పేదలపై మరోసారి విద్యుత్ వడ్డన

విద్యుత్ ఛార్జీల బాదుడుకు రంగం సిద్ధం
రెండేళ్లలో రెండోసారి ఛార్జీల పెంపు
పేదల నెత్తిన రూ. 2వేల కోట్ల పెనుభారం..
మోపుతున్న టీడీపీ సర్కార్
ప్రభుత్వ సబ్సిడీలో కోత ఫలితంగానే బాదుడు
మండిపడుతున్నరాష్ట్ర ప్రజానీకం


ఇప్పటికే నిత్యావసర ధరలు, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోలు ధరలు, పన్నుల మీద పన్నులతో సామాన్యులకు వాతలు పెడుతున్న ప్రభుత్వం..మరోసారి విద్యుత్ వడ్డనకు సిద్ధమైంది. ఏపీ ప్రజల నెత్తిన రూ. 2వేల కోట్లను బాదేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తి చేసిన విద్యుత్ నియంత్రణ మండలి మరో రెండు మూడు రోజుల్లో ఆదేశాలు జారీ చేసేందుకు సన్నద్ధమైంది. పెరిగిన కొత్త విద్యుత్ ఛార్జీలు ఏఫ్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈరెండేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెరగడం ఇది రెండోసారి. 2015-16లో టీడీపీ సర్కార్ సామాన్యప్రజలపై రూ.941 కోట్ల భారాన్ని మోపింది. టారిఫ్ ప్రతిపాదనల ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు..రూ.738 కోట్ల మేర ఛార్జీల పెంపున తొలుత ప్రతిపాదించాయి. ఐతే, పరోక్ష పద్ధతిలో మరో రూ. 1,217 కోట్లు రాబట్టాలని నిర్ణయించాయి. 2016-17లో రూ. 5,148 కోట్ల మేర ఆర్థిక లోటు ఉందని డిస్కంలు ప్రతిపాదించాయి. ఐతే ప్రభుత్వం సబ్సిడీ రూపంలోరూ.4,365 కోట్లు ఇస్తుందని భావించగా..రూ.3 వేల కోట్లతో సరిపెట్టింది. ప్రభుత్వం సబ్సిడీలో కోత ఫలితంగా వినియోగదారుల నుంచి రూ. 2,148 కోట్లు భారం మోపాలని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. 

ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు చేసి తమపై భారం వేస్తుందని ప్రజలు మండిపడుతున్నారు. ఐతే, దీన్ని గుర్తించిన టీడీపీ సర్కార్ దొడ్డిదారిలో జనం నెత్తిన ఛార్జీలను వాయించేందుకు ప్లాన్ వేసింది. దీనిలో భాగంగానే  గ్రూపుల పద్ధతిని తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టెలిస్కోపిక్ విధానం అమల్లో ఉంది.  గృహ వినియోగదారులు వినియోగించే యూనిట్లను బట్టి ..టెలిస్కోపిక్ విధానంలో ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఐతే, ఇక నుంచి గ్రూపుల విధానాన్ని ప్రవేశపెట్టి  ఏడాది విద్యుత్ వినియోగాన్ని  ప్రాతిపదికగా తీసుకొని ఛార్జీలు వసూలు చేయనున్నారు. 

దీనివల్ల నెలకు 50 యూనిట్లు వినియోగించే పేదవర్గాలపై భారం పడనుంది. ఏడాదికి సగటున 600 యూనిట్లు వాడే వినియోగదారుడు.. ఒక్క యూనిట్ ఎక్కువ వాడినా అది తదుపరి ఏడాది నుంచి ఎక్కువ టారిఫ్ లోకి వెళ్లిపోతుండడంతో అదనపు భారం పడుతుంది. ఈ గ్రూపుల విధానం ద్వారా  దాదాపు 40 లక్షల మంది సామాన్య ప్రజలపై పెనుభారం మోపినట్లు అవుతుంది. 

ఇదే వార్తాశం ఇంగ్లీష్
లో:  http://goo.gl/Zs3FdJ 

తాజా వీడియోలు

Back to Top