అధికార దుర్వినియోగంలో బాబు నెంబర్ 1

 

కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానిక పాల్పడుతోందని వాపోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అధికార దుర్వినియోగం అంటే బాబు దృష్టిలో తమ పార్టీకీ, తమ ప్రభుత్వానికి, తమ పార్టీ నేతలకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరించడం అన్నమాట. అసలు అధికార దుర్వినియోగానికి అసలైన అర్థం బాబు దగ్గరే నేర్చుకోగలం. అలాంటి బాబు తనదాకా వచ్చేసరికి రాష్ట్ర హక్కుల హననం అంటూ స్టేట్ మెంట్లు ఇవ్వడమే విడ్డూరం.

పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ని కేవలం ఆయన రాజకీయ భవిష్యత్ కోసం వదిలేసి, ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టడం అధికార దుర్వినియోగం కాదా?

సిబిఐ లాంటి అత్యున్నత సంస్థను తన విధులు నిర్వహించకుండా అడ్డుకుంటూ, రాష్ట్రంలో అడుగుపెట్టనీకుండా ఉత్తర్వులివ్వడం అధికార దుర్వినియోగం కాక మరేమిటి? సొంత పార్టీ నేతల అవినీతి చిట్టాలు, దాని వెనక ఉన్న తన చీకటి కోణాన్ని దాచేందుకు బాబు చేసిన అధికార దుర్వినియోగమే సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవడం అని విశ్లేషకులే అంటున్నారు.

ప్రభుత్వ అధికారులను పార్టీ కార్యకలాపాలకు విచ్చవిడిగా వాడుకోవడం బాబు దృష్టిలో అధికార దుర్వినియోగం అనిపించుకోదు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారానికి  ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం అధిపతిని పంపడం ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. చంద్రబాబు పార్టీ పరంగా జరిగే సభలకు సైతం అధికారులను, ప్రభుత్వోద్యోగులను తరలించడం ఏ విధమైన అధికారిక చర్యగా సమర్థించుకుంటారో వారికే తెలియాలి.

సభలు, సమావేసాలు, సమ్మిట్ లు, స్టార్ హోటళ్లలో వసతి, భోజనాలు, ఫలహారాలు, ఖరీదైన వాహనాలలో ప్రయాణాలు, విమాన ప్రయాణాలు ఇలా వీటన్నిటికోసం కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అధికార దుర్వినియోగం కాదా? అధికారిక సమావేశాలకు వీలైన ప్రభుత్వ భవనాలూ, ఓపెన్ గ్రౌండ్సూ, గెస్టు హౌసులూ ఉన్నా బాబుగారు మాత్రం ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టేందుకే ఇలాంటి కార్యక్రమాలన్నీ కన్వెన్షన్ సెంటర్లలో పెడుతున్నారన్నది బహిరంగ సత్యమే. ఆయా స్టార్ హోటళ్ల యజమాన్యాలు పక్కా సీఎం సొంత సామాజిక వర్గం, ఆయన ఆనుయాయులకు చెందినవే అని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు.

స్వయంగా ముఖ్యమంత్రే ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లు, విదేశీ టూర్ల పేరుతో వేల కోట్ల రూపాయలను తగలేయడం అధికార దుర్వినియోగమే.

ప్రభుత్వ ఉద్యోగాలకు మంగళంపాడి ఆ స్థానే కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకోవడం వెనుక కూడా ప్రభుత్వంలో ప్రముఖ నేతల హస్తం ఉంది. వారికి చెందిన సంస్థలే ఈ కాంట్రాక్టు ఉద్యోగులను అందిస్తూ ప్రభుత్వం నుంచి కోట్లరూపాయిల బిల్లులు దండుకుంటున్నారు. సొంత వారికి ప్రయోజనం చేకూర్చేవిధంగా బాబు చేస్తున్న ఈ పనులు అధికార దుర్వినియోగం కిందకే వస్తాయి.

అఫిషియల్ గా మంత్రి, ముఖ్యమంత్రి పాల్గొనవలిసిన కార్యక్రమాల్లో ప్రొటోకాల్ కు విరుద్ధంగా కుటుంబ సభ్యులను పాల్గొనేలా చేయడం అధికార దుర్వినియోగమే.

సాగునీటి ప్రాజెక్టుల్లో, విద్యుత్ ప్రాజెక్టుల్లో, సంక్షేమ పథకాల్లో, ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇలా అడుగడుగునా స్వజాతీయులకు, బినామీలకు కాంట్రాక్టులు కట్టబెట్టడం కూడా అధికారదుర్వినియోగమే అని చంద్రబాబుకు తెలియదా?

కమీషన్లు తీసుకున్న షెల్ కంపెనీలకు కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టపెట్టి, ఎలాంటి నిర్మాణాలు చేయకపోయినా ఆ భూములుపై రుణాలు తెచ్చుకునే, అమ్ముకునే అవకాశం కల్పిస్తూ జీవోలు జారీచేయడం అధికార దుర్వినియోగం అనిపించుకోదా?

బాబు అధికార దుర్వినియోగంలో అన్ని పర్వాలూ ఎప్పుడో పూర్తి అయిపోయాయి. ఇలాంటి వ్యక్తి మరొకరిని వేలెత్తి చూపించడం చూస్తే తాము చేస్తే చెల్లుబాటు, ఎదుటివారు చేస్తే తిరుగుబాటు అన్నట్టుగా ఉంటుంది.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top