అధికార మిత్ర

కాన్ఫిడెన్స్ ఉన్నవాడికి కటౌట్ అక్కర్లేదు అంటారు. కానీ చంద్రబాబుకు తన నాలుగేళ్ల పరిపాలన మీద ఉన్న గొప్ప నమ్మకానికి నిదర్శనమే సాధికార మిత్రల నియామకం. పేరుకు ప్రభుత్వ పథకాల పనితీరు గురించి సాధికార మిత్రలను నియమిస్తున్నట్టు చెబుతున్నా అవి ఖచ్చితంగా అధికార మిత్రలుగా, ప్రభుత్వ మిత్రలుగా పనిచేయాలన్నదే లక్ష్యం అని సిఎమ్ చెప్పిన మాటలు బట్టే అర్థం అవుతోంది. చంద్రబాబుకు తన పాలనపై తనకే నమ్మకం లేక ప్రజలను మభ్యపెట్టేందుకు జరుగుతున్న అధికారిక కుట్ర ఇదని అంటున్నారు విమర్శకులు. ప్రభుత్వ ఉద్యోగులను పక్క రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయించిన ముఖ్యమంత్రికి ఇది పెద్ద విషయం కాదని కూడా విమర్శిస్తున్నారు. 

ప్రభుత్వం పట్ల సానుకూలత కలిగించడం 

చంద్రబాబు కోరుతున్న సానుకూలత ఏమిటి? ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నవారిని గుర్తించమని ఎందుకు చెబుతున్నట్టు? వారికి నచ్చజెప్పే బాధ్యత మీదే అంటూ సాధికార మిత్రలుగా ఉన్న మహిళలకు సూచనలివ్వడంలో ఆంతర్యం ఏమిటి? వీటన్నిటి వెనకున్న ఒకే కారణం నాలుగేళ్ల టిడిపి పాలనలో అంతులేని అసంతృప్తి ప్రజల్లో పేరుకుపోయింది. ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ విధివిధానాలపట్ల ప్రజలు ఆకర్షితులౌతున్నారని. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను అభిమానిస్తున్నారని. రానున్న ఎన్నికల్లో ఈ భావనలే ఫలితాలను నిర్ణయిస్తాయి కనుక చంద్రబాబు గడప గడపలో అసంతృప్తులను బుజ్జగించమని ఉద్యోగులను నియమిస్తున్నాడు. ఇన్నాళ్లూ ప్రభుత్వ చర్యలతో, నిర్లక్ష్యంతో టిడిపి పట్ల వ్యతిరేకత ఉన్న వారందరినీ నయానో భయానో ఒప్పించడమే మీ విధి అంటూ చంద్రబాబు సాధికారమిత్రలకు భుజాల మీద బాధ్యత మోపాడు. 

సంతృప్త స్థాయిలేమయ్యాయి?

ఏటా తమ పాలన పట్ల ప్రజల్లో సంతృప్తి పొంగి పొర్లిపోతోందని డాష్ బోర్డు సీఎమ్ గారు లెక్కలు చెబుతుంటారు. నాలుగు రోజుల ముందు కూడా రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా 75% మంది ప్రజలు ప్రభుత్వ విధానాలు, సేవల విషయంలో సంతృప్తికరంగా ఉన్నారంటూ స్వయంగా ముఖ్యమంత్రే వెల్లడించారు. మరి అలాంటప్పుడు అసంతృప్తిగా ఉన్నవారిని గుర్తించడం, ఒప్పించడం ఎందుకు? దీనిబట్టే చంద్రబాబు అబద్ధాల పురాణం బైటపడుతోంది. జన్మభూమి, రచ్చబండ, నీరు చెట్టు కార్యక్రమాలకు వెళ్లనప్పుడుల్లా చంద్రబాబుకు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. సంతృప్తి సంగతటుంచి, బాబు కనిపించగానే తమ అసంతృప్తులను వెళ్లగక్కుతున్నారు. ఎవ్వరినడిగానా రేషన్, పించన్, రుణమాఫీ, జన్మభూమి కమిటీల దాష్టీకాల గురించే మాట్లాడుతున్నారు. ప్రతి చోటా చంద్రబాబు అయ్యో అలా జరుగుతోందా అంటూ అమాయిక మైన ముఖాన్ని ప్రదర్శించాల్సి వస్తోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా ఎద్దేవా చేసారు. విద్య, వైద్యం, రేషన్, ప్రభుత్వ బడులు, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇలా దేని గురించి అడిగినా చంద్రబాబు ఇప్పుడే ఆ సమస్యను చూస్తున్నట్టు ముఖం పెడుతున్నాడని అన్నారు ప్రతిపక్ష నేత. 

ప్రజలకు నచ్చజెప్పాలట

ఇదీ రాష్ట్ర ముఖ్యమంత్రి తాను నియమించిన అనఫిషియల్ పార్టీ మొబిలైజర్లకు చేసిన దిశా నిర్దేశం. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటే దాన్ని తగ్గించి, వారు సంతృప్తి చెందేలా, నచ్చజెప్పాలి అని చెబుతున్నారు ముఖ్యమంత్రి. అంటే ఇన్నాళ్లుగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పనులను త్వరితంగా చేయిస్తామని, టిడిపి కే ఓటు వేయాలని పరోక్షంగా ప్రజలకు చెప్పించే కార్యక్రమమే ఇది. 

ప్రజల సొమ్ముతో ప్రజలకే టోపీ

ఖజానాలోని ప్రజాధనాన్ని ప్రజలను మభ్యపెట్టడానికి ఆ ప్రజలకే ఇవ్వడం ఇంకెక్కడా చూడలేం. సెల్ ఫోన్లు, లాప్ టాప్ లు, రీఛార్జులు ప్రభుత్వ సొమ్మునుండి దర్జాగా ఇస్తూ పార్టీ మనుగడను కాపాడుకోవాలని తంటాలు పడుతున్నారు చంద్రబాబు. 
 
Back to Top