అదిగో.. మహానేత రాజన్న బిడ్డ!

హైదరాబాద్, 7 ఫిబ్రవరి 2013: అడుగడుగునా ఆమెపై ఆప్యాయత.. అంతకు మించి విశేష ఆదరణ.. రాజన్న బిడ్డను చూడాలనే ఆదుర్దా.. కిలోమీటర్ల దూరం ఎదురేగి ఆహ్వానం.. ప్రతిగా ఆమె నుంచి వారికి కమ్మని పలకరింపు.. జన సందోహంలో పారవశ్యం.. ఇవి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న దృశ్యాలు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో పునఃప్రారంభించిన పాదయాత్రకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ సు‌వర్ణ పరిపాలనను గుర్తు చేసుకుంటూ ప్రస్తుత అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ‌ం తీరును శ్రీమతి షర్మిలతో ప్రజలు మొరపెట్టుకున్నారు.

దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డికి అంబోజి జంగయ్య వీరాభిమాని. టి.వి.లో, దినపత్రికల్లో రాజశేఖరరెడ్డి వార్త ఏదైనా ఉందంటే తప్పకుండా తెలుసుకునేవాడు. ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామానికి చెందిన జంగయ్య పెద్దగా చదువుకోలేదు. కానీ రాజశేఖరరెడ్డికి సంబంధించిన సమాచారం అంతా అతనికి తెలుసు. హెలికాప్టర్ ప్రమాదంలో వై‌యస్‌ఆర్‌ మరణించినప్పుడు జంగయ్య తల్లడిల్లిపోయాడు. అప్పటి నుంచీ ఆయన తనయుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డిలోనే మహానేత వైయస్‌ఆర్‌ను చూసుకుంటున్నాడు.

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న రాజన్న బిడ్డ శ్రీమతి షర్మిలను చూడగానే జంగయ్య ఒక్కసారిగా ఆనందంతో బావురుమన్నాడు. కన్నీరు పెట్టుకుంటూ వైయస్‌ను స్మరించుకున్న జంగయ్యను చూసి శ్రీమతి షర్మిల కూడా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ‘జంగయ్యా!’ అంటూ పేరు పెట్టి మహానేత తనయ ఆప్యాయంగా పిలవడంతో అతని ఆనందానికి హద్దులు లేకపోయాయి. శ్రీ జగనన్న చెల్లికి జంగయ్య గొర్రెపిల్లను బహూకరించి తన ఆప్యాయతను చాటుకున్నాడు.

ఫీజు తిరిగి రావడంలేదు: ఇంజినీరింగ్ విద్యార్థుల మొర‌:
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని ఇంజినీరింగ్ విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల మంగల్‌పల్లిగేట్ సమీపంలోని శ్రీఇందు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ‘హా‌య్ ఫ్రెండ్సు.. హౌ ఆర్‌ యూ’ అంటూ ఆప్యాయంగా పలకరించిన శ్రీమతి షర్మిలకు విద్యార్థులు ‘ఫైన్’ అంటూ సమాధానమిచ్చారు. ఇంజినీరింగ్ నా‌లుగవ సంవత్సరం చదువుతున్న ప్రత్యూష శ్రీమతి షర్మిల వద్దకు వెళ్లి, ఆమెకు విద్యార్థుల సమస్యలను వివరించింది. ఫీజు రీయింబర్సుమెంట్ ‌పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోవడంతో తాము ఇబ్బందులకు గురై చదువుపై దృష్టిసారించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మాటలకు స్పందించిన శ్రీమతి షర్మిల ఫీజు రీయింబర్సుమెంట్‌ను సక్రమంగా అమలు చేసేలా ప్రభుత్వంతో పోరాడతామని హామీ ఇచ్చారు. శ్రీ జగన్మోమోహన్‌రెడ్డి సిఎం అయితే విద్యార్థులకు పూర్తి న్యాయం చేస్తారని చెప్పారు.

బతుకులు ఆగమాగం చేస్తున్న ప్రభుత్వం:
శ్రీమతి షర్మిల శేరిగూడలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వందలాది మంది మహిళలు, రైతులు పాల్గొని తమ సమస్యలను విన్నవించుకున్నారు. 
షర్మిల : అమ్మా! ఎలా ఉన్నారు..? 
కంబాళపల్లి లక్ష్మమ్మ : నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఏం కొందామన్నా కూలి డబ్బులు సరిపోవడంలేదు. పేరుకు రూపాయి కిలో బియ్యం అని చెప్తున్నారు.. కానీ ఇతర నిత్యావసర ధరలు మాత్రం రోజురోజుకూ పెంచుతూ మాలాంటోళ్లు బతకడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు.
షర్మిల: త్వరలోనే రాజన్న రాజ్యం, జగనన్న పాలన వస్తుంది. అప్పుడు మన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. సిగ్గులేని ఈ ప్రభుత్వం పేదలను దోచుకుంటూ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోంది.
నర్కుడ పద్మ : మేం కూలి చేసుకుని నాలుగు పైసలు సంపాదిస్తాం. ఏదైనా లోన్‌ తీసుకుని ఇల్లు కట్టుకుందామంటే రుణాలు అందడంలేదు.
షర్మిల : ప్రతిపేదకు ఇల్లు ఉండాలని దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కి‌, సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోంది. త్వరలో మనకు మంచి రోజులు వస్తాయి.
బోసుపల్లి యాదమ్మ : తాగడానికి నీళ్లు లేవు.. నీటి కోసం తిప్పలు ఇప్పటి నుంచే మొదలవుతున్నాయి.
షర్మిల : తాగునీటి కోసం గ్రామీణ ప్రాంతాలు ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా రాజశేఖరరెడ్డి చర్యలు తీసుకునేవారు. ప్రస్తుత పాలకులు ప్రజల తాగునీటి సమస్యల్ని పట్టించుకోకుండా పదవుల కోసం కుస్తీలు పడుతున్నారు.

శేరిగూడలో స్థానికులతో రచ్చబండలో ప్రజల సమస్యలు తెలుసుకున్న శ్రీమతి షర్మిల తిరిగి తన పాదయాత్రను కొనసాగిస్తూ ఇబ్రహీంపట్నం బయలుదేరారు.

తాజా వీడియోలు

Back to Top