బందరు పోర్టు లో భూసేకరణ కు మొండి గా ముందుకు వెళుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. 60 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణకు ఇచ్చిన గడువు నిన్నటితో ముగిసింది. మొత్తంగా 4, 889 అభ్యంతరాలు అంటే దాదాపుగా అయిదు వేల వరకు వచ్చినట్లుగా అధికారులు ప్రకటించారు. బందరు పోర్టు పేరు చెప్పి అక్కడ నిరుపేదల భూముల్ని లాగేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం స్కెచ్ వేసిన సంగతి తెలిసిందే. అందుకే కాలం చెల్లిపోతున్న ఆర్డినెన్స్ ఆధారంగా భూ సేకరణ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 31 తో ఆర్డినెన్స్ కు కాలం చెల్లిపోతుండటంతో ఆ రోజే నోటిఫికేషన్ ఇచ్చి అభ్యంతరాలు ఉంటే తెలియ చెప్పమని ప్రకటించారు. బందరు మండలంలోని 24 గ్రామాలు, పెడన మండలంలోని ఒక గ్రామంలోని భూముల్ని లాక్కొనేందుకు పావులు కదిపారు. సుమారు 15 వేల ఎకరాలు ప్రైవేటు భూములు, 15 వేల ఎకరాలు అసైన్డ్ భూముల్ని కబళించేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బందరు పోర్టు పోరాట సమితి నాయకులకు చంద్రబాబు సంఘీభావం పలికారు. మహా అయితే రెండున్నర వేల ఎకరాలు అయితే బందరు పోర్టుకి సరిపోతుందని, అంతకు మించి అవసరం లేదని బహిరంగంగా ప్రకటించారు. అధికారంలోకి రాగానే మాట మారింది. మొత్తంగా 30వేల ఎకరాల్ని కబళించేందుకు రంగం సిద్దం చేశారు.ఊహించని విధంగా వేల సంఖ్యలో అభ్యంతరాలు రావటంతో ప్రభుత్వ పెద్దలు ఆలోచనలో పడ్డారు. తిమ్మిని బమ్మి చేసి అయినా సరే, భూములు కబళించేందుకు పావులు కదుపుతున్నారు. రైతుల కోర్టుకి వెళ్లేఅవకాశం ఉన్నందున.. ఆ అవకాశం ఇవ్వకుండా చేసేందుకు మార్గాలు వెదకుతున్నట్లు సమాచారం.