేడాది మహానాడు ఉత్తరాంధ్రలో జరిగితే రాష్ట్ర విస్తీర్ణంలో 15 శాతంగా దాదాపు కోటి మంది జనాభా ఉన్న ఉత్తరాంధ్రను మహానాడు సాక్షిగా చంద్రబాబు విస్మరించారు. విశాఖ రైల్వేజోన్‌ సహా ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్య, వంశధార ప్రాజెక్టు బాధితులకు నష్ట పరిహారం, మూత పడే స్థితిలో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమ వంటి ఎన్నో సమస్యలను ప్రస్తావించకుండానే మహానాడును మమ అనిపించేశారు. మహానాడు జరిగిన ప్రతిసారీ ఎన్టీఆర్‌కు భారతరతన్న ఇవ్వాలని తీర్మానం.. ఆనక ఉట్టికెక్కించేయడం మామూలే. ఈసారీ అదే జరిగింది. కాకపోతే కేంద్రమంత్రి సుజన చౌదరి మరో అడుగు ముందుకేసి ఎన్టీఆర్‌కి భారతరత్న ఫైలు ప్రధాని టేబుల్‌ మీదే ఉందన్నారు.

గతేడాది మహానాడులో హామీలు
మహానాడు ముగిసిన అనంతరం చివరి రోజున చంద్రబాబు ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. మూడు రోజులు .. 27గంటలు..  94 మంది ప్రసంగం.. 34 తీర్మాణాలు చేశామని గర్వంగా చెప్పారు. అయితే చేసిన తీర్మానాలన్నీ రాజకీయ తీర్మాణాలే కావడం విశేషం. మూడేళ్లలో రెండు మూడు తాత్కాలిక భవనాలకే పరిమితమైన అమరావతిని భవిష్యత్‌ తరాలకు కానుకగా ఇస్తానని చెప్పుకొచ్చారు.  2050 వరకు కూడా ఆంధ్రాలో టీడీపీ అధికారంలోనే కొనసాగాలని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా టీడీపీని అధికారంలోకి తీసుకొస్తానని నెరవేరని కోరికలు కోరారు. గతేడాది కార్యకర్తల పిల్లలకు స్కూళ్లు కట్టిస్తానని చెప్పిన హామీ నెరవేరనే లేదు.. ఈసారి పేద కార్యకర్తలకు రాయితీపై స్మార్ట్‌ ఫోన్లు ఇస్తానని ప్రకటించారు. జనానికి కనీస అవసరాలైన నీరు, విద్య, వైద్యం అందిస్తానని చెప్పడం మాని టెక్నాలజీ కా బాప్‌ నేనే అన్నట్టుగా ఈ ఏడాది చివరికి 40 లక్షల మందికి ఫైబర్‌ నెట్‌ ఇస్తానని ప్రగల్భాలు పోయారు. కరువుతో తాగడానికే నీళ్లు లేక అల్లాడుతున్నాం మహాప్రభో అని జనం మొత్తుకుంటుంటే నీటికి, కరెంటుకు మీటర్లు బిగిస్తానని జనాలతో ఎకసక్కాలు ఆడేశారు. తానే మేధావిలా ప్రజెంట్‌ చేసుకోవడం బాబుకు అలవాటు.  ప్రజా సమస్యలు పక్కనపెట్టి జనానికి అర్థంకాని పర్‌ క్యాపిటా ఇన్‌కం, జీడీపీ, జీఎస్‌డీపీల ప్రస్తావన తీసుకొచ్చారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి.. ఈవీఎంల మీద అనుమానం అక్కర్లేదు.. ఓటేస్తే స్లిప్పురావాలి వంటి సందర్భం కాని విషయాలను ప్రస్తావించి ప్రజా సమస్యలను దారి మళ్లించారు. ఇవన్నీ వినలేకనే ఏమో బాబు స్పీచ్‌లో ఉంటే.. తమ్ముళ్లు బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తూ గడిపేశారు. 

తాజా వీడియోలు

Back to Top