అడుగడుగునా ఉప్పొంగిన అభిమానం

తండోపతండాలుగా వచ్చిన జనంతో కిక్కిరిసిపోయిన పాదయాత్ర దారులు. అడుగడుగునా మంగళహారతులు. రాజన్న బిడ్డను చూడాలంటూ పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకూ ఒకటే ఆరాటం, ఉత్సాహం. ఏ గ్రామానికి వెళ్లినా ఎదురొస్తున్న అభిమానం. కుంకుమదిద్ది ఆహ్వానం... యువకుల కేరింతలు... చిన్నా పెద్దా తేడా లేకుండా నిరీక్షణ... రాజన్న బిడ్డను చూడాలంటూ ఒకటే ఆరాటం.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ‌పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోవదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మంజిల్లాలో రెండవ రోజు కొనసాగింది. ‘అధైర్యపడకండి... మంచి రోజులు వస్తాయి...’ అని బాధలు చెప్పేవారిని ఓదారుస్తూ... అభిమానంతో చూడడానికి ముందుకు వచ్చిన వృద్ధులను ఆత్మీయంగా పలకరిస్తూ, రచ్చబండలో వికలాంగుల సమస్యలు తెలుకుంటూ శ్రీమతి షర్మిల ముందుకుసాగారు.

ఖమ్మం: శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారంనాడు ఖమ్మంజిల్లాలోని ముదిగొండ మండలం వల్లభి నుంచి ప్రారంభమై నేలకొండపల్లి మండలం అజయ్‌తండా వరకు కొనసాగింది. ఉదయం ఏడు గంటల నుంచే శ్రీమతి షర్మిల బస కేంద్రం వద్దకు సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీమతి షర్మిలను చూసేందుకు ఉత్సాహం చూపారు. ఉదయం 9 గంటలకు పాదయాత్ర వల్లభి నుంచి ప్రారంభమైంది. పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతం అంతా జనసంద్రాన్ని తలపించింది. రాయిగూడెంలోకి పాదయాత్ర చేరుతుండగా మహిళలు శ్రీమతి షర్మిలకు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఆ గ్రామ సెంటర్‌లో శ్రీమతి షర్మిల వైయస్‌ఆర్, బాబు జ‌గ్జీవన్‌రామ్ విగ్రహాలను ఆవిష్కరించారు. గ్రామంలోని మహిళా రైతులు శ్రీమతి షర్మిలకు మామిడి కాయలు, పూలు ఇచ్చి అభిమానాన్ని చాటుకున్నారు. ఇక్కడే గ్రామానికి చెందిన సూరేపల్లి సైదులు, రాజ్యం దంపతుల కుమారుడికి జగన్ అని ‌షర్మిల పేరు పెట్టారు. గ్రామ శివారుల్లో మేకల పెంపకందారులతో కొద్దిసేపు ముచ్చటించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అధైర్యం వద్దు.. మంచి రోజులు వస్తాయి :
పాదయాత్ర కొనసాగుతున్నంతసేపూ తమ బాధలు ప్రజలు చెబుతుంటే శ్రీమతి షర్మిల వారిని ఓదార్చారు. ‘అధైర్యపడకండి... మనకు మంచి రోజులు వస్తాయి...’ అంటూ వారిని ఓదార్చారు. గుంపులు గుంపులుగా తరలివస్తున్న జనాన్ని పలుకరిస్తూ ముందుకు సాగారు. రాయిగూడెం సమీపంలో వల్లభికి చెందిన రైతు కూలీలు రెండు కిలోమీటర్ల దూరం నుంచి పరుగున వచ్చి శ్రీమతి షర్మిలను పలకరించారు. వారితో మాట్లాడి ఆమె వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. వల్లభి, రాయిగూడెంలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున శ్రీమతి షర్మిల పాదయాత్రలో అడుగువేశారు.

స్వాతంత్య్ర యోధుల సంఘీభావం :
బుద్దారానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు గొట్టిముక్కల నర్సయ్యతో పాటు మరి కొందరు శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికి, ఆశీస్సులు అందించారు. నర్సయ్య బాగోగులను శ్రీమతి షర్మిల అడిగి తెలుసుకున్నారు. అలాగే బుద్దానానికి చెందిన నర్సయ్య, భూషయ్యలు శ్రీమతి షర్మిలను చూసేందుకు ఇబ్బందులు పడుతుంటే వారిని తోడ్కొని వచ్చి వారితో కొద్దిసేపు నడిచారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ శివారులో మహానేత డాక్టర్ వైయస్‌ఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేశారు. అప్పటికే భారీ ఎత్తున ప్రజలు సెంట‌ర్‌కు చేరుకోవడంతో వారందరికీ చేయెత్తి అభివాదం చేస్తూ శ్రీమతి షర్మిల ముందుకు కదిలారు.

జనసంద్రమైన చెరువుమాదారం :
శ్రీమతి షర్మిల పాదయాత్ర చెరువుమాదారం సరిహద్దుల్లోకి చేరుకున్న సమయంలో అప్పటికే భారీగా చేరుకున్న ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలతో, బాణసంచా కాలుస్తూ శ్రీమతి షర్మిల పాదయాత్రను ఆహ్వానించారు. గ్రామం సెంటర్‌లో వికలాంగుల సమస్యలపై ఏర్పాటుచేసిన రచ్చబండకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అక్కడే ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేయడంతో పాటు ఎస్సీ కాలనీలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామంలోని ప్రేమ సేవా సదన్ వద్ద సిస్ట‌ర్టు శ్రీమతి షర్మిలను ఆశీర్వదించారు. అనంతరం అక్కడి నుంచి ముందుకు కదిలిన శ్రీమతి షర్మిల పాదయాత్ర నేలకొండపల్లి మండలం అజయ్‌తండా వద్దకు చేరుకుంది.

తాజా వీడియోలు

Back to Top